గేమ్ చేంజర్ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
ABN , Publish Date - Jan 06 , 2025 | 04:32 AM
రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు.

ఇద్దరు యువకులు మృతి
రంగంపేట, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో శనివారం జరిగిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) బైక్‌పై శనివారం రాజమహేంద్రవరం రూరల్ మండలం వేమగిరిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారు. జనం ఎక్కువగా ఉండడంతో తిరిగి కాకినాడ బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు వడిశలేరులో ఎదురుగా వస్తున్న వ్యాన్ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టగా తీవ్రగాయాలపాలయ్యారు. దీంతో ఇద్దరినీ వారి స్నేహితులు 108 వాహనంలో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కొనఊపిరితో ఉన్న చరణ్‌ను చికిత్స నిమిత్తం కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి 12.15 గంటలకు మృతిచెందాడు. మృతుల స్నేహితుడు శశిశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ టి.కృష్ణసాయి తెలిపారు.