టెన్త్ పరీక్షలకు 100 రోజుల ప్రణాళిక
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:46 AM
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయడానికి జిల్లా విద్యా శాఖ 100 రోజుల ప్రణాళిక అమలుచేయనున్నది.
డిసెంబరు ఆరో తేదీ నుంచి అమలు
వచ్చే నెల ఐదో తేదీన తల్లిదండ్రులతో సమావేశం
నూరు శాతం ఉత్తీర్ణతే లక్ష్యం
జిల్లాలో 26 వేల మంది విద్యార్థులు
రెండు గ్రూపులుగా విభజన
ఎస్‌సీఈఆర్‌టీ మెటీరియల్ పంపిణీ
విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయడానికి జిల్లా విద్యా శాఖ 100 రోజుల ప్రణాళిక అమలుచేయనున్నది. వచ్చే నెల ఆరు నుంచి మార్చి 15వ తేదీ వరకు 100 రోజులకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కలిపి సుమారు 26 వేల మంది పదో తరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఏటా మాదిరిగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి ప్రణాళిక రూపొందించారు. వచ్చే నెల ఐదో తేదీన మెగా పేరెంట్స్ సమావేశం నిర్వహించి పదో తరగతి ప్రణాళిక గురించి తల్లిదండ్రులకు వివరిస్తారు.
విద్యార్థుల సామర్థ్యం మేరకు రెండు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ నిర్వహించిన పరీక్షలలో వచ్చిన మార్కులు, తరగతి గదిలో ప్రతిభ ఆధారంగా ఏ,బీ కేటగిరీ విద్యార్థులను ఒక గ్రూపుగా, సీ,డీ కేటగిరీ విద్యార్థులను మరో గ్రూపుగా గుర్తించారు. ఏ,బీ గ్రూపునకు ఒక మోడల్, సీ,డీ గ్రూపునకు మరో మోడల్ స్టడీ మెటీరియల్ రూపొందించి అందజేయనున్నారు. స్టడీ మెటీరియల్‌ను స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సుమారు తొమ్మిది వేల మందికి మెటీరియల్‌ను ఉచితంగా సరఫరా చేయనున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో సబ్జెక్టు టీచర్లతో ఒక ఫోరం ఏర్పాటుచేసి ప్రత్యేకించి మెటీరియల్ రూపొందించారు. కాగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు ఒక సబ్జెక్టుపై 20 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మూల్యాంకనం చేసి విద్యార్థులకు అందజేస్తారు. తద్వారా విద్యార్థులు ఏఏ పాఠ్యాంశాల్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకుని, వాటిపై మరింత దృష్టి కేంద్రీకరించేలా చూస్తారు. ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే పలుచోట్ల విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఎలా చదువుతున్నదీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షిస్తున్నారు.
విద్యా సంవత్సరం చివర్లో తొమ్మిది విద్యార్థులకు టెన్త్ పాఠాలు
ప్రస్తుత విద్యా సంవత్సరం ముగింపు సమయంలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు టెన్త్ పాఠాలు బోధించనున్నారు. సుమారు 40 రోజులపాటు ప్రతిరోజు కొంత సమయం పదో తరగతి పాఠాలు బోధన చేయనున్నారు. ఇటువంటి విధానం ప్రైవేటు పాఠశాలల్లో చాలాకాలం క్రితం నుంచి అమలుచేస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వ బడుల్లో ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. దీనివల్ల 2026-27 విద్యా సంవత్సరంలో పదో తరగతికి వచ్చే విద్యార్థులకు కొంతవరకు అవగాహన ఉంటుందంటున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మూడు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు కూడా 100 రోజుల ప్రణాళిక రూపొందించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం రావాలనే సంకల్పంగా దీనిని అమలుచేయనున్నారు.
టెన్త్‌లో 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యం
నిమ్మక ప్రేమ్‌కుమార్, డీఈవో
పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం 100 రోజుల ప్రణాళిక రూపొందించాం.సామర్థ్యం బట్టి విద్యార్థులను రెండు గ్రూపులుగా విభజించాం. వీరికి ప్రత్యేకించి మెటీరియల్ సిద్ధం చేశాం. ప్రతి పాఠశాలలో రెండుపూటలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. రాత్రి సమయాల్లో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి చదువుతున్నారా?, లేదా అనేది పరిశీలిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై ఫోకస్ పెట్టాం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల చదువుపై శ్రద్ధ చూపాలి.