ప్రారంభమైన ఉమూమి తబ్లిగీ ఇజితెమా
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:57 PM
ఆత్మకూరు కేంద్రంగా మూడు రోజుల పాటు జరగనున్న ఉమూమి తబ్లిగీ ఇజితెమా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

భారీగా తరలివచ్చిన ముస్లింలు
భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ
ఆత్మకూరు, జనవరి 7(ఆంధ్రజ్యోతి): ఆత్మకూరు కేంద్రంగా మూడు రోజుల పాటు జరగనున్న ఉమూమి తబ్లిగీ ఇజితెమా మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. శ్రీశైలం రస్తాలోని సుమారు వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇజితెమా ప్రాంగణానికి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన వేలాది మంది ముస్లింలు తరలివచ్చారు. మధ్యాహ్నం ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హాజరైన ఉలేమాలు ఆధ్మాత్మిక ప్రవచనాలను, మహ్మద్ ప్రవక్త నిర్ధేశించిన మార్గదర్శకాలను వినిపించారు. తొలిరోజు మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ముస్లింలు ప్రార్థనలు చేపట్టారు. ఇదిలావుంటే వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికోసం ఇజ్‌తెమా నిర్వహణ కమిటీ భారీ ఏర్పాట్లను సిద్ధం చేసింది. వంద ఎకరాల్లో ప్రాంగణంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేయడంతో పాటు నమాజులు చేసుకునేందుకు వీలుగా సదుపాయాలను కల్పించారు. అలాగే విద్యుద్దీకరణతో పాటు భారీ ఫ్లడ్‌లైట్లను అమర్చారు. అదేక్రమంలో సుమారు 5వేల మరుగుదొడ్లు, స్నానపుగదులు, 17భోజన కౌంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఆయా రూట్లలో 18చోట్ల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి ట్రాఫిక్‌జామ్ సమస్య వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో బస్టాండ్‌కు చేరుకున్న వారికి ప్రత్యేక వాహనాల్లో ఇజితెమా ప్రదేశానికి తరలించే ఏర్పాట్లు కల్పించారు. కాగా మంగళవారం రాత్రికి ఇజితెమా ప్రాంతానికి అధిక సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. బుధవారం ఉదయం నుంచి భారీ స్థాయిలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వహణ కమిటీ సభ్యులు వెల్లడించారు.
భద్రతా చర్యలను పరిశీలించిన ఎస్పీ
ఆత్మకూరులో జరుగుతున్న ఉమూమి తబ్లిగీ ఇజితెమా సందర్భంగా భద్రతా ఏర్పాట్లను నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కింగ్ ప్రదేశాలను, పోలీసు కంట్రోల్ రూమ్‌ను సందర్శించి బందోబస్తు ఏర్పాట్ల గురించి ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తబ్లిగీ ఇజితెమా కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్భందీ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 400 మంది పోలీసు అధికారులు, సిబ్బంది రెండు విడతల వారీగా విధుల్లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట సీఐలు రాము, సురేష్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.