స్టాండింగ్ కమిటీకి 21 నామినేషన్లు
ABN , Publish Date - Jul 30 , 2025 | 12:46 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి 21 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు.
టీడీపీ నుంచి తొమ్మిది, బీజేపీ నుంచి ఒకటి...
వైసీపీ నుంచి పది... జనసేన నుంచి ఒకటి
పార్టీ అంగీకారం లేకుండా సాదిక్ నామినేషన్
నేడు నామినేషన్ల పరిశీలన
విశాఖపట్నం, జూలై 29 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి 21 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారు. వచ్చే నెల ఆరున జరిగే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ల దాఖలుకు గడువు మంగళవారంతో ముగిసింది. స్టాండింగ్ కమిటీలో పది స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు కమిషనర్ కేతన్‌గార్గ్ ఈనెల 21న నోటిఫికేషన్ జారీచేశారు. వైసీపీ నుంచి పది మంది కార్పొరేటర్లు ఈనెల 26న నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్లు పంపకాలు తేలకపోవడంతో మంగళవారం మధ్యాహ్నం వరకూ పోటీకి దిగే అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు. చివరకు జనసేన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి దిగడం లేదని స్పష్టం చేయడంతో, బీజేపీకి ఒక సీటు కేటాయించి మిగిలిన తొమ్మిది సీట్లకు టీడీపీ కార్పొరేటర్లను పోటీకి నిలపాలని నిర్ణయించారు. అయితే 39వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి వైసీపీలో చేరి, ప్రస్తుతం జనసేనలో చేరిన మహ్మద్ సాదిక్ మంగళవారం ఉదయాన్నే నామినేషన్ దాఖలు చేయడం కూటమి పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
పార్టీ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ అధ్యక్షతన సోమవారం కార్పొరేటర్లంతా సమావేశమై పోటీకి దూరంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చామని, కానీ సాదిక్ మాత్రం పార్టీ అనుమతి లేకుండానే నామినేషన్ దాఖలు చేశారని ఆ పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు చెబుతున్నారు. రెండో తేదీ వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉండడంతో సాదిక్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందని టీడీపీ కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు.
నామినేషన్ వేసిన అభ్యర్థులు...(బ్రాకెట్‌లో వార్డు, పార్టీ)
1. గంకల కవిత (48, బీజేపీ), 2. మహ్మద్ సాదిక్ (39, ఇండిపెండెంట్...జనసేనకు మద్దతు), 3. దాడి వెంకట రామేశ్వరరావు (89, టీడీపీ), 4. సేనాపతి వసంత (97, టీడీపీ), 5.మొల్లి హేమలత (5, టీడీపీ), 6. మాదంశెట్టి చినతల్లి (84, టీడీపీ), 7. గేదెల లావణ్య (17, టీడీపీ), 8. రాపర్తి త్రివేణివరప్రసాదరావు (93, టీడీపీ), 9.రౌతు శ్రీనివాసరావు (79, టీడీపీ), 10.మొల్లి ముత్యాలు (88, టీడీపీ), 11. కొణతాల నీలిమ (80, టీడీపీ), 12. నక్కెళ్ల లక్ష్మి (20, వైసీపీ), 13. సాది పద్మారెడ్డి (24, వైసీపీ) 14. పల్లా అప్పలకొండ (28, వైసీపీ) 15. బిపిన్‌కుమార్‌జైన్ (31, వైసీపీ) 16. గుండపు నాగేశ్వరరావు (40, వైసీపీ), 17. కోడిగుడ్ల పూర్ణిమ (41; వైసీపీ), 18.రెయ్యి వెంకటరమణ (51, వైసీపీ), 19. కేవీఎన్ శశికళ (55, వైసీపీ), 20. మహ్మద్ ఇమ్రాన్ (66 వైసీపీ), 21. ఉరుకూటి రామచంద్రరావు (70, వైసీపీ)