జీవీఎంసీలో ఇక 10 జోన్లు
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:45 AM
జీవీఎంసీ పరిధిలో జోన్‌లను పునర్వ్యస్థీకరించాలని అధికారులు నిర్ణయించారు.
పరిపాలనా సౌలభ్యం కోసం నియోజకవర్గాల వారీగా విభజన
భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో రెండేసి ఏర్పాటు
పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదం
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరుతూ లేఖ
త్వరలో విడుదల కానున్న ఉత్తర్వులు
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీ పరిధిలో జోన్‌లను పునర్వ్యస్థీకరించాలని అధికారులు నిర్ణయించారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పుడున్న ఎనిమిది జోన్‌లను పది జోన్‌లుగా విభజించారు. నాలుగునెలు కిందట అఽధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతిరాగానే కొత్త జోన్‌లు అందబాటులోకి రానున్నాయి.
జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం ఎనిమిది జోన్‌లు ఉన్నాయి. విశాఖ మునిసిపల్ కార్పొరేషన్‌గా ఉన్నపుడు ఆరు జోన్‌లు ఉండగా, భీమిలి, అనకాపల్లి మునిసిపాలిటీల విలీనం తర్వాత గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)గా మారడంతో వీటి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కాగా ప్రస్తుతం రెండు, మూడు నియోజకవర్గాల్లో ఒక జోన్ పరిధి విస్తరించి ఉంది. తూర్పు నియోజకవర్గంలో ఉన్న తొమ్మిది, పది, 11, 12, 13 వార్డులు జోన్-2 (మధురవాడ)జోన్‌లో ఉన్నాయి. భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 98 వార్డులు జోన్-2లో ఉన్నాయి. ఉత్తర నియోజకవర్గం పరిధిలో ఉన్న 14, 24, 25, 26 వార్డులు జోన్-3 (ఆశీల్‌మెట్ట)లో ఉన్నాయి. ఇలా ఒక వార్డు నియోజకవర్గం పరిఽధి ఒకటైతే, జోన్ పరిధి మరొకటిగా ఉంది. దీనివల్ల ఆయా వార్డులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటే రెండు, మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతోపాటు రెండు, మూడు జోన్‌ల అధికారులను పిలవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల ఏఒక్కరైనా ఏదైనా కారణంలో ఆ సమావేశానికి హాజరుకాలేకపోతే కొన్ని సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
నియోజకవర్గ పరిధిలోకి...
దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి నియోజకవర్గం పరిధిలోని వార్డులు ఆ జోన్‌లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఇకపై జోన్‌లకు ఒకటి, రెండు అని నంబర్లు కేటాయించకుండా నియోజకవర్గాల పేరుతో జోన్‌లు ఏర్పాటుచేస్తే ప్రజలకు కూడా స్పష్టత ఉంటుందని సూచించారు. దీంతో జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్, అదనపు, జోనల్ కమిషనర్లు నాలుగు నెలల కిందట సమావేశమై వార్డు, జోన్‌ల సరిహద్దులకు సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. నియోజకవర్గాల వారీగా జోన్‌లు ఏర్పాటు చేస్తే ఏవార్డులు ఎందులో చేరుతాయనే దానిపై ఒక డ్రాఫ్ట్ తయారుచేశారు. భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల విస్తీర్ణం ఎక్కువగా కావడంంతో ఒక వార్డు ప్రజలు జోన్ కార్యాలయానికి రావాలంటే చివరన వుండే వార్డుల నుంచి ఇబ్బంది ఎదురవుతుందని, ఈ నేపథ్యంలో ఆ రెండు నియోజకవర్గాలకు రెండేసి జోన్‌లుగా విభజించాలని నిర్ణయించారు. దీంతో జీవీఎంసీ పరిధిలోని తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, గాజువాక, అనకాపల్లి నియోజకవర్గాలకు ఒక్కోజోన్, భీమిలి, పెందుర్తికి రెండేసి జోన్‌లు ఏర్పాటుకానున్నాయి. దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అక్కడి నుంచి అనుమతి రాగానే కొత్తజోన్‌ల వ్యవస్థను అమల్లోకి తేనున్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే జోన్లలోకి వచ్చేవార్డులు
భీమిలి జోన్-1: ఒకటి, రెండు, మూడు, నాలుగు
భీమిలి జోన్-2: ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, 98
తూర్పుజోన్:
9,10,11,12,13,14,15,16,17,18,19,20.21,22,23,28
ఉత్తర జోన్: 14,24,25,26,42,43,44,45,46,47,48,49,50,51,53,34,55
దక్షిణ జోన్: 27,29,30,31,32,33,34,35,36,37,38,39,41
పశ్చిమజోన్: 40,52,56,57,58,59,60,61,62,63,89,90,91,92
పెందుర్తిజోన్-1: 88,93,94,95,96,97
గాజువాక జోన్: 64,65,66,67,68,69,70,71,72,73,74,75,76,86,87
పెందుర్తిజోన్-2: 77,78,79,85
అనకాపల్లిజోన్: 80,81,82,83,84