Share News

అల్లూరి సాయుధ పోరాటానికి 103 ఏళ్లు

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:35 PM

బ్రిటిష్‌ పాలకుల అకృత్యాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేసేందుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పవచ్చు.

అల్లూరి సాయుధ పోరాటానికి 103 ఏళ్లు
అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌

1922 ఆగస్టు 22న చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై మెరుపు దాడి

చెక్కు చెదరని నాటి ఆనవాళ్లు

బ్రిటిష్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఆధునికీకరిస్తామని మూడేళ్ల క్రితం ప్రకటన

ఇప్పటికీ కార్యరూపం దాల్చని వైనం

చింతపల్లి, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): బ్రిటిష్‌ పాలకుల అకృత్యాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేసేందుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర సంగ్రామంలో ఒక ప్రత్యేక అధ్యాయంగా చెప్పవచ్చు. మెరుపు దాడులతో తెల్లదొరలను గడగడలాడించిన సీతారామరాజు గిరిజన ప్రాంతంలో రెండేళ్లపాటు బ్రిటిష్‌ పాలకులకు కంటి మీద కునుకులేకుండా చేశాడు.

స్వాతంత్య్ర పోరాటంలో ఆ మహనీయుడు సాగించిన పోరాటాన్ని ఆదివాసీలు ఇప్పటికీ స్మరించుకుంటారు. తెల్లదొరల అరాచకాలు పెచ్చుమీరిపోవడం, ఆదివాసీలను బానిసలుగా చేసి వెట్టిచాకిరీ చేయిస్తుండడంతో రగిలిపోయిన అల్లూరి సాయుధ పోరాటానికి ముందడుగు వేశాడు. పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి తొలిసారిగా 1922వ సంవత్సరం ఆగస్టు 22వ తేదీన చింతపల్లి బ్రిటిష్‌ పోలీస్‌ స్టేషన్‌పై తన సైన్యంతో దాడి చేశాడు. రంప తిరుగుబాటుకు వేదికైన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై అల్లూరి దాడి చేసి సరిగ్గా 103 ఏళ్లు కావస్తున్నది.

గిరిజనుల కష్టాలకు చలించి..

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మోగల్లు గ్రామానికి చెందిన అల్లూరి వెంకట రామరాజు 15 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్‌ పాలకులపై ద్వేషభావం పెంచుకున్నాడు. ఈ క్రమంలో లంబసింగి ఘాట్‌రోడ్డు నిర్మాణానికి గిరిజనులను వినియోగించుకుంటూ సరైన కూలి చెల్లించకపోగా హింసించడాన్ని తెలుసుకున్న అల్లూరి అప్పటి తహశీల్దార్‌ బాస్టియన్‌పై బ్రిటిష్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కానీ బ్రిటిష్‌ అధికారులు తిరిగి అల్లూరిపై కేసు పెట్టారు. అల్లూరి మన్యంలో ఉంటే తిరుగుబాటు తెస్తాడని భావించిన బ్రిటిష్‌ పాలకులు నర్సీపట్నం తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు. తరువాత అడ్డతీగల సమీపంలోని పైడిపుట్టిలో 50ఎకరాలు భూమి, కొన్ని పశువులను కేటాయించి, బ్రిటిష్‌ ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో ఉంచారు. 1922 జూన్‌లో పోలవరం డిప్యూటీ కలెక్టర్‌ ఫజులుల్లా ఖాన్‌ సహకారంతో అల్లూరి ప్రవాస శిక్షను తప్పించుకుని మన్యానికి వచ్చి సాయుధ పోరాటానికి సన్నద్ధమయ్యాడు. గాం గంటందొర, మల్లుదొర, బోనంగి పండుపడాల్‌, కంకిపాటి ఎండుపడాల్‌, ఎర్రేసు, మరికొంత మంది గిరిజనులను సమీకరించి సాయుధ పోరాటంపై చైతన్యవంతులను చేశాడు. గెరిల్లా దాడులపై శిక్షణ ఇచ్చాడు. 1922 ఆగస్టు 19న సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవాలని చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడికి వ్యూహరచన చేశాడు.

చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి

అల్లూరి సీతారామరాజు 1922 ఆగస్టు 22వ తేదీన గంటందొర, మల్లుదొర, బోనంగి పండు పడాల్‌, ఎండుపడాల్‌, ఎర్రేస్‌తో పాటు 300 మంది గిరిజన విప్లవకారులతో కలిసి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాడు. పోలీసులను తాళ్లతో బంధించి 11 తుపాకులు, 1,390 తుపాకీ గుళ్లు, 14 బాయ్‌నెట్లు, 5 కత్తులను స్వాధీనం చేసుకున్నాడు. ఈ వివరాలను స్టేషన్‌ డైరీలో రాసి ఇంగ్లీష్‌లో సంతకం చేశాడు. అనంతరం పోలీస్‌ స్టేసన్‌ నుంచి బయటకొస్తుండగా ఇద్దరు పోలీసులు ఎదురయ్యారు. వారి వద్దనున్న రెండు తుపాకులను కూడా లాక్కున్నాడు. అంతటితో ఆగకుండా పెదవలస, రంపుల ఘాట్‌ మీదుగా అడ్డదారిలో వెళ్లి మరుసటి రోజు 23వ తేదీన కృష్ణాదేవిపేట పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాడు. ఏడు తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ రెండు సంఘటనలు విజయవంతం కావడంతో పోలీస్‌ స్టేషన్‌లపై దాడుల పరంపరను కొనసాగించాడు. 24వ తేదీన రాజవొమ్మంగి పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేశాడు. 26 తుపాకులు, 2500కు పైగా తూటాలు ఎత్తుకెళ్లారు. అక్కడి జైలులో ఉన్న రంప పితూరిదారుడు మొట్టడం వీరయ్యదొరను పోలీసు నిర్బంధం నుంచి అల్లూరి విడిపించాడు. వరుసగా మూడు రోజుల పాటు మూడు స్టేషన్లపై అల్లూరి, అతని సేన దాడులు చేయడంతో బ్రిటిష్‌ అధికారుల్లో వణుకు పుట్టింది. అల్లూరి సాయుధ పోరాటాన్ని అణచివేసేందుకు సెప్టెంబరు 24న ప్రత్యేక పోలీసు బలగాలను, ఇద్దరు అధికారులను నియమించారు. అల్లూరి సాయుధ పోరాటాన్ని అణచివేతకు నియమించిన ఇద్దరు అధికారులు సీతారామరాజు దాడిలో మరణించడం గమనార్హం.

ఇప్పటికి చింతపల్లిలో నాటి ఆనవాళ్లు

అల్లూరి సీతారామరాజు నాడు దాడిచేసిన పోలీస్‌ స్టేషన్‌ భవనం చింతపల్లిలో ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం ఈ భవనంలో ఒక భాగాన్ని పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. మరో భాగాన్ని ఉపఖజానా కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఉప ఖజానా కార్యాలయంలో బ్రిటిష్‌ అధికారులు ఉపయోగించిన ఇనుప ఖజానా పెట్టె, ఫ్యాన్‌ తిప్పేందుకు ఉపయోగించిన రోప్‌ ఇప్పటికి పదిలంగా ఉన్నాయి.

అటకెక్కిన పోలీస్‌ స్టేషన్‌ ఆధునికీకరణ

అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ను ఆధునికీకరిస్తామని 2022లో చింతపల్లి సందర్శించిన అప్పటి కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. అలాగే భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125 ఏళ్ల జయంతి ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ అల్లూరి సీతారామరాజు దాడి చేసిన చింతపల్లి బ్రిటిష్‌ పోలీస్‌ స్టేషన్‌ను పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఆధునికీకరణ కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. పోలీస్‌ స్టేషన్‌ సందర్శక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అయితే ఇప్పటికీ ఇవేవీ కార్యరూపం దాల్చలేదు.

Updated Date - Aug 21 , 2025 | 11:35 PM