రోజుకు 12 గంటలు పని!
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:10 AM
స్టీల్ ప్లాంటులో ఇన్‌చార్జి సీఎండీ ఏది చెబితే అదే వేదంగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆయన మాటకే విలువ ఇస్తున్నాయి.
స్టీల్‌ప్లాంటులో గత రెండు నెలలుగా అదే పరిస్థితి
ఉద్యోగులు ఎక్కువ ఉన్నట్టు పాలకులు చెబుతున్న మాట వాస్తవమే అయితే అన్నేసి గంటలు పనిచేయించడం ఎందుకో?
అంత పనిచేస్తున్నా సక్రమంగా అందని జీతాలు
అనుభవజ్ఞులైన కాంట్రాక్టు కార్మికుల తొలగింపుతో అస్తవ్యస్తంగా ఆర్‌ఎంహెచ్‌పీ నిర్వహణ
కదలని కన్వేయర్లు
రైల్వే ర్యాక్‌ల నుంచి మెటీరియల్ అన్‌లోడింగ్‌లోనూ జాప్యం
నెలకు రూ.కోటికి పైగా డెమరేజీ చెల్లింపు
ఈ అదనపు చెల్లింపులకు బాధ్యత ఎవరిది?
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటులో ఇన్‌చార్జి సీఎండీ ఏది చెబితే అదే వేదంగా నడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆయన మాటకే విలువ ఇస్తున్నాయి. ఆయన తనకు నచ్చినట్టు ముందుకువెళ్లడం వల్లనే పూర్తిస్థాయి ఉత్పత్తి సాధ్యం కావడం లేదు. ప్లాంటుకు అత్యంత ముఖ్యమైన రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.
స్టీల్ ప్లాంటులో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని వారిని తగ్గిస్తూ వస్తున్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా ఇప్పటికే 1,140 మందిని ఇంటికి పంపించారు. ఇప్పుడు మరో వేయి మందిని అదే వీఆర్‌ఎస్ ద్వారా తగ్గించాలని ఫైల్ సిద్ధం చేశారు. మరోవైపు నెలకు 50 నుంచి 100 మంది రిటైర్ అవుతున్నారు. సీఎండీ లెక్కల ప్రకారం అవసరానికి మించి ఉద్యోగులు ఉన్న మాట నిజమైతే...ఉద్యోగులతో గత రెండు నెలలుగా రోజుకు 12 గంటలు ఎందుకు పనిచేయిస్తున్నారు. శాశ్వత ఉద్యోగులు రోజుకు ఎనిమిది గంటలే పనిచేయాలి. అత్యవసరమైతే అదనపు గంటలు పనిచేయించుకోవచ్చు. అలా చేసిన వారికి దానికి తగ్గట్టుగా సెలవు తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఆ పనికి తగిన వేతనం కూడా తీసుకోవచ్చు. అయితే గత రెండు నెలలుగా రోజుకు నాలుగు గంటలు అదనంగా పనిచేస్తున్నవారికి అదనపు వేతనం మాట పక్కనపెడితే అసలు జీతమే సక్రమంగా ఇవ్వడం లేదు.
సీఎండీ లెక్కల ప్రకారం ఉద్యోగుల సంఖ్య ఎక్కువ ఉంటే...అదనంగా 4 గంటలు ఎందుకు పనిచేయిస్తున్నారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడగడం లేదు. కార్మిక శాఖ కూడా దీనిపై నోరు ఎత్తడం లేదు. ఉద్యోగుల హక్కులను కాలరాస్తుంటే.. అంతా చోద్యం చూస్తున్నారు. ప్రశ్నించిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారు. దీనికి అంతం ఎక్కడో పాలకులే చెపాల్సి ఉంది.
కన్వేయర్ల వద్ద గుట్టలు గుట్టలుగా వ్యర్థాలు
స్టీల్ ప్లాంటులో రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ) సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అక్కడి నుంచి ఐరన్‌ఓర్, కోల్, ఇతర ముడి పదార్థాలు వివిధ విభాగాలకు కన్వేయర్ల ద్వారా పంపిస్తారు. అవి సక్రమంగా నడవాలంటే...24 గంటలూ కాంట్రాక్టు వర్కర్లు కన్వేయర్ల వద్ద ఉండి వాటి పైనుంచి కిందపడే మెటీరియల్‌ను క్లియర్ చేయాలి. ఒక్కపూట ఆ పని ఆగిపోతే కన్వేయర్లు ముందుకు కదలవు. మెటీరియల్ విభాగాలకు అందదు. అనుకున్న ఉత్పత్తి రాదు. ప్రస్తుతం ఇదే జరుగుతోంది. నైపుణ్యం కలిగిన కాంట్రాక్టు వర్కర్లను తీసేయడంతో ఆర్‌ఎంహెచ్‌పీలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ఉత్పత్తి సగానికి పడిపోయింది.
ఇక రైల్వే ర్యాక్‌ల ద్వారా ఆర్‌ఎంహెచ్‌పీకి వస్తున్న మెటీరియల్‌ను వెంట వెంటనే అన్‌లోడింగ్ చేయడం కూడా కొత్త కాంట్రాక్టు వర్కర్లకు చేతకావడం లేదు. ఎక్కువ సమయం పడుతోంది. ర్యాక్‌లు నిర్ణీత సమయం కంటే ఎక్కువ సేపు ఉంచుకుంటే రైల్వేకు డెమరేజీ కట్టాల్సి ఉంటుంది. గత జూన్ నుంచి నెలకు కోటి రూపాయలకు పైగా రైల్వేకు డెమరేజీ కడుతున్నారు. ఈ అదనపు వ్యయానికి సీఎండీ బాధ్యత వహించడం లేదు. దానిని కూడా విభాగాధిపతులపైకి నెడుతున్నారు. ఏ మంచి జరిగినా తన వల్లనే అంటూ...తప్పులు జరిగితే ఉద్యోగులు, కార్మికులే అంటూ ఢిల్లీకి సమాచారం ఇస్తున్నారు. ఈ తప్పుఒప్పుల లెక్కలు తేల్చడానికి కేంద్ర విజిలెన్స్ వర్గాలు రంగంలో దిగాల్సిన అవసరం చాలా ఉంది. నిజంగా విశాఖ ఉక్కును కాపాడాలని పాలకులు భావిస్తే విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.