మధురవాడలో 2 ఐకానిక్ ప్రాజెక్ట్‌లు
ABN , Publish Date - Mar 13 , 2025 | 01:33 AM
జనాభా విస్తృతంగా పెరుగుతున్న మధురవాడ ప్రాంతంలో మరో రెండు కీలకమైన ఐకానిక్ ప్రాజెక్టులకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది.

రూ.460 కోట్లతో ఈస్ట్‌కోస్ట్ హేబిటేట్ సెంటర్
సెంటర్‌లో...ఆఫీస్‌లకు అవసరమైన స్థలం, బిజినెస్ సెంటర్, ఆడిటోరియం, హోటల్, సర్వీస్ అపార్టుమెంట్, ఈవెంట్/పార్టీ లాన్స్, ఫైన్ డైన్ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్...
మరొకటి...వైజాగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్
వై, జెడ్, ఆల్ఫా తరాల కోసం ఏర్పాటు
ఆర్‌పీఎఫ్‌లు ఆహ్వానించిన వీఎంఆర్‌డీఏ
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జనాభా విస్తృతంగా పెరుగుతున్న మధురవాడ ప్రాంతంలో మరో రెండు కీలకమైన ఐకానిక్ ప్రాజెక్టులకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ప్రణాళిక సిద్ధం చేసింది. కొత్త ప్రాజెక్టులన్నీ పీపీపీ విధానంలోనే చేపట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు వీటి టెండర్లకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌పీఎఫ్) కోరుతూ ప్రకటన జారీచేసింది.
రూ.460 కోట్లతో ఈస్ట్‌కోస్ట్ హేబిటేట్ సెంటర్
లా కళాశాల రోడ్డులో పనోరమ హిల్స్ వద్ద సుమారు 8.82 ఎకరాల విస్తీర్ణంలో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ నిర్మించనుంది. ఇందులో ఆఫీస్‌లకు అవసరమైన స్థలం, బిజినెస్ సెంటర్, ఆడిటోరియం, ఎగ్జిబిషన్ హాల్, బొటిక్, హోటల్, సర్వీస్ అపార్టుమెంట్, ప్రీమియం క్లబ్, ఈవెంట్/పార్టీ లాన్స్, ఫైన్ డైన్ రెస్టారెంట్లు, స్పోర్ట్స్ సెంటర్, సూపర్ మార్కెట్, మెడికల్ సెంటర్, బ్యాంకులు ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.460 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా. ముందుకువచ్చే వారికి 33 ఏళ్ల లీజుకు ఇస్తారు. నిర్మాణానికి మూడేళ్లు గడువు ఇవ్వనున్నట్టు వీఎంఆర్‌డీఏ వెల్లడించింది.
కొత్త తరాలను ఆకట్టుకునేలా వీఆర్ ఎరీనా, 3 స్టార్ హోటల్
విశాఖపట్నం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి సాధించడానికి నూతన తరాలను ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఇది కూడా లా కాలేజీ మార్గంలో ఐకానికా గ్రాండ్ సమీపాన 2.82 ఎకరాల్లో వస్తుంది. గేమింగ్‌కు మొగ్గు చూపే యువతను ఆకర్షించేలా వర్చువల్ రియాల్టీ, ఆగ్‌మెంటెడ్ రియాల్టీ, ఇంటరాక్టివ్ గేమింగ్ వంటి సాంకేతిక అంశాలతో దీనిని తీర్చిదిద్దుతారు. ఇవి వై, జెడ్, ఆల్ఫా తరాలకు చెందిన యువతను లక్ష్యంగా చేసుకొని నిర్మించనున్నారు. 360 డిగ్రీల ఇమ్మెన్సివ్ థియేటర్, మిక్స్‌డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, యానిమేషన్ షో, వీఆర్ గేమింగ్ జోన్, అక్వేరియం వంటి ఉంటాయి. డ్రైవ్-ఇన్ ఫుడ్ జోన్, 24/7 కేఫ్‌లు, 3 స్టార్ హోటల్ నిర్మిస్తారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే ఐటీ కంపెనీలు, అందులో పనిచేసే ఉద్యోగుల కుటుంబాల అవసరాల కోసం దీనిని డిజైన్ చేశారు.
కొత్త తరాలంటే...
‘వై’ జనరేషన్ అంటే...1981-1996 మధ్య పుట్టినవారు. 28 ఏళ్ల నుంచి 42 మధ్య వయసు కలిగినవారు. వీరిని మిలేనియల్స్ అని కూడా వ్యవహరిస్తున్నారు. వీరు టెక్నాలజీపై ఆసక్తితో పాటు వివిధ అంశాలపై అవగాహన కలిగి ఉంటారు.
‘జెడ్’ జనరేషన్ అంటే...1997-2012 మధ్య జన్మించినవారు. వీరి వయస్సు 11 నుంచి 26 ఏళ్ల మధ్య ఉంటుంది. ఇండిపెండెంట్‌గా, హైపర్-డిజిటల్‌గా ఉంటారు. స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా, ఈ-కామర్స్‌తో అనుబంధం కలిగిన వారు.
‘ఆల్ఫా’ జనరేషన్ అంటే...2013-2025 మధ్య జన్మించినవారు. పదేళ్లలోపు వయస్సువారు.