Share News

1,44,222 మంది రైతులకు లబ్ధి

ABN , Publish Date - Nov 20 , 2025 | 12:45 AM

వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు.

1,44,222 మంది రైతులకు లబ్ధి
అన్నదాత సుఖీభవ నమూనా చెక్కును ప్రదర్శిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు

అన్నదాత సుఖీభవ రెండో విడత సాయం రూ.101 కోట్ల 84 లక్షలు

పెట్టుబడి సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ సూచన

పాడేరు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ అన్నారు. ‘అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌’ రెండో విడత ఆర్థిక సాయం జమ సందర్భంగా బుధవారం స్థానిక కాఫీ హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలనే లక్ష్యంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు విడతలుగా ప్రతి ఏడాది రూ.20 వేలు రైతులు ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ఈ ఏడాది తొలి విడతగా ఆగస్టు నెలలో రూ.7 వేలు చొప్పున జమకాగా, రెండో విడతగా బుధవారం జిల్లా వ్యాప్తంగా లక్షా 44వేల 222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షలు లబ్ధి చేకూరుతుందన్నారు. గిరిజన రైతులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని వ్యవసాయరంగంలో మరింతగా రాణించాలన్నారు. తక్షణమే రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అటువంటి సమస్యలుంటే కాల్‌ సెంటర్‌: 155251 నంబర్‌కు సమాచారం అందిస్తే, సమస్యను పరిష్కరిస్తారన్నారు. అధికారులు రైతులకు సొమ్ము జమకాని పరిస్థితులపై దృష్టి సారించి, వాటిని పరిష్కరించి వారికి సొమ్ము జమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి ఆర్గానిక్‌ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఏఎంసీ చైర్‌పర్సన్‌ మచ్చల మంగతల్లి, జీసీసీ డైరెక్టర్‌ బొర్రా నాగరాజు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడ కృష్ణారావు, తదితరులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని లక్షా 44 వేల 222 మంది రైతులకు రూ.101 కోట్ల 84 లక్షల లబ్ధి చేకూరే నమూనా చెక్కును అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్‌.నంద్‌, రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డప్పోడి వెంకటరమణ, ఎంపీపీ ఎస్‌.రత్నకుమారి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు కూటమి నేతలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 12:45 AM