ఉక్కులో ఆర్‌ఎంహెచ్‌పీలో మళ్లీ 12 గంటల డ్యూటీ
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:10 AM
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా వంద శాతం ఉత్పత్తి సాధించలేక, ఆ వైఫల్యాన్ని ఉద్యోగులపైకి నెట్టేయాలని చూస్తోంది. వర్షాకాలంలో ఎటువంటి నిర్వహణ పనులు చేపట్డకుండా మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించి తప్పటడుగు వేసింది. ఎక్కడికక్కడే అడ్డంకులు వల్ల రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో కన్వేయర్లు పూర్తిస్థాయిలో నడవ లేదు. దాంతో ముడి పదార్థాలు అందక ఉక్కు ఉత్పత్తి తగ్గింది.
ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ...
ఇప్పటివరకూ ఆగస్టు నెల జీతాలు ఇవ్వని వైనం
రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటులో కన్వేయర్‌ను ఎవరో కోసేశారని యాజమాన్యం ఫిర్యాదు
ఉత్పత్తిలో వైఫల్యాన్ని ఉద్యోగులపైకి నెట్టేందుకు యత్నం
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌ల ద్వారా వంద శాతం ఉత్పత్తి సాధించలేక, ఆ వైఫల్యాన్ని ఉద్యోగులపైకి నెట్టేయాలని చూస్తోంది. వర్షాకాలంలో ఎటువంటి నిర్వహణ పనులు చేపట్డకుండా మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను ప్రారంభించి తప్పటడుగు వేసింది. ఎక్కడికక్కడే అడ్డంకులు వల్ల రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో కన్వేయర్లు పూర్తిస్థాయిలో నడవ లేదు. దాంతో ముడి పదార్థాలు అందక ఉక్కు ఉత్పత్తి తగ్గింది. దీంతో 240 మంది మేనేజర్ స్థాయి అధికారులకు పదిహేను రోజుల పాటు ఆర్‌ఎంహెచ్‌పీలో డ్యూటీ వేసింది. ఈ నెల 5న మళ్లీ వారి విభాగాలకు పంపించింది. తాజాగా ఆర్‌ఎంహెచ్‌పీలో పనిచేస్తున్న అధికారులకు ఎనిమిది గంటల స్థానంలో 12 గంటల డ్యూటీ వేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవాలని కానీ ఇలా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎలా పనిచేస్తామని వారు వాపోతున్నారు.
ఇదిలావుంటే ఆగస్టు నెల జీతాలు సెప్టెంబరు 10వ తేదీ వచ్చినా ఇంతవరకూ ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఇప్పటికే మూడు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇలాగైతే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని వారు వాపోతున్నారు. కేంద్రం హామీ ఇచ్చిన ఆర్థిక సాయంలో భాగంగా మంగళవారం రాత్రి రూ.840 కోట్లు స్టీల్ ప్లాంటు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. రూ.60 కోట్లు విడుదల చేస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వవచ్చు. కానీ యాజమాన్యం దానికి ఒప్పుకోవడం లేదు. జీతాలు ఇవ్వకుండా పనిభారం మోపుతోంది.
పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆర్‌ఎంహెచ్‌పీ విభాగంలో ఒకచోట కన్వేయర్ బెల్ట్ తెగిపోయిందని, దానిపై అనుమానాలు ఉన్నాయని యాజమాన్యం తరఫున స్టీల్ ప్లాంటు పోలీస్ స్టేషన్‌లో తాజాగా ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ఆర్‌ఎంహెచ్‌పీలో సమస్యలు ఉన్నాయని అధికార వర్గాలు ముందు నుంచి చెబుతున్నాయి. యాజమాన్యం వాటిని పెడచెవిన పెట్టింది. ఇప్పుడు పూర్తిస్థాయి ఉత్పత్తి లేకపోవడంతో ఆ నెపాన్ని కార్మికుల మీదకు నెట్టేయడానికి, కన్వేయరు బెల్ట్ ఎవరో కోసేశారని ఫిర్యాదు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది సరైన విధానం కాదని, సంస్థ ఆస్తులకు నష్టం చేసే ఆలోచన కలిగిన కార్మికులు, ఉద్యోగులు లేరని సంఘాల నాయకులు చెబుతున్నారు.