Share News

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌లో పియర్స్‌ బీటలు ఆందోళనకరం

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:30 AM

తుంగభద్ర డ్యామ్‌ గేట్లను మార్చే సమయంలో బయటపడ్డ పియర్స్‌ బీటలపై బోర్డు చైర్మన్‌..

Tungabhadra Dam: తుంగభద్ర డ్యామ్‌లో పియర్స్‌ బీటలు ఆందోళనకరం

  • కొత్త గేట్ల అమరికతోపాటు, పగుళ్లకూ మరమ్మతులు చేయండి

  • పనుల్లో జాప్యాన్ని సహించేది లేదు

  • బోర్డు సమావేశంలో చైర్మన్‌ పాండే

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్‌ గేట్లను మార్చే సమయంలో బయటపడ్డ పియర్స్‌ బీటలపై బోర్డు చైర్మన్‌ ఎస్‌ఎన్‌ పాండే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో తుంగభద్ర గేట బిగించడం, పియర్స్‌ వద్ద ఏర్పడ్డ బీటలకు మరమ్మతు చేయడంపై ప్రత్యే దృష్టి సారించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. గత నెలలో చైర్మన్‌ పాండే అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఏపీ జల వనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి, తెలంగాణ నీటిపారుదల శాఖ, తుంగభద్ర బోర్డు చీఫ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తుంగభద్ర డ్యామ్‌ గేట్ల బిగింపులో చాలా బాలారిష్టాలు ఎదురయ్యాయని కాంట్రాక్టు సంస్థ వెల్లడించింది. ‘నిధుల సమస్య ప్రధానంగా ఉంది. సకాలంలో బిల్లుల చెల్లింపు జరగడం లేదు. డ్యామ్‌ ప్రాంగణంలోనే గేట్ల బిగింపు పనులు చేపట్టడంతో అనుమతుల కోసం తీవ్ర జాప్యం జరిగింది. జిగ్స్‌ బిగింపునకు, గేట్ల తయారీ మెటీరియల్‌ రావడానికి కూడా ఆలస్యం జరిగింది. ప్రాజెక్టు ప్రాంతంలో తరచూ భారీ వర్షాలు కురవడం వల్ల కూడా గేట్ల తయారీ పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. కర్ణాటక రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఇన్‌స్పెక్టర్‌ నుంచి క్లియరెన్సు రావడంలోనూ తీవ్ర జాప్యం జరిగింది. గేట్ల తయారీ, అమరికకు సంబంధించిన చర్య లు చేపట్టాం. వివిధ కారణాలతో జరిగిన ఆలస్యానికి క్షమించండి’ అని కాంట్రాక్టు సంస్థ బోర్డును కోరింది. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్‌... ‘ఇప్పుడు క్షమాపణలు కోరడం కాదు... భవిష్యత్తులో తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను నిర్దేశిత సమయంలో బిగించేందుకు కృషి చేయండి. పాత గేట్లను తొలగించి కొత్త గేట్లను నిర్ణీత సమయంలో బిగించండి’ అని నిర్మాణ సంస్థను ఆదేశించారు. తుంగభద్ర డ్యామ్‌ గేట్ల బిగింపునకు సంబంధించిన నిధులను విడుదల చేయించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్‌ తీసుకోవాలని ఆయన కోరారు. పనిచేయని చెయిన్‌లను కూడా మార్చేయాలని సూచించారు. 15 రోజులకోసారి గేట్ల మార్పిడి, కొత్త గేట్ల బిగింపు సమాచారాన్ని తనకు తెలియజేయాలని, పనుల్లో నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గేట్ల అమరికలో జాప్యాన్ని సహించేది లేదని చైర్మన్‌ తెలిపారు.

Updated Date - Sep 04 , 2025 | 04:30 AM