15 మాస్టర్ ప్లాన్ రహదారులు అభివృద్ధి
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:24 AM
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి వివిధ ప్రాంతాల నుంచి జాతీయ రహదారులను కలుపుతూ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన 15 మాస్టర్ ప్లాన్ రహదారులను పూర్తిచేయాలని వీఎంఆర్‌డీఏ కృతనిశ్చయంతో ఉంది.

ఏడాదిలోగా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వీఎంఆర్‌డీఏ
క్షేత్రస్థాయి పర్యటనల్లో పెద్దలు
భోగాపురం విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి జాతీయ రహదారులకు అనుసంధానమై ఉన్న
పలు రహదారుల విస్తరణకు ప్రణాళిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమయ్యే నాటికి వివిధ ప్రాంతాల నుంచి జాతీయ రహదారులను కలుపుతూ అభివృద్ధి చేయాలని నిర్ణయించిన 15 మాస్టర్ ప్లాన్ రహదారులను పూర్తిచేయాలని వీఎంఆర్‌డీఏ కృతనిశ్చయంతో ఉంది.
ఇటీవల అసెంబ్లీలో ఇదే అంశంపై విశాఖపట్నం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడిగిన సంగతి తెలిసిందే. భోగాపురం విమానాశ్రయానికి విశాఖ నుంచి వెళ్లాలంటే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయని, ఫ్లైఓవర్లు నిర్మించాలని, రహదారులను విస్తరించాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవి, తదితరులు కోరారు. దీనిపై పురపాలక శాఖా మంత్రి నారాయణ సమాధానమిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలిసందిగా కేంద్రాన్ని కోరామని, దానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే నాలుగేళ్లలో పూర్తిచేస్తామని చెప్పారు. ఈలోగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో వివిధ ప్రాంతాల ప్రజలు ఎన్‌హెచ్-16ను, అనకాపల్లి-పెందుర్తి జాతీయ రహదారిని చేరుకోవడానికి పలు గ్రామాల నుంచి కనెక్టింగ్ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వీఎంఆర్‌డీఏ గతంలోనే వాటిని మాస్టర్ ప్లాన్ రహదారులుగా ప్రకటించిందని, కొన్ని కొంత మేరకు పూర్తయ్యాయని, మరికొన్నింటికి భూసేకరణ జరిగిందని, మరికొన్నింటికి భూమిని తీసుకోవలసి ఉందని వివరించారు. ఏదేమైనా ఈ రహదారులు అన్నింటిని ఏడాదిలోగా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వీంఎర్‌డీఏ చైర్మన్‌కు మంత్రి లోకేశ్, కమిషనర్‌కు పురపాలక శాఖా మంత్రి నారాయణ ఫోన్లు చేసి ఆ మాస్టర్ ప్లాన్ రహదారుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వాటిని పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. దీంతో చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్, జాయింట్ కమిషనర్ రమేశ్, చీఫ్ ఇంజనీర్ వినయకుమార్, సీయూపీ శిల్ప, ఎస్‌ఈలు భవానీ శంకర్, బలరామరాజులతో కలిసి మంగళవారం ఆయా మార్గాలను పరిశీలించారు.
తొలి ప్రాధాన్యం ఆ మార్గానికే...
1. అడవివరం బీఆర్‌టీఎస్ జంక్షన్ నుంచి శొంఠ్యాం మార్గంలో గండిగుండం సర్వే నంబర్ 240 వరకు ఉన్న మార్గాన్ని 60 మీటర్లకు విస్తరించనున్నారు. దీని పొడవు ఎనిమిది కిలోమీటర్లు. పినగాడి, పెదగాడి ప్రాంతాల నుంచి వేపగుంట మీదుగా ఈ జంక్షన్‌కు వచ్చేవారు విస్తరించే మార్గంలో అనకాపల్లి జాతీయ రహదారిని చేరుకొని ఆనందపురం మీదుగా భోగాపురం విమానాశ్రయానికి చేరుకోవచ్చు. విశాఖ నగరం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు దీనిని విస్తరిస్తున్నారు. ఈ రహదారిని ఆర్ అండ్ బి, వీఎంఆర్‌డీఏ కలిసి పర్యవేక్షిస్తాయి.
2. పెందుర్తి మండలం పినగాడి జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ వరకూ ఉన్న రహదారిని 45 మీటర్లకు విస్తరించనున్నారు. దీని పొడవు 7.25 కి.మీ. ఇది ఆర్ అండ్ బి పరిధిలో ఉంది.
3. పెందుర్తి మండలం వేపగుంట సర్వే నంబర్ 33 నుంచి జుత్తాడ సర్వే నంబర్ 128 వరకు 24 మీటర్ల వెడల్పున గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మిస్తారు. దీని పొడవు 6.05 కి.మీ.
4. భీమిలి మండలం చిప్పాడ సర్వే నంబర్ 48 దివీస్ రహదారి నుంచి విజయనగరం జిల్లాలోని పోలిపల్లి దివీస్ రహదారి వరకూ 24 మీటర్ల వెడల్పున 6.32 కి.మీ. రహదారిని విస్తరిస్తారు. దీనికి అయ్యే వ్యయాన్ని దివీస్ భరించడానికి ముందుకు వచ్చింది.
5. ఆనందపురం మండలం గండిగుండం (జాతీయ రహదారి) సర్వే నంబర్ 211 నుంచి విజయనగరం జిల్లా కొత్తవలస సర్వే నంబర్ 34 వరకూ 24 మీటర్ల వెడల్పున రహదారిని విస్తరిస్తారు. దీని పొడవు 3.5 కి.మీ. 18 మీటర్ల వెడల్పున ఇంకో 6.4 కి.మీ. రహదారిని అభివృద్ది చేస్తారు.
6. భీమిలి మండలం వెల్లంకి సర్వే నంబర్ 148, దొరతోట జంక్షన్ నుంచి కుమ్మరిపాలెం సర్వే నంబర్ 56 వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 60 అడుగుల మేర అభివృద్ధి చేస్తారు. దీని పొడవు 6.2 కిలోమీటర్లు.
7. భీమిలి మండలం తగరపువలస సర్వే నంబర్ 26 నుంచి మూలకుద్దు సర్వే నంబరు 17 వరకు ప్రస్తుత రహదారిని 45 మీటర్ల వెడల్పున 3.6 కి.మీ. పొడవుతో అభివృద్ధి చేస్తారు.
8. భీమిలి మండలం నేరెళ్లవలస సర్వే నంబరు 8 నుంచి దొరతోట మీదుగా తాళ్లవలస సర్వే నంబరు 161 వరకూ 24 మీటర్ల వెడల్పున గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నాలుగు కి.మీ. పొడవున అభివృద్ధి చేస్తారు.
9. ఆనందపురం మండలం గంభీరం సర్వే నంబర్ 125 నుంచి అదే గ్రామంలో సర్వే నంబరు 9 మీదుగా జాతీయ రహదారి వరకు 18 మీటర్ల వెడల్పున 2.5 కి.మీ. పొడవుతో గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వేస్తారు.
10. భీమిలి మండలం బోయపాలెం జంక్షన్ నుంచి పరదేశిపాలెం సర్వే నంబర్ 11, కాపులుప్పాడ సర్వే నంబర్ 302 మీదుగా మంగమారిపేట జంక్షన్ వరకు గల మూడు కిలోమీటర్ల మార్గంలో కొంత 30 మీటర్లు, మరికొంత 18 మీటర్ల వెడల్పున అభివృద్ధి చేస్తారు.
11. విశాఖపట్నం గ్రామీణ మండలం పరదేశిపాలెం సర్వే నంబర్ 173 నుంచి భీమిలి మండలం కాపులుప్పాడ సర్వే నంబర్ 329లో తిమ్మాపురం జంక్షన్ వరకూ 30 మీటర్ల వెడల్పున 6.3 కి.మీ. రహదారిని ఇటీవలె పూర్తిచేశారు.
12. విశాఖ గ్రామీణ మండలం శివశక్తినగర్‌లో 18 మీటర్ల రహదారిని, మారికవలసలో వీఎంఆర్‌డీఏ హరిత ప్రాజెక్టు వరకు ప్రస్తుత రహదారిని 12, 18, 24 మీటర్ల వెడల్పున అభివృద్ధి చేస్తారు. దీని పొడవు 1.7 కి.మీ.
13. విజయనగరం జిల్లా ఐనాడ జంక్షన్ సర్వే నంబరు 8 నుంచి విజయనగరం రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ వరకు ప్రస్తుత రహదారిని 24 మీటర్ల వెడల్పుతో 6.5 కి.మీ. అభివృద్ది చేస్తారు.
14. దాకమర్రి సర్వే నంబరు 270 నుంచి మోపాడ మీదుగా భోగాపురం మండలం సవరవిల్లి సర్వే నంబరు 133 వరకు 30 మీటర్ల వెడల్పున గ్రీన్‌ఫీల్డ్ రహదారిని 6.3 కి.మీ. పొడవున అభివృద్ధి చేస్తారు.
15. ఆనందపురం మండలం గండిగుండం నుంచి విజయనగరం జిల్లా కొత్తవల సర్వే నంబరు 34, చింతలపాలెం రాష్ట్ర జాతీయ రహదారి 135 అరకు రోడ్డు వరకు ప్రస్తుత రహదారి కొంత, మరికొంత గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు 24, 18 మీటర్ల వెడల్పున 9.9 కి.మీ. పొడవుతో అభివృద్ధి చేస్తారు.
వీఎంఆర్‌డీఏ నిధులతోనే నిర్మాణం
ఎం.ప్రణవ్ గోపాల్, చైర్మన్, వీఎంఆర్‌డీఏ
భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ప్రయాణం సులభతరం చేసేందుకు అభివృద్ధి చేస్తున్న ఈ 15 మాస్టర్ ప్లాన్ రహదారులకు వీఎంఆర్‌డీఏనే నిధులు సమకూరుస్తుంది. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశం మేరకు ఏడాదిలోగా అన్నీ పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. అందులో ఒకటి ఇప్పటికే పూర్తయింది. ఒక రహదారికి దివీస్ నిధులు సమకూరుస్తుంది.
8 గ్రీన్‌ఫీల్డ్ రహదారులు
కె.విశ్వనాథన్, కమిషనర్, వీఎంఆర్‌డీఏ
కొత్తగా, ఇప్పుడున్న వాటిని అభివృద్ధి చేస్తున్న 15 రహదారుల్లో 8 పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్ మార్గాలు. వాటికి కొత్తగా భూసేకరణ చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లో నుంచే నిర్మిస్తాం. జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వస్తాయి. ప్రజల నిర్మాణాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని మార్గాలలో నిర్మాణాలకు జీవీఎంసీ టీడీఆర్‌లు పెండింగ్ పెట్టడం వల్ల పనులు ఆగాయి. వాటిని కూడా త్వరగా పూర్తిచేయడానికి యత్నిస్తాం.