Share News

Tragic Incident : రాకాసి అలలు మింగేశాయి!

ABN , Publish Date - Jan 17 , 2025 | 03:55 AM

సముద్రస్నానం ఆ కుటుంబంలోతీవ్ర విషాదం మిగిల్చింది. మూడ్రోజులపాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులంతా కలిసి ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకొని, నాల్గవరోజు సముద్ర స్నానానికి వెళ్లగా అక్కడ వారి ఆనందం ఆవిరైంది. కుటుంబసభ్యులంతా కేరింతలు కొడుతూ సముద్రంలో

 Tragic Incident : రాకాసి అలలు మింగేశాయి!

సముద్ర స్నానానికెళ్లి ముగ్గురు మృతి.. ఒకరు గల్లంతు

మృతులంతా బంధువులే.. ప్రకాశం జిల్లా పాకల బీచ్‌లో ఘటన

సింగరాయకొండ/పొన్నలూరు/కందుకూరు, జనవరి 16(ఆంధ్రజ్యోతి): సముద్రస్నానం ఆ కుటుంబంలోతీవ్ర విషాదం మిగిల్చింది. మూడ్రోజులపాటు కుటుంబసభ్యులు, సమీప బంధువులంతా కలిసి ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకొని, నాల్గవరోజు సముద్ర స్నానానికి వెళ్లగా అక్కడ వారి ఆనందం ఆవిరైంది. కుటుంబసభ్యులంతా కేరింతలు కొడుతూ సముద్రంలో స్నానం చేస్తున్న సమయంలో భారీగా అలలు రావటంతో నలుగురు గల్లంతయ్యారు. దీంతో స్థానిక మత్స్యకారులు, సముద్రస్నానాలకు వెళ్లిన ఇతర ప్రాంతాల యువకులు అప్రమత్తమై వారిలో ఒకరిని కాపాడగా, ముగ్గురు మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం జరిగింది. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామపంచాయతీలోని శివన్నపాలేనికి చెందిన 20 మంది బంధువులు సముద్ర స్నానానికి గురువారం ఉదయం పాకల బీచ్‌కు వచ్చారు. వారంతా సముద్రంలో స్నానానికి దిగిన సమయంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంది. ఆ తాకిడికి అకస్మాత్తుగా ఐదుగురు కొట్టుకుపోయారు. దీంతో మిగిలిన వారు కేకలు వేయడంతో మెరైన్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో నోసిన మాధవ(26), నోసిన జెస్సికా(16), కొల్లగుంటకు చెందిన కొండాబత్తిన యామిని(19) మృతిచెందారు. మాధవ భార్య నవ్యను మెరైన్‌ సిబ్బంది కాపాడారు. ఊహించని ప్రమాదంతో పాకల బీచ్‌లో విషాదం నెలకొంది. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. కాగా.. ఇదే బీచ్‌లో స్నానానికి దిగిన సింగరాయకొండకు చెందిన తమ్మిశెట్టి పవన్‌ కుమార్‌ (22) కూడా అలల తాకిడికి గల్లంతయ్యాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ప్రకాశం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలించాలని సిబ్బందిని ఆదేశించారు. సమాచారం అందుకున్న మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాకల బీచ్‌కు చేరుకుని గాలింపు చర్యలను సమీక్షించారు. కందుకూరు ఏరియా ఆసుపత్రిలో మంత్రి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మృతదేహాలను సందర్శించి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Jan 17 , 2025 | 03:55 AM