Bail Hearing Postponed: వంశీ ముందస్తు బెయిల్‌పై విచారణ 29కి వాయిదా
ABN , Publish Date - May 23 , 2025 | 05:47 AM
అక్రమ మైనింగ్ కేసులో వంశీ వల్లభనేని దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.
అక్రమమైనింగ్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసు కస్టడీకి వంశీ
ఉత్తర్వులు జారీ చేసిన నూజివీడు కోర్టు
అమరావతి/నూజివీడు, మే 22(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలో అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. గురువారం వ్యాజ్యంపై విచారణ జరిపేందుకు తగిన సమయం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పీటీ వారెంట్ అమలును నిలుపుదల చేస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులనూ అప్పటివరకు పొడిగించింది.
రెండు రోజుల పోలీస్ కస్టడీకి వంశీ
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని రెండు రోజులు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నూజివీడు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గురువారం తీర్పు చెప్పారు. బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మరింత విచారణకు ఈనెల 23, 24 తేదీల్లో వంశీని పోలీస్ కస్టడీకి జడ్జి అనుమతించారు.