నెల రోజుల్లో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు పనులు ప్రారంభం
ABN , Publish Date - Jan 25 , 2025 | 11:27 PM
ఎగువ సీలేరులో నిర్మించే 1350 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఏపీ జెన్‌కో హైడల్ (జలవిద్యుత్ కేంద్రాల) డైరెక్టర్ సుజయ్‌కుమార్ తెలిపారు.

సీలేరు, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఎగువ సీలేరులో నిర్మించే 1350 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణ పనులు నెల రోజుల్లో ప్రారంభం కానున్నాయని ఏపీ జెన్‌కో హైడల్ (జలవిద్యుత్ కేంద్రాల) డైరెక్టర్ సుజయ్‌కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్‌కో అతిథిగృహంలో స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ..పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు కావలసిన అనుమతులన్నీ మంజూరయ్యాయని, ఒక్క అటవీ అనుమతులు రావాల్సి ఉందన్నారు. అవి మంజూరు కాగానే టెండర్లు దక్కించుకున్న మెగా కంపెనీ పనులు చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 180 మిలియన్ యూనిట్ల వరకు ఉందని, హైడల్, థర్మల్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తిని చేస్తున్నామన్నారు. వచ్చే మార్చి నాటికి విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశాలున్నాయని డైరెక్టర్ సుజయ్‌కుమార్ తెలిపారు. ఎన్‌హెచ్‌పీ భాగస్వామ్యంతో ఏపీ జెన్‌కో అనేక కొత్తప్రాజెక్టులను చేపడుతున్నదన్నారు. ఇప్పటికే 5070 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఏపీ జెన్‌కో 2027 ఫిబ్రవరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. మొదటి దశలో 2026 నాటికి రెండు యూనిట్లు వినియోగంలోకి తీసుకురానున్నామన్నారు. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం నిర్మించి 70 ఏళ్లు పైబడడంతో యూనిట్లలో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. యూనిట్లు ఆధునికీకరణ చేయడానికి వాటి స్పెర్ పార్టులు లభించకపోవడంతో పాత వాటినే రీ కండీషన్ చేయాల్సి వప్తోందని, దీనివల్ల ప్రాజెక్టులో తరచూ సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో యూనిట్లు ఆధునికీరణ చేసి ఉత్పత్తి సామర్థ్యం పెంచే దిశగా ఆర్‌ఎల్‌ఏ స్టడీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుతం మూడు యూనిట్లు అందుబాటులో ఉన్నాయని, మరో మూడు యూనిట్లు అందుబాటులో తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. పొల్లూరు జలవిద్యుత్తు కేంద్రంలో రెండో దశలో 5,6 యూనిట్ల నిర్మాణం పనులు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సి ఉండగా, సామగ్రి రావడంలో జాప్యం కావడంతో రెండు, మూడు నెలలు ఆలస్యం అవుతుందన్నారు. కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చే ఇంజనీర్లు, సిబ్బందికి వసతులు పూర్తి స్థాయిలో ఉన్నాయా? లేదా అని స్థానిక ఇంజనీర్లను ఆరా తీశారు. అనంతరం ఏపీ జెన్‌కో కాలనీని హైడల్ డైరెక్టర్ పరిశీలించారు. అనంతరం స్థానిక రెగ్యులేటర్ డ్యాం పరిశీలించి గేట్లు పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించే పార్వతీనగర్, టీఆర్‌సీ ప్రాంతాలను డైరెక్టర్ సుజయ్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో విద్యుత్ సౌదా సీఈ కోటేశ్వరరావు, సీలేరు కాంప్లెక్సు చీఫ్ ఇంజనర్ వాసుదేవరావు, ఎస్‌ఈ చంద్రశేఖర్‌రెడ్డి, చిన్న కామేశ్వరరావు, క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ కనకదుర్గ, ఈఈలు వరప్రసాద్, రాజేంద్రప్రసాద్,శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, ఏడీలు అప్పలనాయుడు, దుర్గా శ్రీనివాస్, ఏఈఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.