Share News

స్టీల్‌ ప్లాంటులో 2 విభాగాలు ప్రైవేటుపరం

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:33 AM

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది.

స్టీల్‌ ప్లాంటులో 2 విభాగాలు ప్రైవేటుపరం

  • ఒకటి...రా మెటీరియన్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ), మరొకటి సింటర్‌ ప్లాంటు...

  • ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసిన యాజమాన్యం

  • ఆయా విభాగాల్లో 700 మంది శాశ్వత ఉద్యోగులు, వెయ్యి మంది వరకూ కాంట్రాక్టు కార్మికులు...

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. అత్యంత కీలకమైన రెండు విభాగాల నిర్వహణను కాంట్రాక్టుకు ఇస్తామని ప్రకటించింది. ఆసక్తి కలిగిన సంస్థలు ముందుకు రావాలని కోరింది. దీనికోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ) ప్రకటన జారీ చేసింది. అందులో ఒకటి రా మెటీరియన్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) కాగా మరొకటి సింటర్‌ ప్లాంటు. ఈ రెండింటిలో శాశ్వత ఉద్యోగులు 700 మంది పనిచేస్తుండగా, కాంట్రాక్టు వర్కర్లు వెయ్యి మంది వరకు ఉన్నారు. ఈ రెండింటినీ ప్రైవేటుకు అప్పగిస్తే ఆ వెయ్యి మంది కాంట్రాక్టు వర్కర్లను తీసేయాల్సి ఉంటుంది. ఇక శాశ్వత ఉద్యోగులలో ఇరవై శాతం మందిని పర్యవేక్షణకు ఉంచి మిగిలిన వారిని ఇతర విభాగాలకు సర్దుబాటు చేస్తారు. ఈ ప్రకటన నేపథ్యంలో ఆ విభాగాల్లో పనిచేసేవారు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకుంటే వారికి సెటిల్‌మెంట్‌ చేసేస్తారు.

అత్యంత కీలకం ఆర్‌ఎంహెచ్‌పీ

విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంటుగా పేరుంది. అంటే ముడి పదార్థాల సేకరణ నుంచి ఫినిష్డ్‌ ప్రొడక్ట్‌ వరకు అన్నీ ఒకే దగ్గర జరుగుతాయి. అవి కూడా ఒకటే యాజమాన్యం పరిధిలో ఉంటాయి. కానీ ప్రస్తుతం యాజమాన్యం ఏ విభాగానికి ఆ విభాగం విడగొట్టి ప్రైవేటుకు అప్పగిస్తోంది. స్టీల్‌ తయారీకి అవసరమైన ఐరన్‌ఓర్‌, లైమ్‌ స్టోన్‌, డోలమైట్‌, క్వార్ట్జ్‌, మాంగనీస్‌ తదితరాలు రోజుకు ఐదు నుంచి ఆరు ర్యాకులు (అంటే రైళ్లు) వస్తాయి. వాటిని అన్‌లోడ్‌ చేసి, కన్వెయర్‌ బెల్ట్‌ల ద్వారా అవసరమైన విభాగాలకు పంపించాలి. బొగ్గు వచ్చినప్పుడు థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకు, కోక్‌ ఓవెన్‌లకు చేరవేయాలి. ఈ ప్రక్రియ అంతా రా మెటీరియన్‌ హ్యాండ్లింగ్‌ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) చూస్తుంది. ఇందులో కన్వెయర్‌ గ్యాలరీలు, టిప్లర్‌ ఏరియా చాలా ప్రమాదకరమైనవి.

సింటర్‌ ప్లాంటు సాంకేతిక నిర్వహణ

సింటర్‌ ప్లాంటు కూడా ప్లాంటులో కీలకమైనదే. ఇక్కడ స్టీల్‌ తయారీకి అవసరమైన అన్ని ముడి పదార్థాలను శుద్ధి చేసి, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లకు పంపుతారు. అంటే ఐరన్‌ఓర్‌, లైమ్‌స్టోన్‌, డోలమైట్‌, కాల్షియం వంటివి నిర్దేశిత నిష్పత్తిలో పొడి చేసి, మలినాలను తొలగించి రెడీమిక్స్‌గా సింటర్‌ను తయారుచేసి బ్లాస్ట్‌ ఫర్నేస్‌కు పంపుతారు. ఇందులో సుమారు 25 విభాగాలు ఉంటాయి. వీటికి సంబంధించి టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌తో పాటు నిర్వహణ కూడా కాంట్రాక్టుకు ఇవ్వడానికి ఈఓఐ పిలిచారు. ఈ రెండు విభాగాల్లో హౌస్‌ కీపింగ్‌ కూడా కాంట్రాక్ట్‌ సంస్థే చూసుకోవాలని సూచించారు.

శాశ్వత ఉద్యోగుల సంఖ్య 7,500కు తగ్గించే లక్ష్యం

స్టీల్‌ ప్లాంటు యాజమాన్యం శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌ వర్కర్లను గణనీయంగా తగ్గించాలని నిశ్చయించుకుంది. దీని కోసం క్రమానుగతంగా నిర్ణయాలు తీసుకుంటూ వెళుతోంది. మొదట వీఆర్‌ఎస్‌ ద్వారా 1,200 మందిని ఇంటికి పంపించేశారు. ఇప్పుడు రెండో విడత వీఆర్‌ఎస్‌ ప్రకటించారు. దరఖాస్తుల సంఖ్య 750 దాటి పోయింది. ప్రతి నెలా 100 మంది వరకు పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు పది వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా వారిని నాలుగో వంతు తగ్గించుకోవడానికి విభాగాల ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాంట్రాక్టు వర్కర్లను ఇష్టానుసారంగా తొలగించుకుంటూ పోతున్నారు. అవసరమైతే తీసుకుంటామని చెబుతున్నారు. కొత్తగా కాంట్రాక్టులు తీసుకునే సంస్థలకు తొలగించిన కాంట్రాక్టు వర్కర్లను తీసుకుకోవాలని చెబుతామనే హామీ మాత్రం ఇవ్వడం లేదు.

వీఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

జీతాలు సక్రమంగా చెల్లించకపోవడం,

పనిభారం పెరగడమే కారణం

ఉక్కుటౌన్‌షిప్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటులో వీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు నెలల క్రితం మొదటిసారి వీఆర్‌ఎస్‌ ప్రకటించగా సుమారు 1,600 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,163 మంది దరఖాస్తులను యాజమాన్యం ఆమోదించింది. మలివిడత వీఆర్‌ఎస్‌కు ఈ నెల 14న నోటిఫికేషన్‌ ఇచ్చిన యాజమాన్యం 16వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చే నెల 15వ తేదీ వరకూ సమయం ఉన్నప్పటికీ ఉద్యోగులు చివరివరకూ వేచి ఉండకుండా దరఖాస్తు చేసేస్తున్నారు. ఇప్పటికి సుమారు వెయ్యి మంది వరకు దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే ఎంతమందికి యాజమాన్యం ఆమోదం తెలుపుతుందన్న దానిపై స్పష్టత లేదు. చాలాకాలంగా ప్లాంటులో జీతాలు సక్రమంగా ఇవ్వడం లేదు. ఉద్యోగుల సంఖ్య కూడా తక్కువగా ఉంది. ఇటువంటి తరుణంలో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుండడంతో పనిభారం మరింత పెరుగుతుందని భావించి పలువురు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.

27న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ప్రారంభం

విశాఖపట్నం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటులో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ను ఈ నెల 27వ తేదీ మద్యాహ్నం 12.22 గంటలకు ప్రారంభించాలని ముహూర్తం పెట్టారు. దీనికి ఢిల్లీ నుంచి స్టీల్‌ మంత్రిత్వ శాఖ సెక్రటరీ సందీప్‌ పాండ్రిక్‌ హాజరు కానున్నారు. ప్లాంటును పూర్తి సామర్థ్యంతో నడిపితేనే నష్టాల నుంచి బయట పడతారని, అందుకు అవసరమైన ముడి పదార్థాల కోసం కేంద్రం రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం కూడా విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్ను, నీటి పన్ను తదితరాలు కొన్నాళ్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా రూ.2 వేల కోట్ల వరకూ బకాయిలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత డిసెంబరులో మూతపడిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు. ఇది మొదలైతే రోజుకు 20 వేల టన్నులకు పైగా స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది.

Updated Date - Jun 24 , 2025 | 01:33 AM