ఈపీడీసీఎల్ పరిధిలో 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:38 AM
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్టు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు.
సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి
విశాఖపట్నం జిల్లాలో 3,715
అనకాపల్లి జిల్లాలో 2,841
అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15...
గ్రిడ్‌కు అనుసంధానం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) పరిధిలో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్టు సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం కింద ఇప్పటివరకూ 31,022 రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను పెట్టామన్నారు. వాటి ద్వారా 1,00,026 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతోందన్నారు. ఏలూరు జిల్లాలో అత్యధికంగా 13,491 కిలోవాట్లు, కాకినాడ జిల్లాలో 3,960, విశాఖపట్నం జిల్లాలో 3,715, తూర్పు గోదావరి జిల్లాలో 3,532, పశ్చిమ గోదావరి జిల్లాలో 3,382, శ్రీకాకుళంలో 3,366, విజయనగరంలో 3,279, అనకాపల్లి జిల్లాలో 2,841, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,934, పార్వతీపురం మన్యంలో 864, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 సోలార్ రూఫ్‌టాప్‌లు అమర్చామన్నారు. వీటన్నింటినీ గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. అపార్టుమెంట్లలో వ్యక్తిగత సోలార్ ప్లాంట్లకు అవకాశం లేనందున, కామన్ సర్వీస్‌కు ఉన్న కాంట్రాక్ట్ లోడ్‌కు అనుగుణంగా సోలార్ రూఫ్ టాప్ పెట్టుకోవచ్చునన్నారు. 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18 వేలు చొప్పున రాయితీ లభిస్తుందన్నారు. అతి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు, ఈఎంఐలు ఇస్తాయన్నారు. వినియోగదారులు పీఎం సూర్యఘర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకొని, అందులో ఎంప్యానల్ అయిన వెండర్స్ నుంచి సోలార్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు. దరఖాస్తుకు, నెట్ మీటర్‌కు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. స్మార్ట్ మీటరు పెట్టుకున్న వారికి నెట్ మీటర్ అవసరం లేదని స్పష్టంచేశారు. ఇంకేమైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబరు 1912కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునన్నారు.
ఐబొమ్మ నిర్వాహకుడు ఇంటి వద్ద హడావిడి
సోదాలకు హైదరాబాద్ పోలీసులు వస్తున్నట్టు ప్రచారం
భారీగా చేరుకున్న మీడియా ప్రతినిధులు
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
పైరసీ కేసులో ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నగరంలోని అతడి ఇంటికి సోదాల కోసం వస్తున్నారని సోమవారం తీవ్రస్థాయిలో ప్రచారం జరిగింది. కొత్త సినిమాలు విడుదలైన రోజే రవి పైరసీ చేసి వాటిని ఐబొమ్మ, బొప్పంటీవీ వంటి వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ చేసేవాడు. దీనిపై సినిమా నిర్మాతలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని సీసీఎస్ పోలీసులు ఈనెల 15న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో రవి నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో పోలీసులు సోదాలు నిర్వహించి కొన్ని హార్డ్ డిస్క్‌లు, పైరసీ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న లింక్‌లను స్వాధీనం చేసుకున్నారు. రవి స్వస్థలం విశాఖపట్నం కావడంతో పోలీసులు ఇక్కడ కూడా సోదాలు చే యడానికి వచ్చారంటూ నగరంలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పెదగదిలి ప్రాంతంలో గల రవి నివాసం వద్దకు సోమవారం ఉదయం మీడియా ప్రతినిధులు పెద్దఎత్తున చేరుకున్నారు. అయితే కొద్దిసేపు వేచిచూసి పోలీసులు రాకపోవడంతో వెనుతిరిగారు. అతడి తండ్రి చినఅప్పారావు మాత్రం రవి చేసిన పని తీవ్రమైన నేరమని, 15 ఏళ్ల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడని...రెండేళ్ల కిందట ఒకసారి వచ్చివెళ్లాడన్నారు. అతనితో తమకు కనీసం మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రవిని పోలీసులు ఏం చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టంచేశారు.
అన్నదాత సుఖీభవ సొమ్ములు జమ రేపు
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఈ నెల 19వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. అర్హులైన ప్రతి రైతు ఖాతాకు రూ.ఐదు వేల వంతున జమ చేయనున్నది. అదే సమయంలో కేంద్రం ‘పీఎం కిసాన్’ నిధి కింద రూ.రెండు వేలు జమ చేస్తుంది. అంటే ప్రతి రైతుకు రూ.ఏడు వేలు అందనున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత విశాఖ జిల్లాలోని నాలుగు మండలాల్లో సుమారు 18 వేల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండో విడతలో కూడా 18 వేల మందికి అటుఇటుగా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. సుమారు రూ.12.5 కోట్ల మేర జమ కానున్నాయని అంచనా వేస్తున్నారు.