Share News

Tirupati: ‘ఒబెరాయ్‌’కి తొలగిన అడ్డంకులు

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:53 AM

ఒబెరాయ్‌ గ్రూప్స్‌కు చెందిన మెస్సర్స్‌ ముంతాజ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ తిరుపతిలో సెవెన్‌ స్టార్‌ లగ్జరీ విల్లా్‌సతో కూడిన రిసార్ట్స్‌ ఏర్పాటుకు 2021లో ముందుకొచ్చింది.

Tirupati: ‘ఒబెరాయ్‌’కి తొలగిన అడ్డంకులు

తిరుపతిలో మొదలైన సెవన్‌స్టార్‌ హోటల్‌ నిర్మాణ పనులు

రాయలసీమలోనే తొలి సెవన్‌స్టార్‌ లగ్జరీ హోటల్‌

చంద్రబాబు చొరవ.. తుడా అనుమతులు మంజూరు

ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తయ్యే చాన్స్‌

(తిరుపతి-ఆంధ్రజ్యోతి)

తిరుపతిలో ఒబెరాయ్‌ సెవెన్‌ స్టార్‌ లగ్జరీ విల్లా్‌సతో కూడిన రిసార్ట్స్‌ నిర్మాణానికి అడ్డంకులు తొలిగాయి. రాయలసీమలోనే తొలి సెవన్‌స్టార్‌ లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి మూడేళ్లుగా ఉన్న అవరోధాలు సీఎం చంద్రబాబు చొరవతో తొలగిపోయాయి. ఇంతకాలం పెండింగులో ఉన్న తుడా అనుమతులు కూడా ఇటీవలే మంజూరయ్యాయి. పనులు మొదలు కావడంతో ఏడాదన్నరలో నిర్మాణాలు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒబెరాయ్‌ గ్రూప్స్‌కు చెందిన మెస్సర్స్‌ ముంతాజ్‌ హోటల్స్‌ లిమిటెడ్‌ తిరుపతిలో సెవెన్‌ స్టార్‌ లగ్జరీ విల్లా్‌సతో కూడిన రిసార్ట్స్‌ ఏర్పాటుకు 2021లో ముందుకొచ్చింది. దీనికి తిరుపతి రూరల్‌ మండలం పేరూరు గ్రామంలో 20 ఎకరాలను 66 ఏళ్ల లీజుకు కేటాయిస్తూ 2022 జూలై 4న జీవోఎంస్‌ నంబరు 12 జారీ అయ్యింది. 2023 జూలై 9న అప్పటి సీఎం జగన్‌ శంకుస్థాపన చేసినా అప్పట్లో నిర్మాణ పనులను ఆ సంస్థ మొదలుపెట్టలేదు. ఈ రిసార్ట్‌ ప్రాజెక్టు వ్యయం రూ.300 కోట్లు అని ఉండగా, ఒప్పందం నాటికి ప్రాజెక్టు వ్యయం రూ.వంద కోట్లకు తగ్గింది. దీని నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏడాదిగా బీజేపీ సహా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.


తిరుమల కొండల పాదాల చెంత ఇటువంటి హోటల్‌ ఏర్పాటు వల్ల సంస్కృతి పాడవుతుందన్నది వీటి వాదన. అందులో మాంసాహారం, మద్యపానం, స్పా మసాజ్‌ సెంటర్‌ వంటివి ఉంటాయని ఈ సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది హిందూయేతర మతానికి చెందిన సంస్థగా భావించి సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అయ్యాయి. దీనిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదిక పంపారు. మరోవైపు ఒబెరాయ్‌ సంస్థ ముంతాజ్‌ అన్న పేరుతో ఉన్న బోర్డును తొలగించి ట్రైడెంట్‌ గ్రూప్‌ అన్న పేరుతో బోర్డు ఏర్పాటు చేసింది. దీంతో నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్టు సమాచారం. రిసార్ట్స్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ఆ మేరకు తుడా నుంచీ ఇటీవలే అనుమతులు పొందిన ఒబెరాయ్‌ సంస్థ నిర్మాణ పనులు ప్రారంభించింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:53 AM