Share News

2047 నాటికి శతశాతం యూజీడీ

ABN , Publish Date - Sep 13 , 2025 | 12:47 AM

(యూజీడీ) ఏర్పాటుచేయాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది.

2047 నాటికి శతశాతం యూజీడీ

  • అన్ని ఇళ్లకూ కనెక్షన్‌

  • పక్కా ప్రణాళికతో సాగుతున్న జీవీఎంసీ

  • గ్రేటర్‌ పరిధిలో 3.6 లక్షల నివాస గృహాలు

  • ప్రస్తుతం 1.9 లక్షల ఇళ్లకు భూగర్భ మురుగునీటి వ్యవస్థ కనెక్షన్‌

  • మిగిలిన ఇళ్లకు దశల వారీగా...

  • ప్రస్తుతం గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో రూ.400 కోట్లతో పనులు

  • త్వరలో జోన్‌-2 పరిధిలో రూ.498 కోట్లతో శ్రీకారం

  • మురుగునీటిని శుద్ధి చేసి, పరిశ్రమలకు విక్రయించే ఆలోచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

స్మార్ట్‌ సిటీగా గుర్తింపుపొందిన విశాఖలో 2047 నాటికి శతశాతం భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటుచేయాలని జీవీఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దశల వారీగా కార్యాచరణను అమలు చేస్తోంది. నగరంలో సుమారు 3.6 లక్షల నివాస గృహాలుండగా ఇప్పటికే 1.9 లక్షల ఇళ్లకు యూజీడీ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. మరో 1.7 లక్షల ఇళ్లకు ఈ సదుపాయం కల్పించేందుకు అధికారులు కార్యాచరణ అమలు చేస్తున్నారు.

జీవీఎంసీ పరిధిలో సుమారు 5.35 లక్షల ఆస్తిపన్ను అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటిలో పరిశ్రమలు, కమర్షియల్‌, కార్యాలయాల భవనాలను మినహాయిస్తే సుమారు 3.6 లక్షల గృహాలుంటాయి. ఆయా ఇళ్లలో ఉత్పత్తి అయ్యే మరుగునీటిని నేరుగా డ్రైనేజీలు, గెడ్డల్లోకి విడిచిపెట్టినట్టయితే పారిశుధ్యం క్షీణించి, నగర వాసులను ఆరోగ్య సమస్యలు, అంటువ్యాధులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఈ పరిస్థితి రాకుండా జీవీఎంసీ భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతి ఇంట్లోని మురుగునీరు, మరుగుదొడ్డి నీటిని పీవీసీ పైపు ద్వారా భూగర్భంలో వేసిన ప్రత్యేక పైపులోకి పంపిస్తారు. దానినుంచి మురుగునీరు నేరుగా పంప్‌హౌస్‌కు చేరి అక్కడ కొంత వడపోత తర్వాత ఎస్టీపీలకు చేరుతుంది. అక్కడ పూర్తిస్థాయిలో మలినాలు, రసాయనాలను వేరుచేస్తారు. ఇలా శుద్ధి చేసిన నీటిని పర్యావరణానికి ప్రమాదం లేకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తారు. దీనివల్ల ప్రజారోగ్యానికి భరోసా కల్పించడంతో పాటు సముద్ర కాలుష్యానికి చెక్‌ చెప్పే వీలుంది.

ప్రణాళికతో ముందుకు...

నగరంలో ప్రస్తుతం 3.6 లక్షల నివాసాలకు గాను 1.9 లక్షల ఇళ్లకు యూజీడీ సదుపాయం కల్పించారు. మిగిలిన ప్రాంతాల్లో యూజీడీ నెట్‌వర్క్‌ లేకపోవడంతో 1.7 లక్షల ఇళ్లకు కనెక్షన్‌ ఇవ్వలేదు. దీంతో మురుగు నీరును నేరుగా డ్రైనేజీలోకి విడిచిపెడుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జీవీఎంసీ పెందుర్తి పరిధిలో 15 వేల ఇళ్లకు యూజీడీ కనెక్షన్‌ కల్పించేందుకు రూ.289 కోట్లతో 226 కిలోమీటర్ల మేర యూజీడీ పైప్‌లైన్‌, 46 ఎంఎల్‌డీ సామర్థ్యం కలిగిన ఎస్‌టీపీ నిర్మాణాలను ప్రారంభించింది. ఈ పనులు చివరి దశకు చేరడంతో సుమారు 12 వేల నివాసాలకు కనెక్షన్‌లు ఇచ్చారు. అలాగే గాజువాక, మల్కాపురం ప్రాంతాల్లో 45 వేల నివాసాలకు యూజీడీ కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ.400 కోట్లతో పనులు ప్రారంభించారు. ఇవి కూడా సగానికిపైగా పూర్తవడంతో 20 వేల నివాసాలకు కనెక్షన్‌లు ఇచ్చేశారు. ఆ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మరో 40 వేల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంది.

సమకూరిన నిధులు

ఇవికాకుండా యూజీడీ నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ అల్లిపురం, కంచరపాలెం, మురళీనగర్‌, సీతమ్మధార తదితర ప్రాంతాల్లోని కొన్ని నివాసాలకు కనెక్షన్‌ ఇవ్వలేదు. ఇందుకోసం నెట్‌వర్క్‌ గ్యాప్‌లను పూర్తిచేయాల్సి ఉంది. దీనిని అధిగమించేందుకు అమృత్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం త్వరలో రూ.55 కోట్లను అందించనుంది. ఇదికాకుండా జోన్‌-2 (మధురవాడ) పరిధిలోని 45 వేల నివాసాలకు యూజీడీ నెట్‌వర్క్‌ లేకపోవడంతో ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (ఐఎఫ్‌సీ) రూ.498 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. వీటన్నింటి ద్వారా సుమారు లక్ష ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన 70 వేల ఇళ్లకు 2047 నాటికి ఈ సదుపాయం కల్పించాలని జీవీఎంసీ కమిషనర్‌ కార్యాచరణ రూపొందించారు.

శుద్ధి చేసిన నీరు విక్రయం

ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని అవసరమైన మేరకు పరిశ్రమలు, వ్యవసాయానికి విక్రయించాలని ప్రతిపాదనలు తయారుచేశారు. ఇప్పటికే జీవీఎంసీ నుంచి ఎస్‌టీపీల్లో శుద్ధిచేసిన నీటిని హెచ్‌పీసీఎల్‌ కొనుగోలు చేస్తోంది. పోర్టు, నేవీ వంటి వాటికి 400 ఎంఎల్‌డీల నీటి డిమాండ్‌ ఉండడంతో 2047 నాటికి 200 ఎంఎల్‌డీ నీటిని అందుబాటులోకి తీసుకువస్తామని జీవీఎంసీ కమిషనర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 13 , 2025 | 12:47 AM