Amit Shah : రేపు రాష్ట్రానికి అమిత్ షా
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:02 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8.30కి విజయవాడ విమానాశ్రయంలో దిగుతారు. రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కూటమి ముఖ్య నేతలతో కలిసి భోజనం చేస్తారు. కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన సహకారం , ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారు. రాత్రి 10.30కు విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. 19వ తేదీ ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలతో కాసేపు సమావేశమవుతారు. 11.30కు కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్ 10వ బెటాలియన్‌కు చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌ఐడీఎం) సౌత్ క్యాంప్‌సను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసే సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోం మంత్రి అనిత, ఎన్డీఆర్‌ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు. విభజన చట్టం ప్రకారం ఎన్‌ఐడీఎం ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. పదెకరాల ఈ ప్రాంగణంలో ప్రధాన భవనంతోపాటు శిక్షణా కేంద్రం, ఐటీ విభాగం, ఇతర అనుబంధ కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం ఎన్‌ఐడీఎం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తోంది.