Share News

Andhra Pradesh: వనజాక్షి.. ఇదేం పని..

ABN , Publish Date - Mar 07 , 2025 | 12:57 AM

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమంగా ఇసుక తవ్వుతుంటే అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని నానాయాగీ చేసిన తహసీల్దార్‌ వనజాక్షి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూములను రక్షించుకునేందుకు పేదల భూములను ఎరగా వేశారు.

Andhra Pradesh: వనజాక్షి.. ఇదేం పని..

- 220 కేవీ అలైన్‌మెంట్‌ మాయ

- తహసీల్దార్‌ వనజాక్షి భర్త, బంధువుల భూములను తప్పించటానికి ట్రాన్స్‌కోపై ఒత్తిడి

- కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో అలైన్‌మెంట్‌ మార్పు

- 33 ఎకరాల వనజాక్షి భర్త, బంధువుల భూముల నుంచి లైన్‌ వెళ్లకుండా మార్పు

- సామాన్య రైతుల భూముల్లోకి అలైన్‌మెంట్‌ మారటంతో కోర్టుకెళ్లిన రైతులు

- ప్రభుత్వం విచారణ కు ఆదేశించాలని గుడివాడ ప్రజల వినతి

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అక్రమంగా ఇసుక తవ్వుతుంటే అడ్డుకున్నందుకు తనపై దాడి చేశారని నానాయాగీ చేసిన తహసీల్దార్‌ వనజాక్షి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ భూములను రక్షించుకునేందుకు పేదల భూములను ఎరగా వేశారు. పేదల భూములు అయితే ఒక న్యాయం.. రెవెన్యూ అధికారులు, వారి బంధువులు అయితే మరో న్యాయం అన్నట్టుగా వనజాక్షి భర్త, వారి బంధువుల భూములను గుడివాడ-మెర కగూడెం 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ హైటెన్షన్‌ టవర్‌ లైన్‌ అలైన్‌మెంట్‌ నుంచి అడ్డగోలుగా తప్పించేశారు. ఈ క్రమంలో తమకు అన్యాయం జరిగిందని రైతులు కోర్టును ఆశ్రయించారు. భూములను తప్పించిన విషయం బయట పడుతుందని ట్రాన్స్‌కో అధికారులు కోర్టుకు సమాచారం ఇవ్వట్లేదు. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఈ అలైన్‌మెంట్‌ మాయ కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో రైతులు నష్టపోవాల్సి వస్తోంది.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ):గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడ ప్రాంత ప్రజల విద్యుత కష్టాలను తీర్చటానికి వీలుగా యలమర్రు వద్ద 400/220/132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు రూ.19 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో పాటు యలమర్రులోనే 69.03 ఎకరాల భూములను కూడా సబ్‌స్టేషన్‌కు కేటాయించారు. అప్పట్లో పనులు ప్రారంభించినా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పర్యవేక్షణ లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికి కూడా పూర్తికాలేదు. ఈ సబ్‌స్టేషన్‌కు గుడివాడ నుంచి జంక్షన్‌ వెళ్లే ప్రాంతం మెరకగూడెం సబ్‌స్టేషన్‌ వరకు 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ విద్యుత హైటెన్షన్‌ లైన్లను వేయాల్సి ఉంది. ఇందులో నిర్దేశించిన అలైన్‌మెంట్‌ ప్రకారం పెదపారుపూడిలో ఏడు కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌ను మార్చారు. నిర్దేశిత అలైన్‌మెంట్‌ కంటే కూడా 340 అడుగుల తేడాతో అలైన్‌మెంట్‌ను మార్చటం జరిగింది. ఈ ఏడు కిలోమీటర్ల పరిధిలో భూములను తప్పించటానికి అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌ వనజాక్షి తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ట్రాన్స్‌కో అధికారులపై ప్రభావం చూపి భూములను అలైన్‌మెంట్‌ నుంచి తప్పించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

ఇలా బయట పడింది..

గుడివాడ-మెరకగూడెం 220 కేవీ ట్రాన్స్‌మిషన్‌ హైటెన్షన్‌ లైన్‌ అలైన్‌మెంట్‌కు సంబంధించి 2023, మార్చి 14న ట్రాన్స్‌కో ఎస్‌ఈ గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకు ప్రభుత్వానికి లేఖ రాశారు. గజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల కాకముందే అనధికారికంగా పెదపారుపూడి దగ్గర ఏడు కిలోమీటర్ల మేర అలైన్‌మెంట్‌ను మార్చేశారు. అంతర్గత సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ఇంటర్నల్‌ మినిట్స్‌లో పొందుపరిచారు. ఇదే సందర్భంలో 12 కిలోమీటర్ల మేర పనులు చేసుకోమని కాంట్రాక్టర్‌కు అనుమతులిచ్చినట్టు కూడా మినిట్స్‌లో ఉంది. ఇంటర్నల్‌ మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూశాయి. వాస్తవానికి గజిట్‌ నోటిఫికేషన్‌కు లేఖ ఇచ్చినపుడు ఈ మార్పులు చేయకూడదు. ఈ క్రమంలో ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇచ్చిన లేఖ ప్రకారం 2023, ఏప్రిల్‌ 6న ప్రభుత్వం గజిట్‌ నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఈ అలైన్‌మెంట్‌పై స్థానిక ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను కోరుతూ రెండు నెలల గడువు ఇచ్చారు. గజిట్‌ ప్రకారం రెండు నెలల్లో అభ్యంతరాలు తీసుకోవాల్సి ఉండగా, గజిట్‌ విడుదల కాకముందే అధికారులు అలైన్‌మెంట్‌ మార్చేశారు. తహసీల్దార్‌ వనజాక్షి ప్రభావం కారణంగానే అలైన్‌మెంట్‌ను మార్చార న్న ఆరోపణలు ఉన్నాయి. కిందటి వైసీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాల వల్ల కూడా అలైన్‌మెంట్‌ను మార్చినట్టు విమర్శలు ఉన్నాయి.


అలైన్‌మెంట్‌ నుంచి తప్పించిన భూములన్నీ తహసీల్దార్‌ వనజాక్షి భర్త, వారి బంధువులవే..

- తహసీల్దార్‌ వనజాక్షి భర్త పొట్లూరి లోకేశ్‌కు చెందిన సర్వే నెంబర్‌ 29-1, 30-1, 30-2, 31-2, 32-1, 33-1 (ఎల్‌పీఎం నెంబర్‌ 92)లోని 11.51 ఎకరాల భూమి తప్పించిన అలైన్‌మెంట్‌ పరిధిలో ఉంది.

- బంధువైన కోడె వెంకట సుబ్బారావుకు చెందిన సర్వే నెంబర్‌ 183-4 (ఎల్‌పీ నెం.664) లోని 1.7 ఎకరాలు

- తహసీల్దార్‌ వనజాక్షి భర్త తరఫు బంధువులైన పొట్లూరి రామకృష్ణ ప్రసాద్‌కు చెందిన సర్వే నెంబర్‌ 131 (ఎల్‌పీ నెం.315)లోని 5.52 ఎకరాలు, సర్వే నెంబర్‌ 239-2బీ (ఎల్‌పీ నెం.458)లో 3 ఎకరాలు

- పొట్లూరి ప్రమీలాదేవికి చెందిన సర్వే నెంబర్‌ 145-6 (ఎల్‌పీ నెం. 331)లోని 0.80 ఎకరాలు

- పొట్లూరి లలితకు చెందిన సర్వే నెంబర్‌ 145-5, 145-7ఏ, 145-7బీ (ఎల్‌పీ నెం.332)లో 1.9 ఎకరాలు, సర్వే నెంబర్‌ 155-1 (ఎల్‌పీ నెం.376)లో 2 ఎకరాలు, సర్వే నెంబర్‌ 182-1, 182-2ఏ, 284-16ఏ, 184- 16బీ, 184-17 (ఎల్‌పీ నెం.643)లో 1.77 ఎకరాలు

- పొట్లూరి వెంకటేశ్వరరావుకు చెందిన సర్వే నెంబర్‌ 143-4ఏ (ఎల్‌పీ నెం.329)లో 1.00 ఎకరం, సర్వే నెంబర్‌ 145-1 (ఎల్‌పీ నెం.340)లోని 0.76 ఎకరం

- పొట్లూరి సుజాతకు చెందిన సర్వే నెంబర్‌ 145-3, 146-4, 147-3, 148-3, 149-4 (ఎల్‌పీఎం నెంబర్లు 1037, 1038, 1040)లో 0.21 ఎకరం, 2.00 ఎకరాలు, 0.75 ఎకరం

Updated Date - Mar 07 , 2025 | 10:17 AM