రేపు నరసం 7వ రాష్ట్ర సదస్సు
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:34 PM
నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర సదస్సు ఆదివారం కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు కేవీ సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి తెలిపారు.

హాజరు కానున్న కవయిత్రులు, రచయిత్రులు
మహిళా కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు
కర్నూలు కల్చరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) రాష్ట్ర సదస్సు ఆదివారం కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు కేవీ సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి తెలిపారు. శుక్రవారం నగరంలోని టీజీవీ కళా క్షేత్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, తెలుగుభాషా వికాస ఉద్యమం సంస్థ రాష్ట్ర కార్యదర్శి జేఎస్‌ఆర్‌కే శర్మ, ఎం. లక్ష్మయ్య, నరసం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి, కార్యదర్శి పసుపులేటి నీలిమ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరసం 7వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సు పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేవీ సుబ్బలక్ష్మమ్మ, డాక్టర్ దండెబోయిన పార్వతీదేవి మాట్లాడుతూ నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ రాష్ట్ర సభలు వివిధ సెషన్లలో కొనసాగుతాయని తెలిపారు. సదస్సును మాజీ ఎంపీ టీజీ వెంకటేశ ప్రారంభిస్తారని, ముఖ్య అతిథులుగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, క్లస్టర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య డీవీఆర్ సాయిగోపాల్, రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి. పుల్లయ్య, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, సాహితీ సదస్సు రాష్ట్ర అధ్యక్షుడు కేసీ కల్కూర, కృష్ణా జిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్, నరసం మాజీ మార్కెట్ యార్డు ఛైర్మన శమంతకమణి, నరసం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు తేళ్ల అరుణ, డాక్టర్ పాతూరి అన్నపూర్ణలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కవయిత్రులు, రచయిత్రులు హాజరవుతున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళా కవులు, రచయిత్రులకు ఒక వేదిక కల్పించేందుకు 2018లో నరసం సంస్థను స్థాపించామని తెలిపారు. ఏటా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక రుగ్మతలు, మహిళా సమస్యల పరిష్కార సాధనకు చైతన్యం తీసుకు వస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 7వ వార్షికోత్సవ రాష్ట్ర సదస్సులో పుస్తక ప్రదర్శనలు, పుస్తక ఆవిష్కరణలు, కవి సమ్మేళనాలు, వివిధ అంశాలపై చర్చాగోష్టులు ఉంటాయని వివరించారు. ఉమ్మడి జిల్లాలోని సాహిత్యాభిలాషులైన మహిళలు ఈ సదస్సునకు విచ్చేసి విజయవంతం చేయాలని వారు కోరారు.