Temple Hundi Money: ఆలయంలో చోరీ.. నెల రోజుల తర్వాత ఊహించని ఘటన..
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:42 PM
దొంగతనం జరిగిన నెల రోజుల తర్వాత దొంగలు ఎవ్వరూ ఊహించని పని చేశారు. రాత్రి ఆలయ ఆవరణలో హుండీని వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం హుండీని గుర్తించారు ఆలయ కమిటీ సభ్యులు.
అనంతపురం: జిల్లాలో అత్యంత అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు దాన్ని తిరిగి తీసుకువచ్చారు. డబ్బులతో సహా ఆలయంలో వదిలేసి వెళ్లారు. బుక్కరాయసముద్రంలోని ముసలమ్మ దేవాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ దొంగలు హుండీని ఎందుకు తిరిగి తీసుకువచ్చారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జులై నెల చివర్లో ముసలమ్మ దేవాలయంలో దొంగలు పడ్డారు. డబ్బులు ఉన్న హుండీని ఎత్తుకెళ్లారు. ఆ సమయంలో హుండీలో సుమారు రూ.2లక్షల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది.
హుండీ చోరీపై పోలీసులకు ఆలయ కమిటీ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో అనుకోని సంఘటన వారికి ఎదురైంది. దొంగతనం జరిగిన నెల రోజుల తర్వాత దొంగలు ఎవ్వరూ ఊహించని పని చేశారు. రాత్రి ఆలయ ఆవరణలో హుండీని వదిలేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం హుండీని గుర్తించారు ఆలయ కమిటీ సభ్యులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హుటాహుటిన గుడికి చేరుకున్నారు. పోలీసులు, ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. హుండీలో రూ.1.86 లక్షలు ఉన్నట్లు తేలింది.
దొంగల లేఖ
గుడిలో చోరీకి పాల్పడ్డ దొంగలు ఆ హుండీలో ఒక లెటర్ కూడా వేశారు. ఆ లేఖలో.. ‘హుండీ చోరీ చేసిన తర్వాత మా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. అమ్మవారి ఆగ్రహం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్నాం. ఆ భయంతోనే డబ్బులు తిరిగి వదిలేస్తున్నాం. మా పిల్లల ఆసుపత్రి ఖర్చులకు కొంత డబ్బు వాడుకున్నాం. క్షమించండి అమ్మా..’ అని రాసి ఉంది.
ఇవి కూడా చదవండి
ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలు బోధించాలి: పవన్ కల్యాణ్
ఫోన్ నంబర్ లక్కీనో, కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి.!