1579 మంది అనర్హులు
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:34 AM
1579 మంది అనర్హులు
దివ్యాంగ పింఛనుదారుల రీవెరిఫికేషన్‌లో అధికారుల
నిర్ధారణ
విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు తీసుకుంటున్న వారిలో 1,579 మంది అనర్హులు ఉన్నట్టు అధికారులు తేల్చారు. వారికి ఆగస్టు నెలకు సంబంధించి పింఛన్ నిలిపివేశారు. అయితే తామంతా 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యంతో బాధపడుతున్నా అనర్హులుగా పేర్కొనడం భావ్యం కాదని పింఛన్లు రద్దయినవారు వాపోతున్నారు.
సామాజిక పింఛన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నారన్న ఫిర్యాదులతో ప్రభుత్వం ప్రత్యేక సర్వేకు ఆదేశించింది. ముఖ్యంగా దివ్యాంగులు, వైద్య సహాయం కోటా కింద పింఛన్లు తీసుకునే వారిని తనిఖీ చేయాలన్న ఆదేశాలతో గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 312 మంది ప్రతినెలా రూ.10 వేల నుంచి రూ.15 వేలు, మరో 12,306 మంది ప్రతి నెల రూ.6 వేలు పింఛన్ తీసుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో తలసేమియా, డయాలసిస్, కిడ్నీ మార్పిడి, 100 శాతం అంగవైకల్యం, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు పింఛన్ ఇస్తున్నారు. అయితే గత ఏడాది ప్రభుత్వ ఆదేశాల మేరకు 312 మంది పింఛన్‌దారులకు వైద్య పరీక్షలు నిర్వహించి నివేదిక ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంతవరకూ వారిలో అనర్హులు ఉన్నారా? లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోనందున వారికి యథావిధిగా ప్రతినెల రూ.15 వేల వంతున పింఛన్ వస్తోంది. కాగా ప్రతి నెల రూ.6 వేల వంతున పింఛన్ తీసుకునే 12,306 మందికి గత ఏడాది డిసెంబరు నుంచి దశల వారీగా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. జూలై వరకు దాదాపు పది వేల మందికి కేజీహెచ్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఈఎన్‌టీ ఆస్పత్రుల్లో తనిఖీలు చేపట్టారు. అందులో 1,579 మంది 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్నట్టు వైద్యుల బృందం తేల్చింది. జీవీఎంసీ పరిధిలో 1178 మంది, నాలుగు గ్రామీణ మండలాల్లో 401 మంది ఉన్నట్టు గుర్తించారు. అయితే రీవెరిఫికేషన్‌లో 125 మంది 40 శాతం కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్నట్టు నిర్ధారించారు. మరో 182 మంది 60 ఏళ్లు దాటినవారు కావడంతో వృద్ధాప్య పింఛన్లు తీసుకునేందుకు అర్హులుగా తేల్చారు. ఈ 307 మందికి త్వరలో సొమ్ము బట్వాడా చేస్తారు. కాగా దివ్యాంగ పింఛన్లు నిలిపివేతకు సంబంధించి నోటీసులు జారీచేస్తున్నారు. నోటీస్ అందుకున్న నెల రోజులలో జోనల్ కమిషనర్/ఎంపీడీవోకు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అయితే కొందరు పింఛన్‌దారులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. గతంలో తమకు 40 శాతం అంగవైకల్యం ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చారని, ఇప్పుడు అవే పత్రాలు తప్పని ఎలా చెబుతారని నిలదీస్తున్నారు.