Share News

AP Bar Council: ట్రోలింగ్‌పై తక్షణ చర్యలు అవసరం

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:03 AM

సోషల్‌ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డిపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ ట్రోల్‌ చేయడాన్ని ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఖండించింది.

AP Bar Council: ట్రోలింగ్‌పై తక్షణ చర్యలు అవసరం

  • ఏపీ బార్‌ కౌన్సిల్‌ తీర్మానం

అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.శ్రీనివాసరెడ్డిపై నిరాధార ఆరోపణలు, వ్యక్తిత్వ హననం చేస్తూ ట్రోల్‌ చేయడాన్ని ఏపీ బార్‌ కౌన్సిల్‌ ఖండించింది. ట్రోలింగ్‌ను అడ్డుకునేందుకు తక్షణ చర్యలు చేపట్టడం అవసరమని పేర్కొంది. చైర్మన్‌ నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం ఏపీ బార్‌ కౌన్సిల్‌ వర్చువల్‌గా సమావేశమైంది. వైస్‌చైర్మన్‌ కృష్ణమోహన్‌, బార్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు ఏ రామిరెడ్డి, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ పలు తీర్మానాలను ఆమోదించింది. ఓ కేసులో తీర్పు వెల్లడించిన అనంతరం సోషల్‌ మీడియా, డిజిటల్‌ ఫోరమ్‌, పబ్లిక్‌ డొమైన్‌లో జస్టిస్‌ శ్రీనివాసరెడ్డిని ట్రోల్‌ చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపింది. న్యాయమూర్తులు చట్టనిబంధనలు అనుసరించి తీర్పులు ఇస్తారని.. వాటిని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించి వారిపై దాడి చేయడం సరికాదని స్పష్టంచేసింది. ‘గతంలో కూడా న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని ట్రోల్‌ చేశారు. పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలపై తక్షణ చర్యలు అవసరం. ఇందుకోసం హైకోర్టు రిజిస్ట్రార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ప్రస్తుత, గతంలో జరిగిన ఘటనలపై విచారణ జరిపి.. బాధ్యులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కఠిన చర్యలు తీసుకోవాలి. రెచ్చగొట్టే చర్యలు ఉన్నప్పటికీ తమ రాజ్యాంగ విధులను నైతిక నిష్ఠతో నిర్వహిస్తున్న న్యాయమూర్తులకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’ అని బార్‌ కౌన్సిల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Jul 07 , 2025 | 03:06 AM