ఎకనామిక్ జోన్‌కు 20,000 ఎకరాలు
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:21 AM
ఉత్తరాంధ్రకు ఐటీ, భారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించిన కూటమి ప్రభుత్వం, అందుకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తోంది.
నాలుగు జిల్లాల్లో ఐదేసి వేల ఎకరాలు...
విశాఖకు 50 కి.మీ.లోపు భూములు గుర్తించాలని అధికారులకు ఆదేశాలు
శ్రీకాకుళం జిల్లాలో అయితే భోగాపురం ఎయిర్‌పోర్టుకు 30-40 కిలోమీటర్ల పరిధిలో...
రోడ్డు కనెక్టివిటీపైనా ప్రత్యేక దృష్టి
భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ముందుగానే విస్తరణ
విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి):
ఉత్తరాంధ్రకు ఐటీ, భారీ పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందించిన కూటమి ప్రభుత్వం, అందుకు తగిన విధంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలను కలిపి కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్’కు 20 వేల ఎకరాలు సేకరించనున్నారు.
ఎకనామిక్ జోన్‌కు భూముల సేకరణపై ఆదివారం విశాఖలో నాలుగు జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన సమావేశంలో చర్చించారు. విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూములు ఐదు వేల ఎకరాలు లేవని అధికారులు వివరించారు. ఆనందపురం, భీమిలి, పద్మనాభం, పెందుర్తి, గాజువాక మండలాల్లో ప్రభుత్వ, డీపట్టా భూములు మూడు వేల ఎకరాల వరకూ ఉన్నాయన్నారు. మిగిలిన మూడు జిల్లాల్లో ఐదు వేల ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములు ఉన్నాయని సంబంధిత అధికారులు నివేదించారు. విశాఖ నగరానికి 50 కి.మీ. పరిధిలోపు, శ్రీకాకుళం జిల్లాలో మాత్రం భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి 30 నుంచి 40 కి.మీ. పరిధిలో భూములు మాత్రమే గుర్తించాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఐటీ కార్యదర్శి కాటంనేని భాస్కర్ సూచించారు. విశాఖకు సమీపంలో అయితేనే పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు మొగ్గుచూపుతాయని, అలాగే శ్రీకాకుళం జిల్లాలో భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అరగంటలో చేరుకునేలా ఉంటేనే పెట్టుబడుదారులు ముందుకు వస్తారని స్పష్టంచేశారు.
అలాగే రోడ్ కనెక్టవిటీపైనా మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా చర్చించారు. బెంగళూరు, పూణే, హైదరాబాద్, తదితర నగరాల్లో ట్రాఫిక్ సమస్య కంపెనీలు, ఉద్యోగుల సహనానికి పరీక్ష పెడుతుందని, ఈ నేపథ్యంలో కొన్ని సంస్థలు ఏపీ వైపు చూస్తున్నందున వారికి ఇబ్బంది లేకుండా రోడ్ కనెక్టవిటీ పెంచాలని లోకేశ్ కోరారు. కంపెనీలు వచ్చిన తరువాత కాకుండా ముందుగానే రహదారుల విస్తరణ, అవసరమైన ప్రాంతాల్లో నాలుగు నుంచి ఆరులైన్ల రోడ్ల ఏర్పాటు దిశగా దృష్టిసారించాలని ఆదేశించారు. కంపెనీల కార్యకలాపాలు ప్రారంభించిన తరువాత ట్రాఫిక్ సమస్య పెరిగితే స్థానికులు, ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందని, అందుకే ముందుగానే పక్కాగా రోడ్ కనెక్టవిటీ ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలో ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2024 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన సమావేశంలో గుర్తుచేశారు. అందుకు తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. ఈ వారంలో ఆస్ట్రేలియా వెళ్లి అక్కడ ఒక కంపెనీతో చర్చించనున్నామని వివరించారు. వచ్చే నెలలో విశాఖలో నిర్వహించనున్న పెట్టుబడులు సదస్సులో మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు జరగనున్నాయన్నారు.
ఇదిలావుండగా విశాఖ జిల్లాలో 15 మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధికి ఇప్పటికే వీఎంఆర్‌డీఏ అధికారులు నడుంబిగించారు. ఈ రోడ్లకు పొరుగు జిల్లాల నుంచి అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. ఒక జిల్లాలో పరిశ్రమలు, మరో జిల్లాలో ఎయిర్‌పోర్టు, మరో జిల్లాలో భూములు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు జిల్లాల మధ్య అనుసంధానం కోసం గ్రేటర్ విశాఖ ఎకనామిక్ జోన్ ఏర్పాటుచేస్తున్నారు.