Share News

పట్టపగలే చోరీ

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:56 PM

ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

   పట్టపగలే చోరీ
దొంగను చెట్టుకు కట్టేసిన కాలనీ వాసులు

దొంగను పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహాశుద్ధి చేసిన స్థానికులు

పోలీసుల అదుపులో దొంగ

ఆదోని, ఆదోని రూరల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ఓ ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న దొంగను స్థానికులు పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఆదోని పట్టణంలోని వైపీఆర్‌ కాలనీలో శుక్రవారం పట్టపగలు జరిగింది. స్థానిక మార్కెట్‌ యార్డులో కమీషన ఏజెంట్‌గా పత్తి వ్యాపారం చేస్తూ, ఆదోని పట్టణంలోని వైపీఆర్‌ కాలనీలో నివాసం ఉంటున్న గూళ్యం రమేష్‌, కుటుంబ సభ్యులు ఉదయం 11 గంటల తర్వాత ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి బయల్దేరారు. ఇది గమనించిన ఆదోని పట్టణం ఎల్‌బీ స్ర్టీట్‌కు చెందిన ఖాజామొహినుద్దీన అనే వ్యక్తి ఇంటికి ఉన్న తాళాన్ని పెకలించి లోపలికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న బీరువాను పగులగొట్టి 7తులాల బంగారు, 9 తులాల వెండి ఆభరణాలను దొంగలించాడు. దొంగ ఇంట్లో ఉండగానే అదే సమయంలో ఆసుపత్రికెళ్ళిన రమేష్‌ కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించి అవాక్కయ్యారు. ఇంతలో లోపల ఉన్న దొంగ ఇంట్లోంచి ఒక ఉదుటన బయటకు పరుగు తీశాడు. రమేష్‌ కుమారుడు కార్తీక్‌ దొంగ దొంగ అని గట్టిగా కేకలు వేయడంతో కాలనీవాసులు దొంగను వెంబడించి పట్టుకొని తాడుతో చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశాడు. దొంగ దగ్గర ఆభరణాలు కనిపించాయి. అనంతరం స్థానికులు తాలుక పోలీసులకు దొంగను అప్పగించారు. అయితే ఎస్‌.ఐ రామాంజనేయులు మాట్లాడుతూ తమ దగ్గరికి దొంగతనం కేసు రాలేదని, దొంగను ఎవరరూ అప్పగించలేదని సమాధానం ఇచ్చారు. ఈ విషయంపై సీఐ నల్లప్పను ఆంధ్రజ్యోతి పలకరించగా, దొంగను కాలనీ వాసులు పట్టుకొని తమకు అప్పగించిన మాట వాస్తవమేనని, రమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వివరణ ఇచ్చారు.

Updated Date - Mar 07 , 2025 | 11:56 PM