చెట్లు కొట్టేస్తున్నారు
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:59 AM
మధుర ఫలం మామిడికి ఈ ఏడాది కూడా నష్టాలు వచ్చే పరిస్థితులు దాపురించడంతో మామిడి సీజన్ ప్రారంభం కాకముందే మైలవరం మండలంలో తోటలను రైతులు నరికివేస్తున్నారు. గత ఐదారు సంవత్సరాల నుంచి మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో దాన్ని తీసివేసి వేరే పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు.

మైలవరం మండలంలో తొలగిస్తున్న మామిడి తోటలు
9 వేల నుంచి 6,800 ఎకరాలకు పడిపోయిన సాగు
పెరిగిన పామాయిల్ సాగు
(మైలవరంరూరల్,ఆంధ్రజ్యోతి):
మధుర ఫలం మామిడికి ఈ ఏడాది కూడా నష్టాలు వచ్చే పరిస్థితులు దాపురించడంతో మామిడి సీజన్ ప్రారంభం కాకముందే మైలవరం మండలంలో తోటలను రైతులు నరికివేస్తున్నారు. గత ఐదారు సంవత్సరాల నుంచి మామిడి పంట ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో దాన్ని తీసివేసి వేరే పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్‌లో నూజివీడు మామిడి తర్వాత మైలవరం ప్రాంత మామిడి కాయలకు మంచి పేరుంది. అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఖర్చులు పెరిగి, దిగుబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మామిడి రైతులు చెట్లను తెగనమ్ముకుంటున్నారు. సైజును బట్టి ఒక్కో చెట్టును రూ.4వేల నుంచి 6వేల వరకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. గతంలో మైలవరం మండలంలో తొమ్మిది వేల ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉండేవి. ఐదు సంవత్సరాల నుంచి వివిధ కారణాలతో తోటలు నరికి వేస్తుండటంతో ప్రస్తుతం మామిడి తోటల విస్తీర్ణం 6,800 ఎకరాలకు పడిపోయింది. రానున్న రోజుల్లో కూడా మామిడి తోటలకు గడ్డు కాలం నడిస్తే మార్కెట్‌లో మైలవరం మామిడి కనుమరుగయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామిడి పంట సాగుకు కూడా సబ్సిడీలు ప్రకటించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పెరిగిన ఖర్చులు, తగ్గిన దిగుబడి
మామిడి తోటల సాగుకు గతం కంటే ప్రస్తుతం ఖర్చులు అధికమయ్యాయి. వర్షాకాలంలో దుక్కులు, చెట్లకు బలం కోసం భూమిలో మందులు, కాపు సమయంలో రసాయనిక మందులను అధికంగా పిచికారీ చేస్తుండటంతో ఎకరాకు రూ.20 వేల నుంచి 30 వేలు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పూతలు ఆశించిన స్థాయిలో పూసిన తెగుళ్ల ధాటికి పూత రాలిపోయి చెట్లకు కాడలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి నల్లి, పేలు మామిడి తోటలను ఆశిస్తుండటంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. వీటి నివారణకు ఎన్నో రకాల మందులు పిచికారీ చేసినా ఫలితం ఉండటం లేదని రైతులు చెబుతున్నారు. మామిడి తోటలను తెగనరకడంలో నల్లి, పేలు పాత్ర అధికంగా ఉందని అంటున్నారు. దీంతో ఖర్చులు పెరిగి, ఆశించిన స్థాయిలో దిగుబడి రాక నష్టాలు చవిచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పామాయిల్ సాగుకు మొగ్గు
మామిడి తోటల స్థానంలో అధికశాతం మంది రైతులు పామాయిల్ తోటలను సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. గత రెండేళ్లుగా మైలవరం మండలంలో పామాయిల్ సాగు అధికమయ్యింది. పామాయిల్ సాగుకు ప్రభుత్వం పలు రకాల సబ్సిడీలు ఇస్తుంది. దీంతో సాగుకు ఖర్చులు తక్కువతోపాటు మారె ్కట్‌లో పామాయిల్ పంటకు డిమాండ్ ఉండటంతో మైలవరం మండలంలో సుమారు 2వేల ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేస్తున్నారు.
ముదురు తోటలు తొలగిస్తున్నారు
40 సంవత్సరాల వయసున్న మామిడి చెట్లను రైతులు నరికివేస్తున్నారు. ఆయా తోటల్లో మందులు పిచికారీ కష్టంగా మారింది. దీంతో రైతులు మామిడి తోటలు తీసివేసి పామాయిల్, జామ, తదితర వాటిపై దృష్టి పెడుతున్నారు.
- సొహైల్ అహ్మద్, ఉద్యానశాఖ అధికారి