15 నెలలు 8,54,913 ఈ-చలాన్‌లు
ABN , Publish Date - Oct 16 , 2025 | 01:23 AM
ట్రాఫిక్ ఈ-చలాన్‌ల జారీలో నగర పోలీసులు రికార్డు సృష్టించారు. గత 15 నెలల కాలంలో ఏకంగా 8,54,913 ఈ-చలాన్‌లు జారీచేసి, రూ.46.4 కోట్లు జరిమానా విధించారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, జిల్లాలతో పోల్చితే ఇదే అత్యధికం కావడం విశేషం.
రూ.46.4 కోట్లు జరిమానా విధింపు
3,44,421 చలానాలు క్లియరెన్స్
రూ.13.39 కోట్లు వసూలు
విశాఖ పోలీసుల రికార్డు
దుకాణాలు, రైతుబజార్ల వద్ద పార్కింగ్
చేసిన వారికి ఈ-చలాన్‌లా జారీపై విమర్శలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ట్రాఫిక్ ఈ-చలాన్‌ల జారీలో నగర పోలీసులు రికార్డు సృష్టించారు. గత 15 నెలల కాలంలో ఏకంగా 8,54,913 ఈ-చలాన్‌లు జారీచేసి, రూ.46.4 కోట్లు జరిమానా విధించారు. రాష్ట్రంలోని ఇతర నగరాలు, జిల్లాలతో పోల్చితే ఇదే అత్యధికం కావడం విశేషం.
నగరంలో దాదాపు 12 లక్షల వాహనాలు ఉన్నాయి. రోడ్లు ఇరుకుగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది. రద్దీ వేళల్లో అయితే ప్రధాన జంక్షన్ల వద్ద గ్రీన్ సిగ్నల్ కోసం ఐదు నుంచి 15 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు సిగ్నల్ జంపింగ్‌లకు పాల్పడడం, మరికొందరు నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి రెండు రోజులకు సగటున ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్టపడాలంటే వాహనచోదకులంతా విధిగా ట్రాఫిక్ నిబంధనలతోపాటు రహదారి భద్రత చర్యలను పాటించేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ఈ-చలాన్‌లు జారీ చేయడం ప్రారంభించారు. గత పదేళ్లుగా ఈ-చలాన్‌ల జారీ జరుగుతోంది. అయితే పోలీసులు స్పెషల్‌డ్రైవ్ పేరుతో కొంతకాలంపాటు తనిఖీలు చేసి ఈ-చలాన్‌లు జారీచేసి తర్వాత మిన్నకుండిపోయేవారు. జారీచేసిన ఈ-చలాన్‌లను క్లియర్ చేయడంపై కూడా పెద్దగా శ్రద్ధపెట్టేవారు కాదు. దీంతో వాహన చోదకులు కూడా ఈ-చలాన్‌లను సీరియస్‌గా తీసుకునేవారుకాదు. గత ఏడాది జూలైలో సీపీగా శంఖబ్రతబాగ్చి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారి ఫొటోను సెల్‌ఫోన్ ద్వారా తీయించి ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయించి, వాహన నంబర్ ఆధారంగా రవాణా శాఖ పోర్టల్‌లోని సమాచారం తీసుకుని యజమానికి ఈ-చలాన్ మెసేజ్ అందేలా చర్యలు తీసుకున్నారు. హెల్మెట్ ధరించని వారిని, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంకన్ డ్రైవ్, డేంజరస్ డ్రైవింగ్, రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వారి ఫొటోలు తీసి ఈ-చలాన్ జారీచేయడం ప్రారంభించారు. అంతటితో సరిపెట్టేయకుండా, వాటిని క్లియర్ చేయించేందుకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారీగా టార్గెట్‌లు విధించారు. దీంతో ఈ-చలాన్‌ల సంఖ్యతోపాటు, జారీచేసిన ఈ-చలాన్‌లలో క్లియర్ అయిన వాటి సంఖ్య కూడా పెరిగింది. నగరంలో గత ఏడాది జూలైలో 79,131 ఈ-చలాన్‌లు జారీచేస్తే వాటిలో 36,453 చలాన్‌లను కట్టించారు. ఆగస్టులో 79,436 ఈ-చలాన్‌లు జారీచేసి 37,298, సెప్టెంబరులో 82,646 ఈ-చలాన్‌లు జారీచేసి 39,840, అక్టోబరులో 92,002 జారీచేసి 43,788, నవంబరులో 86,633 జారీచేసి 40,869 క్లియర్ చేయించారు. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 15 నెలల్లో 8,54,913 ఈ-చలాన్‌లు ద్వారా రూ.46,40,32,101 జరిమానా విధించారు. అందులో 3,44,421 ఈ-చలాన్‌లను క్లియర్ చేసి వాహన యజమానుల నుంచి రూ.13,39,73,796 వసూలు చేశారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం కావడం విశేషం.
దుకాణాలు, రైతుబజార్ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలకు జరిమానాపై విమర్శలు
నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ-చలాన్‌ల జారీచేయడంపై ఎలాంటి అభ్యంతరాలు లేనప్పటికీ దుకాణాలు ముందు, రైతుబజార్‌ల వద్ద పార్కింగ్ చేసిన వాహనాలకు ‘డేంజరస్ పార్కింగ్’ పేరుతో ఈ-చలాన్‌లు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డుపక్కనే దుకాణాలు ఏర్పాటుచేసినా పట్టించుకోని పోలీసులు వాటికి వెనుక వైపు నిలిపే వాహనాలను ఫొటోలు తీసి ఈ-చలాన్‌లు పంపుతున్నారంటూ వాహనదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దుకాణాలు ఉండే ప్రాంతాల్లో పార్కింగ్ సదుపాయం కల్పించకుండా, అక్కడ కొనుగోలు చేసేందుకు వచ్చేవారు వాహనాలను నిలిపితే జరిమానాలు విధించడం ఎంతవరకు సమజంసమని ప్రశ్నిస్తున్నారు.