Share News

ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:06 AM

ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు

ఉత్కంఠభరితంగా రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు
పోటీ పడుతున్న గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల జట్లు

సెమీఫైనల్స్‌కు చేరిన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ, చిత్తూరు బాలికల జట్లు

నేడు పోటీలు ముగింపు

లంకెలపాలెం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): పరవాడ మండలం లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 69వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు రెండో రోజైన శనివారం ఉత్కంఠగా సాగాయి. అండర్‌-14 విభాగంలో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో శనివారం సాయంత్రం వరకు బాలికల విభాగంలో 10 లీగ్‌ మ్యాచ్‌లు, బాలుర విభాగంలో 8 లీగ్‌ మ్యాచ్‌లను నిర్వహించారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో లీగ్‌ దశ పోటీలు ముగిశాయి.

నేడు తుది పోటీలు

రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో భాగంగా శనివారం రాత్రి బాలికల విభాగంలో నిర్వహించిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల జట్లు ఉత్తమ ప్రతిభ చూపి సెమీఫైనల్స్‌ చేరుకున్నాయి. కాగా బాలుర విభాగంలో శనివారం జరిగిన ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌లో గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, కర్నూలు, తూర్పుగోదావరి, చిత్తూరు, కడప జిల్లాల జట్లు సత్తాచాటి క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరాయి. ఆదివారం సాయంత్రం బాలికల సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌, బాలుర విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌, ఫైనల్స్‌ నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ జిల్లా కార్యదర్శి కేఎం నాయుడు, మాజీ కార్యదర్శి ఎంవీ. నాగేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, పీడీలు అన్నాజీరావు, రాణి, లక్ష్మి ఖోఖో పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:07 AM