Share News

15 వేల ఇళ్లు రద్దు?

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:19 AM

నగర శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్‌ నగర్స్‌ కాలనీల్లో నిర్మాణాలకు వీలుకాని సుమారు 15 వేల ఇళ్లు రద్దుకు గృహనిర్మాణ సంస్థ యోచిస్తోంది.

15 వేల ఇళ్లు రద్దు?

నిర్మాణాలకు వీలుకాని ప్రదేశాల్లో లే అవుట్లు

గత ప్రభుత్వ హయాంలో గెడ్డవాగులు, చెరువుగర్భాల్లో ప్లాట్లు

అక్కడ నిర్మాణాలకు లబ్ధిదారుల విముఖత

ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చేందుకు యత్నాలు

విశాఖపట్నం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):

నగర శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్‌ నగర్స్‌ కాలనీల్లో నిర్మాణాలకు వీలుకాని సుమారు 15 వేల ఇళ్లు రద్దుకు గృహనిర్మాణ సంస్థ యోచిస్తోంది. ఇటీవల నగరానికి వచ్చిన గృహ నిర్మాణ సంస్థ ఎండీ అరుణ్‌బాబు ఈవిషయంపై అధికారులకు పలు సూచనలిచ్చారు. ప్రధానంగా కొండవాలులో అభివృద్ధిచేసిన లేఅవుట్‌లలో కొండపైన గుర్తించిన ప్లాట్లలో నిర్మాణాలు సాధ్యంకాదని ఇప్పటికే కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు. ఇంకా గెడ్డవాగులు, వర్షాకాలంలో నీరు ప్రవహించే ప్రాంతాలు, చెరువు గర్భాలలో అభివృద్ధి చేసిన ప్లాట్లలో నిర్మాణాలకు ఇబ్బందులున్నాయి. ఇటువంటి ప్లాట్లలో నిర్మించిన ఇళ్లలో నివాసాలు ఉండలేమని లబ్ధిదారులు చెబుతూ వస్తున్నారు.

నగర శివారుల్లో 65 లేఅవుట్‌లలో సెంటు స్థలాల్లో భారీగా ఇళ్ల నిర్మాణాలను గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించారు. అప్పట్లో ఇళ్ల నిర్మాణాలకు వీలులేకపోయినా అధికారులు ఇష్టానుసారంగా లేఅవుట్‌లు రూపొందించారు. కొండలపైన, గెడ్డలు, వాగులు, చెరువులు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలని చూడలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొత్తం లక్ష మందికి పట్టాలిచ్చామని అప్పటి ప్రభుత్వం గొప్పలకు పోయింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ప్లాట్లు వేసి లాటరీ ద్వారా లబ్ధిదారులకు కేటాయించారు. అదే సమయంలో ఇళ్ల నిర్మాణాలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే లేఅవుట్‌లను పరిశీలించిన కాంట్రాక్టర్లు నిర్మాణాలకు అనువుగా ఉన్న ప్లాట్లను గుర్తించారు. అక్కడే పనులు ప్రారంభించారు. నిర్మాణాలకు వీలుకాని ప్లాట్లను పక్కనపడేశారు. చాలా లేఅవుట్‌లలో ఇటువంటివి పదుల సంఖ్య నుంచి వందల వరకు ఉంటాయి. సబ్బవరం మండలం అసకపల్లిలో కొండవాలు నుంచి పైవరకు లేఅవుట్‌వేశారు. అక్కడ వాలు ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టారు. కొండపైన ఇళ్లు నిర్మాణాలకు ప్రయత్నించి వీలుకాకపోవడంతో విడిచిపెట్టేశారు .పైడివాడ అగ్రహారం చెరువు గర్భంలో కొన్ని ఇటువంటి ప్లాట్లను వదిలేశారు. అనకాపల్లి మండలం కుంచంగి, కూండ్రంలో తొమ్మిదివేలకుగాను ఆరువేల వరకు నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికీ రోడ్డు సదుపాయం లేకపోవడంతో లబ్ధిదారులు విముఖత చూపుతున్నారు. ఆనందపురం మండలం కణమాం లేఅవుట్‌ గెడ్డవాగులో ప్లాట్లను వదిలేశారు. అధికారులు ఒత్తిడిచేసి నిర్మాణాలు చేపట్టాలంటే ప్రస్తుతం యూనిట్‌ ధర రూ. 1.8 లక్షలు సరిపోదని, మరో లక్ష వరకు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇలా సుమారు 15 వేల ఇళ్లు ఉంటాయని అఽధికారులు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం లక్ష ఇళ్ల ప్రాజెక్టు వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరుతో ముగుస్తోంది. అందువల్ల నిర్మాణాలకు వీలుకాని ప్లాట్లులో ఇళ్లను రద్దుచేసి వారికి మరో చోట కేటాయించాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండీ సూచన మేరకు ఇళ్ల వివరాలు తీసుకుని నివేదిక ఇవ్వాలని నిర్ణయించారు.

Updated Date - Nov 10 , 2025 | 12:19 AM