విజయవాడ టు దుబాయ్!
ABN , Publish Date - Feb 03 , 2025 | 12:50 AM
బెజవాడ కేంద్రంగా విదేశీయానానికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు వీలుగా అరబ్ ఎమిరేట్స్ సంస్థ విజయవాడ విమానాశ్రయంపై అధ్యయనం చేస్తోంది. ఇటీవలే అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బృందం విజయవాడ వచ్చి విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డిని సంప్రదించింది. విజయవాడ నుంచి దుబాయ్‌కు ట్రాఫిక్ ఎలా ఉందన్నదానిపై ఎమిరేట్స్ బృందం సొంతగా సర్వే కూడా నిర్వహిస్తోంది.

- విమాన సర్వీసు నడిపేందుకు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఆసక్తి
- సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
- ఎయిర్‌పోర్టు అధికారులతో భేటీ
- సర్వే తర్వాతే నిర్ణయం ప్రకటించే అవకాశం
- విజయవాడ నుంచి దుబాయ్‌కు ఉన్న ట్రాఫిక్ వనరులపై సమగ్ర పరిశీలన
బెజవాడ కేంద్రంగా విదేశీయానానికి మరో అడుగు ముందుకు పడింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు వీలుగా అరబ్ ఎమిరేట్స్ సంస్థ విజయవాడ విమానాశ్రయంపై అధ్యయనం చేస్తోంది. ఇటీవలే అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బృందం విజయవాడ వచ్చి విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంతరెడ్డిని సంప్రదించింది. విజయవాడ నుంచి దుబాయ్‌కు ట్రాఫిక్ ఎలా ఉందన్నదానిపై ఎమిరేట్స్ బృందం సొంతగా సర్వే కూడా నిర్వహిస్తోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడపటానికి ఉన్న అన్ని అవకాశాలపైనా ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అధ్యయనం చేస్తోంది. విమానాశ్రయంలోని ప్రస్తుత ఇంటీరియం టెర్మినల్ బిల్డింగ్‌ను ఎమిరేట్స్ బృందం పరిశీలించింది. ఈ టెర్మినల్‌ను ప్రస్తుతం దేశీయ విమాన సర్వీసులకు ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులకు పాత టెర్మినల్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలుసుకుని దానిని కూడా ఈ బృందం పరిశీలించింది. విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులను గమనించింది. ఈ టెర్మినల్ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మిస్తున్నట్టు ఎయిర్‌పోర్టు అధికారులు ఎమిరేట్స్ బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ టెర్మినల్ మరో ఆరు నెలల్లో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇలాంటి టెర్మినల్స్ నుంచి ఆపరేషన్స్ అనువుగా ఉంటాయని ఎమిరేట్స్ బృందం, విజయవాడ విమానాశ్రయ అధికారులకు చెప్పడం గమనార్హం. విమాన సర్వీసులు నడిపే విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, ఆసక్తిని అయితే ఎమిరేట్స్ బృందం అధికారుల దగ్గర వ్యక్తం చేసింది. సర్వే పూర్తయిన తర్వాత మాత్రమే ఎమిరేట్స్ బృందం విజయవాడ - దుబాయి సర్వీసుపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
డిమాండ్ ఎలా ఉంటుందని ఆరా
విజయవాడ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసుకు డిమాండ్ ఎలా ఉంటుందన్న దానిపై ఎమిరేట్స్ బృందం సమగ్రంగా అధ్యయనం చేస్తోంది. విజయవాడ విమానాశ్రయాన్ని రాష్ట్రంలో ఏయే ప్రాంతాల వారు ఉపయోగించుకుంటారన్న అంశాన్ని విమానాశ్రయ అధికారులను అడిగి తెలుసుకుంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా ప్రజలు కూడా విజయవాడ విమానాశ్రయాన్ని ఉపయోగించుకుంటారన్న విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ఎమిరేట్స్ బృందం దృష్టికి తీసుకు వచ్చారు. విజయవాడ విమానాశ్రయ పాసెంజర్ క్యాచ్‌మెంట్ పరిధిలో ఎంతమంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు ? టూరిస్టులు ఎంత మంది ఉన్నారు ? వారి కదలికలు ఎలా ఉంటాయి ? ఈ ప్రాంతాల ప్రజలు ఏయే విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళుతున్నారు? విదేశీ విద్య కోసం ఎవరెవరు వెళుతున్నారు ? బిజినెస్ పీపుల్ సంఖ్య ఎంత ఉంటుంది ? వారి అవసరాలు ఏమిటి ? అన్న అంశాలపై ఎమిరేట్స్ చాలా లోతుగా అధ్యయనం చేస్తోంది. ఈ ప్రాంతాల నుంచి విదేశాలకు వెళుతున్న వారి వివరాలను కూడా ఆయా విమానాశ్రయాల నుంచి డేటా సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.
వీజీఎఫ్ విధానంలో నడిపేందుకు గతంలో నిర్ణయం
విజయవాడ నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసును వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) విధానంలో నడిపించేందు గత టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్ణయం తీసుకోవటం జరిగింది. అప్పట్లో ఏపీ ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ప్రజాభిప్రాయ సేకరణలో దుబాయ్‌కు విమాన సర్వీసు నడపాలని వేలాది సంఖ్యలో ప్రజలు డిమాండ్ చేశారు. అంతకు ముందు విజయవాడ నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడిపే విషయంలో కూడా గత టీడీపీ ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. సింగపూర్ సర్వీసుకు కూడా వేలాది సంఖ్యలో ప్రజలు సానుకూలతను తెలిపారు. దీంతో అప్పట్లో విజయవాడ - సింగపూర్‌కు వీజీఎఫ్ పద్ధతిలో విమానం నడిపారు. ఆ విమానం నూరు శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడిచింది. అలాగే దుబాయ్ సర్వీసును కూడా ప్రారంభించే సమయానికి ఎన్నికలు వచ్చాయి. దీంతో అప్పట్లో విమాన సర్వీసు ప్రారంభించటానికి వీలు పడలేదు. దుబాయ్ అంటే ప్రపంచంలోనే డెస్టినేషన్ ఎయిర్‌పోర్టులలో ప్రధానమైన వాటిలో ఒకటి. డెస్టినేషన్ ఎయిర్‌పోర్టు అంటే అక్కడి నుంచి ప్రపంచంలోని ఏ దేశానికైనా చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమంలో విజయవాడ నుంచి షార్జాకు రెండు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. విజయవాడ నుంచి దుబాయ్‌కు అవకాశం ఉన్నప్పటికీ విమాన సర్వీసు కల నెరవేరటం లేదు. దుబాయ్‌కు విమాన సర్వీసు కోసం ఎదురు చూస్తున్న దశలో అరబ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విజయవాడ నుంచి దుబాయ్‌కు సాధ్యాసాధ్యాలను పరిశీలించటంతో పాటు సర్వే నిర్వహించటంతో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.