Thulabharam Scam: వైసీపీ ప్రభుత్వంలో రూ.కోట్ల విలువైన తులాభారం కానుకలు స్వాహా
ABN , Publish Date - Apr 17 , 2025 | 06:18 AM
తిరుమల శ్రీవారికి భక్తులు తులాభారంగా ఇచ్చిన కోట్ల విలువైన కానుకలను గత వైసీపీ ప్రభుత్వం కాల్షిపారేసిందని బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. దొంగతనానికి బాధ్యులైన వారిని జైలుకు పంపిస్తామన్నారు
బాధ్యులను జైలుకు పంపుతాం: భానుప్రకాశ్ రెడ్డి
తిరుమల, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు తులాభారంలో సమర్పించే కానుకలు, నాణేలు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో వాటాలేసుకుని తినేశారని టీటీడీ బోర్డు సభ్యుడు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తిరుమలలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీవారి ఆలయంలో ఏది జరగకూడదు, ఏది జరగదని భావించామో అవన్నీ గత ప్రభుత్వంలో జరిగాయని అన్నారు. ‘వారం.. నెల వయస్సు ఉన్న బిడ్డలను కూడా తిరుమలకు తీసుకువచ్చి నాణేలు, చక్కర, బియ్యం, కలకండ, నెయ్యి వంటి వాటితో తులాభారం వేసి స్వామికి సమర్పిస్తారు. ఇలా రోజుకు దాదాపు రూ.10 లక్షలు తులాభారం ద్వారా శ్రీవారికి కానుకలు అందుతున్నాయి ఇందులో భారీగా అక్రమాలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది.’ అని ఆరోపించారు. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆలయం నుంచి బయటకు తరలించారనే సమాచారం ఉందని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టి తప్పుచేసిన, సమర్థించిన, తప్పించిన వారిని త్వరలోనే జైలుకు పంపుతామని చెప్పారు.