137 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Oct 26 , 2025 | 10:53 PM
గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక సీఐ ఎం.వినోద్ బాబు తెలిపారు.
ముగ్గురి అరెస్టు, పరారైన ఇద్దరి కోసం గాలింపు
ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్‌ఫోన్లు సీజ్
చింతపల్లి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతం నుంచి మైదాన ప్రాంతాలకు తరలిస్తున్న 137 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని స్థానిక సీఐ ఎం.వినోద్ బాబు తెలిపారు. రవాణాకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. చింతపల్లి మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు, జీకేవీధికి చెందిన మరో వ్యక్తి ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేశారన్నారు. బలపం సరిహద్దు ప్రాంతాల నుంచి లోతుగెడ్డ బ్రిడ్జి మీదుగా మైదాన ప్రాంతాలకు గంజాయి తరలిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారంతో అన్నవరం ఎస్‌ఐ జి.వీరబాబు, పోలీసులు వాహన తనిఖీలు ప్రారంభించారన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రెండు ద్విచక్రవాహనాలు, ఒక కారులో ఐదుగురు వ్యక్తులు గంజాయి బస్తాలను తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. ముగ్గురు వ్యక్తులు పోలీసులకు పట్టబడగా, మరో ఇద్దరు వ్యక్తులు పారిపోయారన్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి గంజాయి రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశామని చెప్పారు. తప్పించుకున్న వ్యక్తులను పట్టుకునేందుకు అదనపు సిబ్బందిని నియమించామన్నారు. నిందితుల నుంచి గంజాయి, కారు, రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని తెలిపారు.