Toxic Gas Leak: లుపిన్ ఫార్మాలో విష వాయువులు లీక్
ABN , Publish Date - Aug 05 , 2025 | 06:31 AM
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లుపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది
ఆరుగురికి అస్వస్థత.. ఒకరి పరిస్థితి విషమం
పరవాడ, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని లుపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ పరిశ్రమలో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. విష వాయువులు లీక్ కావడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పరవాడ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రాడక్షన్ బ్లాక్‌లోని రియాక్టర్‌లో తెల్లవారుజామున మూడు గంటలకు మూడు రకాల రసాయనాలను కలిపి పైపు ద్వారా పంపుతున్నారు. ఈ క్రమంలో విష వాయువులు లీక్ అయ్యాయి. దాంతో అక్కడ షిఫ్ట్ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న మాతా సాయికుమార్ (40) స్పృహ కోల్పోయి ఆపస్మారక స్థితికి చేరుకున్నారు. అక్కడే పనిచేస్తున్న కార్మికులు కె.గణేశ్ (28), పి.సూరినాయుడు (30) పి.రాఘవేంద్రకుమార్ (42), యు.నరేశ్‌కుమార్ (40), బి.రామునాయుడు (35) అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ కంపెనీ ప్రతినిధులు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్ పరిస్థితి విషమంగా ఉంది. విష వాయువులు పీల్చడం కారణంగానే కార్మికులు అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాకర్టీస్ పరమేశ్వరరావు, ఇన్‌చార్జి డీఎస్పీ బి.మోహన్‌రావు, ఇన్‌చార్జి సీఐ రామచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నెల రోజుల్లో రెండో ప్రమాదం
లుపిన్ ఫార్మా పరిశ్రమలో నెల రోజుల వ్యవధిలో రెండో ప్రమాదం జరిగింది. జూలై 8న ప్రాడక్షన్ బ్లాక్‌లో విష వాయువులు లీకై లక్ష్మణకుమార్ అనే కార్మికుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు.