శ్రీనివాసుడి ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణం
ABN , Publish Date - Mar 14 , 2025 | 04:44 AM
శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈ నెల 15న రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.

15న శ్రీవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం: టీటీడీ చైర్మన్
గుంటూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): శ్రీనివాసుడి దివ్య ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణానికి ఏర్పాట్లు జరగుతున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఈ నెల 15న రాజధాని అమరావతిలోని వెంకటపాలెం గ్రామంలో ఉన్న శ్రీ వేంటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో జరగనున్న శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం టీటీడీ ఈవో జె.శ్యామలరావుతో కలిసి విలేకరులకు కల్యాణ మహోత్సవ ఏర్పాట్ల గురించి తెలియజేశారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరిగే శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. అమరావతి పునర్నిర్మాణానికి మొదటి విడతగా రూ.30 వేల కోట్లతో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం జరగనుండటం ఆనందంగా ఉందన్నారు. శ్యామలరావు మాట్లాడుతూ కల్యాణానికి విచ్చేేస భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్టు చెప్పారు.
ఆధ్యాత్మిక నగరంగా అమరావతి: మంత్రి ఆనం
తుళ్లూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): వెంకటపాలెంలో శ్రీవారి కల్యాణోత్సవంతో రాజధాని అమరావతి ఆధ్యాత్మిక నగరంగా మారనుందని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీవారి కల్యాణోత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం గురువారం పరిశీలించింది. ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేసింది.