Share News

TTD: తిరుమలలో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ

ABN , Publish Date - May 21 , 2025 | 02:38 AM

తిరుమల భద్రత కోసం యాంటీ డ్రోన్ టెక్నాలజీ అమలు చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 29మంది అన్యమత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇచ్చేందుకు, మరికొన్ని అభివృద్ధి చర్యలకు బోర్డు ఆమోదం తెలిపింది.

 TTD: తిరుమలలో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ

ఒంటిమిట్టలో త్వరలో అన్నప్రసాదం

అన్యమత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఆప్షన్‌

గ్రూపుగా వస్తే అదనంగా 5 లక్షలు చెల్లింపు

స్విమ్స్‌లో 597 పోస్టుల భర్తీకి ఆమోదం

అనంతవరంలో శ్రీవారి ఆలయానికి 10 కోట్లు

టీటీడీ బోర్డు భేటీలో కీలక నిర్ణయాలు: ఈవో

తిరుమల, మే 20(ఆంధ్రజ్యోతి): తిరుమలలో భద్రత పెంపు కోసం ‘యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ’ వినియోగించాలని తీర్మానించినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఆధ్వర్యంలో ఇక్కడి అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు మంగళవారం సమావేశమైంది. అనంతరం బోర్డు చేసిన తీర్మానాలను ఈవో మీడియాకు వెల్లడించారు. తిరుమలలో డ్రోన్లు పనిచేయకుండా చేసే ఇజ్రాయెల్‌కు చెందిన సాంకేతికత సిద్ధంగా ఉన్నట్టు తెలిసిందని చెప్పారు. దీనితోపాటు మరికొన్ని టెక్నాలజీలను కూడా పరిశీలించి, వాటిలో ఉత్తమమైన దాన్ని వినియోగించేందుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అన్యమత ఉద్యోగులు 29మందిని టీటీడీలోనే వేరే విభాగాల్లోకి బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించిందని చెప్పారు. వీరికి వీఆర్‌ఎస్‌ అమలుకు కూడా నిర్ణయం తీసుకున్నామని, దీనిద్వారా ఒక్కొక్కరికి రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుందని పేర్కొన్నారు. వీరంతా గ్రూప్‌గా వీఆర్‌ఎ్‌సకు అంగీకరిస్తే అదనంగా రూ.5లక్షలు ఇస్తామని ఈవో తెలిపారు. వారు ఇక, గోవింద నామాలను వక్రీకరిస్తూ ‘డీడీ నెక్ట్స్‌ లెవల్‌’ అనే సినిమాలో వినియోగించడంపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేశామని ఈవో చెప్పారు.


మరికొన్ని నిర్ణయాలివీ...

ఒంటిమిట్ట రామాలయంలో త్వరలో అన్నప్రసాద వితరణ ప్రారంభం. దీనికోసం తాత్కాలిక భవనం నిర్మాణం.

రాజధాని పరిధిలోని తుళ్లూరు మండలం అనంతవరంలో టీటీడీ శ్రీవారి ఆలయ అభివృద్ధి కోసం రూ.10 కోట్లు కేటాయింపు.

తిరుమల కొండల్లో పచ్చదాన్ని 80 శాతానికి పెంచేందుకు అటవీ విభాగానికి రూ.4 కోట్లు.

తిరుమలలోని బిగ్‌, జనతా క్యాంటీన్ల లైసెన్స్‌కు ఒకే ఫీజు నిర్ధారిస్తూ నిర్ణయం. బ్రాండెడ్‌ హోటళ్ల సంస్థలకే కేటాయించాలని తీర్మానం. దీనికి అనుగుణంగా టెండర్లకు రూపకల్పన.

స్విమ్స్‌లో 597 పోస్టుల భర్తీకి నిర్ణయం.


టీటీడీ ఉద్యోగులకు నేమ్‌ బ్యాడ్జీ

టీటీడీ ఉద్యోగులకు నేమ్‌ బ్యాడ్జీ విధానం అమలవుతోంది. రెండ్రోజుల నుంచి వివిధ విభాగాల్లోని ఉద్యోగులు గుర్తింపు కార్డుతో పాటు నేమ్‌బ్యాడ్జీ కూడా ధరించి విధులు నిర్వహిస్తున్నారు.

వైఖానస సలహా కమిటీ నియామకం

టీటీడీకి నూతన వైఖానస సలహా కమిటీ నియామకమైంది. శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు ఏఎస్‌ కృష్ణశేషాచలం దీక్షితులు, ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పరాశరం భవనారాయణాచార్యులు, చెన్నైకు చెందిన పీకే వరదన్‌ భట్టాచార్యులు, గోవిందరాజస్వామి ఆలయంలోని సంభావన అర్చకుడు అనంతశయన దీక్షితులు, శ్రీవారి ఆలయ మాజీ అర్చకుడు ఖద్రీ నరసింహాచార్యులను కమిటీలో సభ్యులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు కొనసాగనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Tiruvuru Political Clash: తిరువూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. దేవినేని అవినాష్ అరెస్ట్

Liquor Case Remand: లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

Read Latest AP News And Telugu News

Updated Date - May 21 , 2025 | 02:38 AM