Share News

Health Concerns in Turakapalem: మా ఊరికి బంధువులు రావడం లేదయ్యా

ABN , Publish Date - Sep 04 , 2025 | 03:01 AM

మొన్నటి వరకు కోలాహలంగా కనిపించిన గుంటూరు జిల్లా తురకపాలేన్ని నేడు నిస్తేజం ఆవరించింది...

Health Concerns in Turakapalem: మా ఊరికి బంధువులు రావడం లేదయ్యా

తురకపాలెం గ్రామస్థుల ఆవేదన

  • వరుస మరణాలతో నిస్తేజం.. నిర్మానుష్యంగా వీధులు

  • వైద్య శిబిరానికి స్పందన కరువు.. గ్రామాన్ని సందర్శించిన డీఎంఈ

  • శాస్త్రీయంగా సర్వే చేపట్టినట్లు వెల్లడి

  • జీజీహెచ్‌లో పది పడకలతో ప్రత్యేక వార్డు

  • నేడు రక్త నమూనా ఫలితాల వెల్లడి

గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మొన్నటి వరకు కోలాహలంగా కనిపించిన గుంటూరు జిల్లా తురకపాలేన్ని నేడు నిస్తేజం ఆవరించింది. ఇటీవల గ్రామంలో వరుసగా సంభవించిన అంతుపట్టని మరణాలతో గ్రామస్థులు కుదేలయ్యారు. వారిలో తీవ్ర ఆందోళన, భీతి కనిపిస్తున్నాయి. పగటి పూటే కర్ఫ్యూ విధించినట్టు రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. రాత్రి 9 గంటలు దాటితే గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. బుధవారం తురకపాలెం సందర్శించిన మీడియా బృందానికి కనిపించిన దృశ్యాలు ఇవి. నాలుగు నెలల వ్యవధిలో ఈ గ్రామంలో 40కి పైగా మరణాలు నమోదు కావడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి బుధవారం గ్రామంలో పారిశుధ్యం మెరుగుపర్చే కార్యక్రమాలు చేపట్టింది. మెలియాయిడోసిస్‌ జ్వరాలు ప్రబలినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో నిపుణులు గ్రామంలో వాటర్‌ ట్యాంకుల నుంచి నీటి నమూనాలు, పలు చోట్ల మట్టి నమునాలు సేకరించారు. అయితే, ఎస్సీ కాలనీ చర్చిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన కరువైంది. ఇక అందుబాట్లో ఉన ్న కొద్ది మందితో మీడియా ప్రతినిధులు మాట్లాడారు. ‘ఏం చెప్పమంటరయ్యా! గ్రామంలో ఏమి జరుగుతుందో ఏమో.. మాకు తెలియడం లేదు. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వారు ఆకస్మికంగా జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రికి చికిత్సకు వెళ్లి ఆపై శవాలుగా తిరిగొస్తున్నారు’ అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాలుగు నెలలుగా మా ఊరికి బంధువులు ఎవరూ రావడం లేదయ్యా.. మేం కూడా ఎక్కడికి వెళ్లడం లేద’ంటూ నిరాశ వ్యక్తం చేశారు. మే ఒకటిన గ్రామం పొలిమేరలో బొడ్డురాయిని మార్చిన తర్వాతే ఇదంతా జరుగుతోందని గ్రామస్థులు చెప్పడం విశేషం. ఈ బొడ్డురాయిని సరి చేయించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థుల్లో దైర్యం నింపేందుకు సైకియాట్రిస్టులు కూడా కౌన్సెలింగ్‌ ద్వారా తమ వంతు సేవలు ప్రారంభించారు.


జెనెటిక్‌ పరీక్షలు చేయిస్తాం: డీఎంఈ

ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ తురకపాలెం గ్రామాన్ని సందర్శించారు. ఆయనతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మల్లిక, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.విజయలక్ష్మి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి, ఎపిడమాలజిస్ట్‌ డాక్టర్‌ వరప్రసాద్‌, పలువురు వైద్య నిపుణులు పాల్గొన్నారు. డాక్టర్‌ రఘునందన్‌ వైద్య శిబిరాన్ని సందర్శించారు. కొందరి ఇళ్లకు వెళ్లి వారిని పలకరించారు. మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో అంతుపట్టని మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు శాస్త్రీయంగా సర్వే చేపట్టినట్లు తెలిపారు. మొలియాయిడోసిస్‌ జ్వరాలు ప్రబలినట్లు అనుమానాలు వ్యక్తం కావడంతో వీటిని నిర్ధారించేందుకు ఇప్పటి వరకు 36 జ్వర బాధితుల నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు డీఎంఈ తెలిపారు. వీటిని కల్చర్‌ పరీక్ష చేస్తున్నామని, గురువారం నాటికి ఫలితాలు అందుతాయని చెప్పారు. వీటిలో పాజిటివ్‌ రిపోర్టు వస్తే అధునాతన జెనెటిక్‌ పరీక్షల కోసం మణిపాల్‌ హాస్పిటల్‌కు పంపుతామన్నారు. జ్వరాలకు కారణమయ్యే సూడోమల్లీ బ్యాక్టీరియా నీటిలో, మట్టిలో ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామంలో పలు చోట్ల నీటి, మట్టి నమూనాలు కూడా పరీక్షల కోసం సేకరించినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా జ్వర బాధితుల కోసం గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో పది పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారికి మెరుగైన చికిత్సలు అందించేందుకు హెల్ప్‌లైన్‌ ఫోన్‌ నంబర్‌ కేటాయించాలని డీఎంహెచ్‌వోకు సూచించారు.

Updated Date - Sep 04 , 2025 | 09:28 AM