Share News

‘ఆర్‌డబ్ల్యూఎస్‌’లో కాంట్రాక్టర్ల పెత్తనం

ABN , Publish Date - Feb 17 , 2025 | 12:53 AM

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కార్యాలయంలో కాంట్రాక్టర్ల పెత్తనం పెరిగిపోయింది. మా పనుల బిల్లులు ఎందుకు చేయడం లేదంటూ ఉద్యోగుల వద్దకు నేరుగా వచ్చి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈఈ కార్యాలయం అధికారి ఎదురుగా కూర్చుని మరీ ఉద్యోగులను పిలిచి నిలబెట్టి అనధికార పెత్తనం చలాయిస్తున్నారు. కాంట్రాక్టర్ల తీరుతో మహిళా ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కంప్యూటర్‌ ఒక్కటే ఉండటంతో ఒకరి తర్వాత ఒకరం పనులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా వినిపించుకోకుండా కాంట్రాక్టలతో కలిసి ఈఈ ఉద్యోగులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

‘ఆర్‌డబ్ల్యూఎస్‌’లో కాంట్రాక్టర్ల పెత్తనం

- ఈఈ కార్యాలయం ఉద్యోగులతో దురుసు ప్రవర్తన

- మా బిల్లులు ఎందుకు రెడీ చేయడంలేదని ఆగ్రహం

- మనస్తాపానికి గురవుతున్న మహిళా ఉద్యోగులు

- కంప్యూటర్‌ ఒక్కటే ఉండటంతో ఆలస్యమవుతున్న పనులు

- ఉద్యోగులపై కలెక్టర్‌కు కాంట్రాక్టర్లతో కలిసి ఇన్‌చార్జి ఈఈ ఫిర్యాదు

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కార్యాలయంలో కాంట్రాక్టర్ల పెత్తనం పెరిగిపోయింది. మా పనుల బిల్లులు ఎందుకు చేయడం లేదంటూ ఉద్యోగుల వద్దకు నేరుగా వచ్చి దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈఈ కార్యాలయం అధికారి ఎదురుగా కూర్చుని మరీ ఉద్యోగులను పిలిచి నిలబెట్టి అనధికార పెత్తనం చలాయిస్తున్నారు. కాంట్రాక్టర్ల తీరుతో మహిళా ఉద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కంప్యూటర్‌ ఒక్కటే ఉండటంతో ఒకరి తర్వాత ఒకరం పనులు చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నా వినిపించుకోకుండా కాంట్రాక్టలతో కలిసి ఈఈ ఉద్యోగులపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం గమనార్హం.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కార్యాలయాన్ని గుడివాడ నుంచి ఇటీవల మచిలీపట్నం మార్చారు. నోబుల్‌ కళాశాలకు ఎదురుగా ఉన్న బందరు సోడా, కిళ్లీ, బీడీ వర్తక సంఘం భవనంలో ఈ కార్యాలయాన్ని కలెక్టర్‌ ఆదేశాలతో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయంలో ఈఈగా ఎవరూ లేకపోవటంతో డీఈ స్థాయి అధికారినే ఇన్‌చార్జిగా కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఉద్యోగులు పనిచేసేందుకు కంప్యూటర్లు, సరిపడా గదులు లేవు. కార్యాలయంలో ఉన్న ఒకే కంప్యూటర్‌ను ఐదు విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కార్యాలయానికి సంబంధించిన బిల్లులు, ఇతరత్రా పరిపాలనా పరమైన అంశాలకు సంబంధించిన పనులు చేయాలంటే ఒకరు పనిచేస్తుంటే మిగిలినవారు కంప్యూటర్‌ ఎప్పుడు ఖాళీ అవుతుందా అని ఎదురుచూడాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో వివిధ పనులపై కాంట్రాక్టర్లు కార్యాలయానికి వచ్చి మా పనులు ఎందుకు పూర్తికాలేదని ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. రాత్రి మీకు ఫోన్‌ చేస్తే ఎందుకు సమాధానం చెప్పలేదంటూ దురుసుగా మాట్లాడుతున్నారు. దీంతో మహిళా ఉద్యోగులు ఏం మాట్లాడలేక, తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక కుంగిపోతున్నారు.

పనిచేయడంలేదని కలెక్టర్‌ వద్ద పంచాయితీ!

ఇటీవల కాలంలో రెండు సార్లు కలెక్టర్‌ చాంబరుకు ఇన్‌చార్జి ఈఈ తమను తీసుకువెళ్లారని ఉద్యోగులు చెబుతున్నారు. సక్రమంగా పనిచేయాలని కలెక్టర్‌ మొదటిసారి చెప్పారన్నారు. ఆ సందర్భంలో కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని తామంతా కలెక్టర్‌కు విన్నవించామని ఉద్యోగులు తెలిపారు. అయినా రెండోసారి అకారణంగా తమను మళ్లీ కలెక్టర్‌ వద్దకు తీసుకువెళ్లారని, మా పరిస్థితిని అర్థం చేసుకున్న కలెక్టర్‌ ఏం మాట్లాడలేదన్నారు. కాంట్రాక్టర్లు ఇన్‌చార్జి ఈఈ ఎదుటనే తమపట్ల దురుసుగా మాట్లాడుతుంటే వారించాల్సింది పోయి మా పనితీరు బాగోలేదని రెండు మార్లు కలెక్టర్‌ వద్దకు మమ్ములను తీసుకువెళ్లారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా ఉద్యోగికి వేధింపులు

ఇటీవల జరిగిన బదిలీల్లో పెద్దవయసున్న మహిళా ఉద్యోగి ఒకరు ఈఈ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. ఆమె అనారోగ్య కారణాలతో కొంతమేర పనిచేయడంలో వెనుకబడుతున్నారు. దీంతో ఆమెకు తరచూ మెమోలు జారీ చేయడం, సస్పెండ్‌ చేస్తామని బెదిరిస్తున్నారని సమాచారం. అనారోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని సదరు మహిళా ఉద్యోగిని ఈఈ కార్యాలయం నుంచి వేరే కార్యాలయానికి బదిలీ చేసి, వేరే ఉద్యోగిని ఇక్కడ నియమించుకునే అవకాశం ఉంది. అయినా ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఈ మహిళా ఉద్యోగిని వేధించడంపై కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసేందుకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నీచర్‌ తదితర వసతులు సమకూరిస్తే పనులు త్వరితగతిన పూర్తిచేస్తామని ఉద్యోగులు అంటున్నారు. ఉద్యోగులను వేధింపులకు గురిచేయడం, కాంట్రాక్టర్‌ ఉద్యోగులను దూషించడాన్ని ఇకపై సహించబోమని, ఈ అంశంపై మూకుమ్మడిగా ఆందోళనకు దిగుతామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Feb 17 , 2025 | 12:54 AM