Share News

మైనింగ్‌లో అక్రమ దందా

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:33 AM

జిల్లాలో నల్లరాయి క్వారీల వద్ద సీనరేజ్‌ ఫీజు వసూళ్ల ముసుగులో అక్రమ దందాకు పాల్పడుతున్నారు.

మైనింగ్‌లో అక్రమ దందా

సీనరేజ్‌ పేరుతో క్వారీ వాహనాలను తనిఖీ చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ సిబ్బంది

వే బిల్లు ఉన్నప్పటికీ డబ్బులు అడుగుతున్న వైనం

ఆన్‌లైన్‌లో చెల్లింపులు కాకుండా నేరుగా నగదు వసూలు

బిల్లు పేరిట చిన్నపాటి కాగితం ముక్క జారీ

(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో నల్లరాయి క్వారీల వద్ద సీనరేజ్‌ ఫీజు వసూళ్ల ముసుగులో అక్రమ దందాకు పాల్పడుతున్నారు. క్వారీలు/ స్టోన్‌ క్రషర్‌ల నిర్వాకులు వే బిల్లులు జారీ చేసినా, చేయకపోయినా చెక్‌ గేటుల వద్ద ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. పైగా ఎటువంటి రశీదులు ఇవ్వకుంగా చిన్నపాటి కాగితం ముక్కపై రబ్బర్‌ స్టాంపు వేసి చేతిలో పెడుతున్నారు.

జిల్లాలో గనుల శాఖ అనుమతులు పొందిన గ్రానైట్‌, రోడ్డు మెటల్‌, బిల్డింగ్‌ స్టోన్‌, గ్రావెల్‌ క్వారీలు 103 ఉన్నాయి. ఇవి కాకుండా అనధికారికంగా మరో వంద వరకు నల్లరాయి క్వారీలు నడుస్తున్నాయి. అనధికార క్వారీల నుంచి ప్రభుత్వానికి సీనరేజ్‌ రూపంలో ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. మరోవైపు అధికార క్వారీల్లో సైతం అనుమతులకు మించి తవ్వకాలు జరుపుతున్నారు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. అక్రమ మైనింగ్‌, రవాణాను అరికట్టేందుకు సీనరేజ్‌ వసూళ్లను ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో టెండర్లను ఆహ్వానించి, అందరికన్నా ఎక్కువ కోట్‌ చేసిన కంపెనీకి టెండర్‌ ఖరారుచేసింది. సదరు సంస్థ ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి నిర్దేశించిన ప్రదేశాల్లో చెక్‌ గేట్లను ఏర్పాటు చేసి సీనరేజ్‌ వసూలు చేస్తున్నది. ఇంతవరకు బాగానే వున్నప్పటికీ ఆయా చెక్‌గేట్ల వద్ద నియమితులైన సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. నిబంధనల ప్రకారం గ్రానైల్‌, నల్లరాయి, మెటల్‌, గ్రావెల్‌, క్రషర్‌ బుగ్గిని రవాణా చేసే వాహనాలకు వే బిల్లు లేకపోతే అటువంటి వాహనాల నుంచి సీనరేజ్‌ వసూలు చేయాలి. అది కూడా ఆన్‌లైన్‌లో చెల్లించేలా చూడాలి. కానీ సీనరేజ్‌ వసూళ్ల కాంట్రాక్టు పొందిన కంపెనీకి చెందిన వ్యక్తులు క్వారీలకు చేరువలో చెకింగ్‌ పాయింట్‌లు ఏర్పాటు చేసి, వే బిల్లు వున్నా, లేకపోయినా నగదు రూపంలో డబ్బులు తీసుకుంటున్నారు. కాంట్రాక్టు పొందిన సంస్థ ముద్రించిన బిల్లులు కాకుండా చిన్న కాగితంపై రబ్బర్‌ స్టాంపు వేసి, దానిపై పెన్నుతో వాహనం నంబరు, తేదీ, సమయం, వసూలు చేసిన డబ్బులు, చెక్‌ పాయింట్‌ పేరు రాసి డ్రైవర్ల చేతిలో పెడుతున్నారు. వీటిపై కాంట్రాక్టు పొందిన సంస్థ పేరుగానీ, చిరునామాగానీ లేవు. కాంట్రాక్టు సంస్థే అక్రమవసూళ్లను ప్రోత్సహిస్తున్నదా? లేకపోతే కాంట్రాక్టు సంస్థకు తెలియకుండా సిబ్బందే అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా? అన్నది మిస్టరీగా వుంది. నిబంధనల ప్రకారం సీనరేజ్‌ సొమ్మును ఆన్‌లైన్‌లో చెల్లించిన తరువాత, చెక్‌ గేటు సిబ్బంది బిల్లు ఉత్పన్నం చేయాలి. కానీ ఇక్కడ అటువంటిదేమీ జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Updated Date - Oct 14 , 2025 | 01:33 AM