ట్రాఫిక్ టెర్రర్!
ABN , Publish Date - Feb 23 , 2025 | 01:27 AM
వీఐపీ కారిడార్(ఎన్‌హెచ్ - 16)లోని జంక్షన్ల వద్ద రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. నగరంలో అంతర్గత ట్రాఫిక్ అంతకంతకూ రద్దీ కావడంతో సిగ్నల్స్‌ను మాన్యువల్‌గా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం ట్రాఫిక్ పోలీసులకు సౌకర్యంగా ఉందేమో కానీ వాహనదారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియక వాహనాలను రన్నింగ్ మోడ్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫలితంగా జంక్షన్ల దగ్గర కాలుష్యం పెరగడంతో పాటు వాహనాలకు వృథాగా ఇంధనం ఖర్చవుతోంది. వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఇన్నర్ రింగు రోడ్డు పనులు మొదలు పెట్టడం దీనికి పరిష్కారంగా కనిస్తోంది. ఆటో నగర్‌లోకి వాహనాలను నగరం వెలుపల నుంచి అనుమతించడం, హైవేపై పార్కింగ్ చేసే వాహనాలపై చర్యలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

- వీఐపీ కారిడార్(ఎన్‌హెచ్-16)లో జంక్షన్స్ జామ్
- బెజవాడలో అడుగడుగునా ట్రాఫిక్ పద్మవ్యూహాలే..
- మాన్యువల్‌తో నెట్టుకొస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- ఇంజిన్ రన్నింగ్‌లో ఉంచడంతో పెరుగుతున్న కాలుష్యం, వృథా అవుతున్న ఇంధనం
- వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తెస్తే 20 శాతం పరిష్కారం
- హైవేపై ఇష్టారాజ్యంగా ప్రైవేటు బస్సులు, ఆటోవాలాల పార్కింగ్
- పట్టించుకోని అధికారులు.. ఇబ్బందుల్లో వాహనదారులు
వీఐపీ కారిడార్(ఎన్‌హెచ్ - 16)లోని జంక్షన్ల వద్ద రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతోంది. నగరంలో అంతర్గత ట్రాఫిక్ అంతకంతకూ రద్దీ కావడంతో సిగ్నల్స్‌ను మాన్యువల్‌గా నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం ట్రాఫిక్ పోలీసులకు సౌకర్యంగా ఉందేమో కానీ వాహనదారులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియక వాహనాలను రన్నింగ్ మోడ్‌లోనే ఉంచాల్సి వస్తోంది. ఫలితంగా జంక్షన్ల దగ్గర కాలుష్యం పెరగడంతో పాటు వాహనాలకు వృథాగా ఇంధనం ఖర్చవుతోంది. వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఇన్నర్ రింగు రోడ్డు పనులు మొదలు పెట్టడం దీనికి పరిష్కారంగా కనిస్తోంది. ఆటో నగర్‌లోకి వాహనాలను నగరం వెలుపల నుంచి అనుమతించడం, హైవేపై పార్కింగ్ చేసే వాహనాలపై చర్యలు తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
నగరంలో వాహనాల వినియోగం గణనీయంగా పెరిగింది. కుటుంబంలో ఎంత మంది ఉంటే ్ఞఅన్ని ద్విచక్రవాహనాలు ఉంటున్నాయి. కార్లను వినియోగిస్తున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఆర్థిక స్థోమత కలిగిన వారి ఇళ్లలో కార్ల సంఖ్య కూడా ఎక్కువే. నగరంలో పరిమితికి మించి తిరుగుతున్న ఆటోలు, ఇతర రవాణా వాహనాలు, లారీలు, భారీ వాహనాల ప్రవేశం వల్ల అంతులేని రద్దీ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం, రాత్రి సమయాల్లో వీఐపీ కారిడార్ (ఎన్‌హెచ్-16)లో ప్రధానంగా బెంజిసర్కిల్, నిర్మలా కాన్వెంట్ జంక్షన్, ప్రభుత్వాస్పత్రి జంక్షన్, రామవరప్పాడు జంక్షన్, శక్తి కల్యాణ మండపం జంక్షన్‌లు ట్రాఫిక్‌తో అట్టుడికిపోతున్నాయి. వాహనదారులకు నిత్యం నరకంగా మారుతోంది.
వృథా అవుతున్న సమయం
శివారు గ్రామాల నుంచి విజయవాడ రావటానికి పావుగంట పడితే.. ఈ జంక్షన్ల మీదుగా నగరంలోకి ప్రవేశించడానికి కనిష్టంగా అర్ధగంట, గరిష్టంగా ముప్పావుగంటకుపైగా సమయం పడుతుంది. నగరంలోని వారికైతే కనిష్టంగా 20 నిమషాల నుంచి గరిష్టంగా అర్ధగంటకు పైగా పడుతోంది. జంక్షన్ల దగ్గరే పావు గంట వరకు వాహనాలను రన్నింగ్ మోడ్‌లో ఉంచాల్సి వస్తోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే .. కనీసం వాహనాలను ఆఫ్ మోడ్‌లో పెట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. మాన్యువల్ విధానం వల్ల ఎప్పుడు వదులుతారో తెలియదు. వాహనం ఇంజిన్ ఆపితే ఒక్కసారి వదలగానే.. ఇంజిన్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లటానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు వెనుక వాహనాలు చేసే హారన్ల గోల అంతా ఇంతా కాదు. పరిస్థితి ఎలా తయారైందంటే.. వీఐపీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు చిరాకుగా, అసహనంగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీనివల్ల వాహనదారుల ఆరోగ్యంపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.
కాలుష్య నగరాల్లో ప్రథమ స్థానం
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన దక్షిణాది కాలుష్య నగరాల్లో విజయవాడ నగరం మొదటి స్థానంలో ఉంది. విజయవాడ నడిబొడ్డున వెళ్లే వీఐపీ కారిడార్‌పై కర్బన ఉద్గారాల సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటోంది. ట్రాఫిక్ పోలీసుల కోణంలో చూస్తే ట్రాఫిక్ రద్దీని తట్టుకోవటానికి వారు అనుసరిస్తున్న మాన్యువల్ విధానం కొంత వరకు మంచిదే అయినా వాహనదారులకు అది సంతృప్తికరంగా లేదు. ఇలా ఎన్నాళ్లు మాన్యువల్‌గా నిర్వహిస్తారు, దీనికి పరిష్కారం ఏమిటన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది.
వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే..
వీఐపీ కారిడార్‌పై రద్దీ తగ్గించాలంటే.. తక్షణ పరిష్కారం విజయవాడ వెస్ట్ బైపాస్‌ను అందుబాటులోకి తీసుకురావడం. దీని వల్ల 20 శాతం వరకు ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చు. సంక్రాంతి సమయంలో పోలీసులు బైపాస్‌ను నైనవరం నుంచి వినియోగంలోకి తీసుకువచ్చారు. అయినా విజయవాడపై రద్దీని నివారించలేని పరిస్థితి ఏర్పడింది. అయితే అదనపు ట్రాఫిక్‌ను కొంతమేర మళ్లించటానికి దోహద పడింది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన వెస్ట్ బైపాస్ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే భారీ వాహనాలు, లారీలను అటుగా మళ్లీంచే అవకాశం ఉంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే భారీ వాహనాల తరలింపునకు అవకాశం
విజయవాడ తూర్పు బైపాస్ ప్రతిపాదనపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ ప్రాజెక్టు ఇక మీదట పట్టాలెక్కే పరిస్థితి కనిపించడంలేదు. విజయవాడ నగరంలో నెలకొన్న అంతర్గత ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించటానికి విజయవాడ తూర్పు బైపాస్ ఆలోచన ప్రత్యామ్నాయంగా ఉంది. ఈ ప్రతిపాదన అర్ధంతరంగా ఆగిపోవటంతో సమస్య ఏర్పడింది. తూర్పు బైపాస్ ఎటూ లేదు.. కనీసం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో భాగంగా మొదటి దశలో అయినా చోడవరం నుంచి కేసరపల్లి వరకు రోడ్డు పనులను ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కేసరపల్లి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్‌కు కలపగలిగితేనే భారీ వాహనాల సమస్యకు పూర్తి స్థాయిలో పరిష్కారం లభిస్తుంది.
ఆటోనగర్‌లోకి నగరం వెలుపల నుంచి అనుమతించాలి
విజయవాడను ఆనుకుని ఉన్న ఆటోనగర్‌లోకి మొదట్లో బందరు రోడ్డులో పంటకాల్వ రోడ్డు, ఆటోనగర్ గేట్ల మీదుగా అనుమతులు ఉండేవి. దీంతో బందరు రోడ్డు ట్రాఫిక్ సమస్యలతో అతలాకుతలంగా మారింది. అనేక జిల్లాల నుంచి విజయవాడ ఆటోనగర్‌కు వచ్చే లారీల కారణంగా బందరు రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యలు పెరిగాయి. పటమట నుంచి కానూరు వరకు ప్రజలు గొడవ చేయటంతో.. అప్పటి నుంచి ఆటోనగర్‌లోకి వాహనాల డైవర్షన్ రూటు మార్చారు. ప్రస్తుత వీఐపీ కారిడార్‌లో మహానాడు రోడ్డు, శక్తి కళ్యాణ మండపం రోడ్డు, ఎనికేపాడు 100 అడుగుల రోడ్డు, మధ్యలో బల్లెం వారి వీధి, రామవరప్పాడు రింగ్ దగ్గర ఉన్న రోడ్ల నుంచి అనుమతులు ఇస్తున్నారు. దీంతో వీఐపీ కారిడార్ మీద పడుతున్న రద్దీ అంతా, ఇంతా కాదు. ఆటోనగర్ నుంచి నాలుగు రోడ్ల ద్వారా వచ్చీ, పోయే వాహనాల వల్ల జాతీయ రహదారి మీద ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగా కూడా వీఐపీ కారిడార్‌పై ట్రాఫిక్ సమస్యలు నెలకొంటున్నాయి.
అడ్డగోలుగా వాహనాల పార్కింగ్
వీఐపీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలకు ప్రధానంగా ప్రైవేటు బస్సులు, ఆటోలు కూడా కారణమవుతున్నాయి. ప్రస్తుతం వీఐపీ కారిడార్‌గా పిలుస్తున్న ఎన్‌హెచ్ - 16 కేవలం నాలుగు వరసలుగానే ఉంది. ఒక లేన్‌లో రెండు వరసలు మాత్రమే ఉంటాయి. బెంజిసర్కిల్, రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు హైవేపై ఒక లేనులో బారులు తీరి ఉంటాయి. దీంతో ఇక మరో ఒక లేన్ మాత్రమే మిగిలి ఉంది. ఈ లేన్‌లో క్రాసింగ్స్ ఉండటం వల్ల ఆ లేన్‌లో వాహనాలు నిదానంగా వెళతాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇవి కాకుండా ఆటోవాలాలు ఇష్టారాజ్యంగా రోడ్ల మీద వాహనాలను నిలుపుతున్నారు. ప్రసాదంపాడు, ఎనికేపాటు, రామవరప్పాడు, విజయవాడలోని బస్టాపుల దగ్గర అడ్డగోలుగా రోడ్ల మీద వాహనాలను పెట్టడం వల్ల ఒక లేన్‌లోనే మిగిలిన వాహనాలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అలాగే రమేష్ హాస్పిటల్ జంక్షన్ నుంచి నిడమానూరు జంక్షన్ వరకు రెండు వైపులా జాతీయ రహదారికి అనేక అంతర్గత రోడ్లు అనుసంధానమవుతాయి. ఈ రోడ్ల మీదుగా నేరుగా జాతీయ రహదారిలోకి వాహనాల ప్రవేశం వల్ల కూడా ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోడ్డు సేఫ్టీ కమిటీ కానీ, ట్రాఫిక్ అధికారులు కానీ , జిల్లా యంత్రాంగం కానీ దృష్టి సారించకపోతే రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు నగరాన్ని స్తంభింపజేసే ప్రమాదం పొంచి ఉంది.