Share News

Pinnamaneni Saibaba: గుండెపోటుతో టీటీడీపీ నేత సాయిబాబా మృతి

ABN , Publish Date - Dec 29 , 2025 | 04:07 AM

తెలంగాణ తెలుగుదేశం సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా (69) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు.

Pinnamaneni Saibaba: గుండెపోటుతో టీటీడీపీ నేత సాయిబాబా మృతి

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తెలుగుదేశం సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా (69) శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రెండు రోజులుగా ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. బేగంపేట భగవంతపూర్‌లోని నివాసంలో శనివారం భోజనం చేసి పడుకోగా రాత్రి 11 గంటల సమయంలో ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగానే కుప్పకూలి తుది శ్వాస విడిచారు. గతంలో అఖిల భారత ఎన్టీఆర్‌ ఆభిమాన సంఘాల సమైక్య అధ్యక్షుడిగా, వికలాంగుల సంస్ధ చైర్మన్‌గా సాయిబాబా పని చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బక్కని నర్శింహులు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు అరవిందకుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ముఠా గోపాల్‌, ఎన్టీఆర్‌ కుమారుడు నందమూరి రామకృష్ణ, తదితరులు ఆదివారం సాయిబాబా పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సాయిబాబాకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పార్థివదేహాన్ని సోమవారం కొద్దిసేపు టీడీపీ సిటీ కార్యాలయంలో కార్యకర్తల సందర్శన కోసం ఉంచిన అనంతరం అంబర్‌పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సాయిబాబా మృతికి సీఎం సంతాపం

అమరావతి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్‌ నేత, ఎన్టీఆర్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు పిన్నమనేని సాయిబాబా మృతిపట్ల సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. సాయిబాబా మృతి టీడీపీకి తీరని లోటని సీఎం పేర్కొన్నారు. మంత్రి లోకేశ్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ సాయిబాబా మృతికి సంతాపం తెలిపారు.

Updated Date - Dec 29 , 2025 | 06:26 AM