Share News

Vijayawada: పెళ్లయిన రెండు నెలలకే విషాదాంతం

ABN , Publish Date - Jul 02 , 2025 | 05:39 AM

హైదరాబాద్‌ శివారులోని సిగాచి ఫార్మా ప్లాంట్‌లో సోమవారం జరిగిన పేలుడు ఏపీలో తీవ్ర విషాదం నింపింది. రెండు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న కడప జిల్లా అబ్బాయి, ఎన్టీఆర్‌ జిల్లా అమ్మాయి ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.

Vijayawada: పెళ్లయిన రెండు నెలలకే విషాదాంతం

  • సిగాచి ఫార్మా పేలుడులో ఏపీ యువజంట మృతి

  • కడప జిల్లా అబ్బాయి.. ఎన్టీఆర్‌ జిల్లా అమ్మాయి

  • ఇటీవలే ప్రేమ వివాహం... త్వరలోనే రిసెప్షన్‌

  • విధుల్లో ఉండగా ఇద్దరినీ కబళించిన మృత్యువు

విజయవాడ (తిరువూరు, విస్సన్నపేట), ముద్దనూరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ శివారులోని సిగాచి ఫార్మా ప్లాంట్‌లో సోమవారం జరిగిన పేలుడు ఏపీలో తీవ్ర విషాదం నింపింది. రెండు నెలల క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్న కడప జిల్లా అబ్బాయి, ఎన్టీఆర్‌ జిల్లా అమ్మాయి ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. పెనికెలపాడు గ్రామానికి చెందిన రైతు దంపతులు ప్రసాద్‌రెడ్డి, మాధవికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నిఖిల్‌ కుమార్‌రెడ్డి (33) కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని సిగాచి ఫార్మా ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన శ్రీరమ్య (23)తో అతనికి స్నేహం కుదిరింది. అది ప్రేమగా మారడంతో రెండు నెలల క్రితమే వారు తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో వారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఆశ్రయించారు. ఆయన వారికి ధైర్యం చెప్పి ఇరు కుటుంబాలనూ ఒప్పించారు. దీంతో ఆషాఢం వెళ్లిన తర్వాత రిసెప్షన్‌ చేయాలని ఇరుకుంటుంబాలు నిర్ణయించాయి. గత నెలలో దంపతులిద్దరూ పెనికెలపాడుకు వచ్చి వెళ్లారు. కాగా, సిగాచి ఫార్మా ప్లాంట్‌లో సోమవారం జరిగిన పేలుడులో నిఖిల్‌ కుమార్‌రెడ్డి, శ్రీరమ్య ఇద్దరూ దుర్మరణం పాలయ్యారు.

విధులకు ముందుగా వెళ్లి మృత్యుఒడికి..

ఫార్మా కంపెనీలో ఉదయం పది గంటల షిఫ్టు వెళ్లాల్సిన రమ్యశ్రీ ప్రమాదం జరిగిన రోజు ఉదయం ఐదు గంటల షిఫ్టుకే విధులకు హాజరైంది. అప్పటికే నిఖిల్‌కుమార్‌రెడ్డి విధుల్లో ఉన్నాడు. ప్రమాదంలో ఇద్దరూ సజీవ దహనమవడం ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నింపింది.

Updated Date - Jul 02 , 2025 | 05:43 AM