Share News

Chairman B R Naidu: తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు

ABN , Publish Date - Jun 18 , 2025 | 05:52 AM

తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు’ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనపై త్వరలో సెంట్రల్‌ ఏవియేషన్‌ విభాగానికి లేఖ రాస్తామని తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు.

Chairman B R Naidu: తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీవారి పేరు

  • సీఎస్ఐఆర్‌ నూతన ల్యాబ్‌కు తిరుపతిలో స్థలం

  • దళితవాడల్లోని వారికి అర్చక శిక్షణ: టీటీడీ చైర్మన్‌

తిరుమల, జూన్‌17(ఆంధ్రజ్యోతి): తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీవేంకటేశ్వర ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్టు’ అని పేరు పెట్టాలనే ప్రతిపాదనపై త్వరలో సెంట్రల్‌ ఏవియేషన్‌ విభాగానికి లేఖ రాస్తామని తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి అనుమతులు రాగానే తిరుమల, తిరుపతి వైభవం ఉట్టిపడేలా విమానాశ్రయ ఆధునికీకరణ పనులు ప్రారంభిస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం జరిగింది. అనంతరం వివరాలను పలువురు సభ్యులతో కలిసి చైర్మన్‌ మీడియాకు వివరించారు. మిరాశీ వ్యవస్థపై జూలై 1న వాయిదా ఉన్న క్రమంలో ఆ వ్యవస్థపై అవగాహన కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సుప్రీంకోర్డులో ఉన్న అంశం కావడంతో ప్రస్తుతం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. బెంగళూరులో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్‌ కోరారు. అక్కడ టీటీడీకి 47 ఎకరాల స్థలం ఉంది. దానికి సంబంఽధించిన ఫైల్‌ రెవెన్యూ విభాగంలో పెండింగ్‌ ఉందనే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ స్కీం కింద టీటీడీకి వంద ఎలక్ర్టిక్‌ బస్సులను ఉచితంగా ఇస్తామని కేంద్రమంత్రి కుమారస్వామి తెలిపారు. ఈ బస్సులు అందుబాటులోకి వస్తే ఆటో, ట్యాక్సీల నిలువుదోపిడీ నుంచి భక్తులను రక్షించవచ్చు. కేంద్రానికి చెందిన సీఎ్‌సఐఆర్‌ అత్యాధునిక పరికరాలతో తిరుపతిలో ల్యాబ్‌ పెట్టేందుకు ముందుకొచ్చిన క్రమంలో ఎకరా స్థలాన్ని లీజుకు ఇవ్వాలని తీర్మానించాం. ఇందులో టీటీడీకి చెందిన నెయ్యి, ముడిసరుకులను ఉచితంగా పరీక్షించి ఇస్తారు.


త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేస్తాం. ఎస్వీ కాలేజీలో సుమారు 200 మంది లెక్చరర్లు 22 ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయకుండా నూతన భర్తీలు చేయడం సరికాదని, నియామకాల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఏపీపీఎస్సీ 2రోజుల ముందు మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో దేవదాయశాఖ మంత్రితో పాటు చైర్మన్‌గా నన్ను, ఈవోతో కలిపి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అంశంపై స్టడీ చేసి జూలై మొదటివారంలో సీఎంకు నివేదిస్తాం. సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో దళితవాడల్లోని వారికి అర్చక శిక్షణతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలపై శిక్షణ ఇవ్వాలని తీర్మానించాం. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కోసం టీటీడీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సన్మార్గం’ పేరుతో త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.

Updated Date - Jun 18 , 2025 | 05:54 AM