TTD Chairman: తిరుమలలో రాత్రి అన్నప్రసాదంలోనూ వడలు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:59 AM
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో మధ్యాహ్నమే కాకుండా రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలను వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది.
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల, జూలై 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదంలో మధ్యాహ్నమే కాకుండా రాత్రి భోజన సమయంలోనూ భక్తులకు వడలను వడ్డించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు. ఆదివారం సాయంత్రం అన్నప్రసాద భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా భక్తులకు వడలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం నుంచి రాత్రి భోజనంలోనూ వడలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 70 వేల నుంచి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి పాల్గొన్నారు.