120 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:23 PM
పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని స్థానిక సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు.
నలుగురి అరెస్టు, పరారైన ఇద్దరి కోసం గాలింపు
చింతపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని స్థానిక సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు చెందిన మహిళకు విక్రయించారన్నారు. ఆమె గొలుగొండ మండలం పసరాడ గ్రామానికి చెందిన మహిళ, ఆమె భర్త, మరో ఇద్దరు వ్యక్తుల సహకారంతో గంజాయిని తమిళనాడు తరలించేందుకు ఆటోలో సీలేరు, జీకేవీధి, చింతపల్లి మీదుగా తీసుకొని వెళుతోందన్నారు. గురువారం మధ్యాహ్నం అంతర్ల జంక్షన్ వద్ద ఎస్‌ఐ వెంకట రమణ, పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జీకేవీధి నుంచి వచ్చిన ఆటో పోలీసుల వద్దకు రాగానే ఒక వ్యక్తి వాహనం దిగి పారిపోయాడన్నారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆటోను తనిఖీలు చేయగా 120 కిలోల గంజాయి బయట పడిందన్నారు. గంజాయి, ఆటోని స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు వి.వెంకటేశ్వరరావు, ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.