TTD Employee Arrested: టీటీడీలో ఇంటి దొంగ!
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:49 AM
శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసగించే ఇంటి దొంగను తిరుమల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు..
దర్శనాల పేరిట భక్తులను మోసగిస్తున్న ఉద్యోగి అరెస్ట్
మూడేళ్లలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు
తిరుమల, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనాల పేరుతో భక్తులను మోసగించే ఇంటి దొంగను తిరుమల పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీసుల వివరాల మేరకు.. తిరుపతికి చెందిన మాలే శంకరయ్య టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో మజ్దూరుగా పనిచేసేవాడు. రూ.46 వేలు తీసుకుని దర్శనం చేయించకుండా తనను మోసగించాడంటూ 2023లో హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు తిరుమల టూటౌన్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శంకరయ్య అప్పటి నుంచి ఉద్యోగానికి హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయినా అతని తీరు మారలేదు. తాజాగా విజయవాడకు చెందిన భక్తుల నుంచి రూ.1.20 లక్షలు తీసుకుని మోసగించాడు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు నిఘా పెట్టడంతో దొరికిపోయాడు. శంకరయ్య నుంచి సెల్‌ఫోన్, రెండు బ్యాంక్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రఽథమిక విచారణలో తిరుమలలోని కొంతమంది పీఆర్వోలు, దళారీలతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నాడని తేలింది. గడిచిన రెండుమూడేళ్లలో దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల నగదు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. శంకరయ్యకు టీటీడీ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధుల పీఆర్వోలు, పీఏలు ఎవరెవరు సహకరించారో ఆరా తీస్తున్నారు.