Helipad Incident: తోపుదుర్తికి బిగుస్తున్న ఉచ్చు
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:45 AM
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి పోలీసుల నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారంలో రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు.
హెలిప్యాడ్ ఘటనలో మళ్లీ విచారణకు పిలుపు
‘చలో పేరూరు’ కేసులో అరెస్టు భయంతో ఇప్పటికే అజ్ఞాతంలోకి మాజీ ఎమ్మెల్యే
కోర్టులో ముందస్తు బెయిల్ కోసం యత్నాలు
ఆయన కోసం పోలీసుల గాలింపు
పుట్టపర్తి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి పోలీసుల నుంచి మళ్లీ పిలుపు వచ్చింది. శ్రీసత్యసాయి జిల్లా కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనకు సంబంధించిన కేసులో వారంలో రోజుల్లో తమ ఎదుట హాజరు కావాలని రామగిరి సర్కిల్ పోలీసులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు. పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్యను పరామర్శించేందుకు ఏప్రిల్ 8న మాజీ సీఎం జగన్ వచ్చిన సమయంలో హెలిప్యాడ్ వద్ద వైసీపీ శ్రేణులు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. అక్కడ నానా రచ్చచేసి.. జగన్‌కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో విచారణ చేపట్టారు. తోపుదుర్తి సహా పలువురిపై కేసు నమోదుచేశారు. దాంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం హెకోర్టును అప్పట్లో ఆశ్రయించగా.. ఆయనకు సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులిచ్చి విచారించాలని.. దర్యాప్తునకు సహకరించకుంటే చట్టప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. నోటీసులివ్వడంతో తోపుదుర్తి గతనెల 16న పోలీసుల ఎదుట హాజరయ్యారు. కానీ వారి ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. ఈ కేసులో పైలట్‌అనిల్ కుమార్, కో-పైలట్ శ్రేయాస్ జైన్, సీకే పల్లి, రామగిరి, కనగానపల్లి, రాప్తాడు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాల్లో వంద మందికిపైగా వైసీపీ నాయకులు, కార్యకర్తలను రామగిరి సర్కిల్ కార్యాలయానికి పిలిపించి పోలీసులు విచారించారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఇటీవల రామగిరి మండలంలోని ఓ గ్రామంలో బాలికపై అత్యాచారం వివాదాస్పదమైంది.
బాధితురాలిని పరామర్శించేందుకు ‘చలో పేరూరు’ పేరిట ఈ నెల 12న తోపుదుర్తి శాంతిభద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినా బలప్రదర్శన చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే పేరూరుకు వెళ్లడానికి ప్రయత్నించారని తోపుదుర్తితోపాటు మరికొందరు వైసీపీ నేతలపై రామగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 13న పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చారు. అయితే అరెస్టు భయంతో ఆయన పోలీసుల కళ్లుగప్పి.. శంషాబాద్ చేరుకుని విమానంలో ముంబై వెళ్లిపోయారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు పెద్దఎత్తున గాలిస్తున్నారు. రెండు కేసుల్లో ఉచ్చు బిగుసుకుంటుండడంతో ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.