Paritala: రిపబ్లిక్ ఆఫ్ పరిటాల
ABN , Publish Date - Aug 15 , 2025 | 06:25 AM
ఉద్యమ నేతలు 1947 నవంబరు 15వ తేదీన పరిటాల రిపబ్లిక్‌ను ప్రకటించారు. మాదిరాజు దేవరాజును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే తిరుగుబాటుదార్లను దేశద్రోహులుగా చిత్రీకరించి, నిజాం ప్రభుత్వం వారిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది...
నిజాం అరాచకాలపై తిరుగుబాటు చేసి..
స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్న ‘దేశం’
ఇండియా రిపబ్లిక్‌గా మారాక అందులో విలీనం
పరిటాలకు చరిత్ర పుటల్లో విశిష్ట స్థానం
21 మంది కేంద్ర కమిటీ సభ్యులతో పరిపాలన
ప్రత్యేక రాజ్యాంగమూ రూపకల్పన
అవినీతి, అక్రమాలకు తావులేని సుపరిపాలన
గణతంత్ర దేశంగా భారత్ ఆవిర్భవించడానికి రెండేళ్ల ముందే ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లాలోని ‘పరిటాల’ ప్రాంతం ప్రత్యేక గణతంత్ర దేశంగా ఏర్పడిన సంగతి మీకు తెలుసా? తనకంటూ సొంత రాజ్యాంగం రాసుకుని ఏడాదికి పైగా ప్రజలకు అవినీతి, అక్రమాలకు తావులేని సుపరిపాలనను అందించిందని తెలుసా? పంద్రాగస్టు నేపథ్యంలో నాటి పరిటాల రిపబ్లిక్‌పై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

పరిటాల రిపబ్లిక్ ఆవిర్భావం..
ఉద్యమ నేతలు 1947 నవంబరు 15వ తేదీన ‘పరిటాల రిపబ్లిక్’ను ప్రకటించారు. మాదిరాజు దేవరాజును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే తిరుగుబాటుదార్లను దేశద్రోహులుగా చిత్రీకరించి, నిజాం ప్రభుత్వం వారిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. ఇండియన్ యూనియన్ గ్రామాల మీదుగా తమ బలగాలు పరిటాల వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిజాం కోరడంతో మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదే విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ మలయప్పన్ పరిటాల రిపబ్లిక్ కేంద్ర కమిటీ సభ్యులకు తెలిపారు. నిజాం బలగాలకు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ పరిటాల విశ్వనాఽథం, మాదిరాజు మాధవరావు, బండి వెంకయ్య, అవ్వా సత్యనారాయణ బృందం మద్రాస్ ప్రభుత్వం వద్దకు వెళ్లి, హోం మంత్రి సుబ్బరాయన్‌కు పరిస్థితి వివరించింది. మాదిరాజు సీతారామరాజు, మన్నెం చినకోటయ్యల బృందం ఢిల్లీ వెళ్లి గాంధీజీని, ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఉపప్రధాని-హోం మంత్రి సర్దార్ పటేల్ తదితరులను కలిసింది. ఎక్కడికక్కడ ఘర్షణలు జరుగుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కూడా నివేదికలు పంపడంతో నిజాం బలగాలకు మద్రాస్ ప్రభుత్వం అనుమతి రద్దు చేసింది. అప్పట్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, స్వామి రామానంద తీర్ధ, కోదాటి నారాయణరావు, రావి నారాయణరెడ్డి, టి.హయగ్రీవాచారి, ప్రకాశం పంతులు, కాకాని వెంకటరత్నం, జయప్రకాశ్ నారాయణ్ తదితర నేతలు పరిటాలను సందర్శించి ఉద్యమానికి మద్దతు పలికారు.
మద్య నిషేధం... కుల మతాలకు అతీతం
హైదరాబాద్ సంస్థానంపై 1948 సెప్టెంబరు 17న భారత ప్రభుత్వం పోలీసు చర్యకు దిగడంతో నిజాం పదవీచ్యుతుడయ్యాడు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. ఆ తర్వాత భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా పరిటాల రిపబ్లిక్ కేంద్ర కమిటీ సభ్యులే భారత్‌లో కలిసిపోతామని ఢిల్లీ పెద్దలకు విజ్ఞప్తిచేశారు. వారి ఆమోదంతో పరిటాల రిపబ్లిక్ ఇండియాలో విలీనమైంది. ఏడాదికిపైగా స్వతంత్రంగా కొనసాగిన పరిటాల రిపబ్లిక్ దేశంలోనే మొదటి రిపబ్లిక్‌గా చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందింది.

(విజయవాడ/కంచికచర్ల -ఆంధ్రజ్యోతి): 1950 జనవరి 26వ తేదీన ‘భారత రిపబ్లిక్’ ఆవిర్భవించింది. కానీ... అంతకంటే ముందే మనదేశంలోనే ఒక ప్రాంతం ‘రిపబ్లిక్’గా ఏర్పడింది. నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి... తనకుతాను స్వతంత్రం ప్రకటించుకుంది. అదే ‘పరిటాల రిపబ్లిక్’! దీనికి ఘనమైన చరిత్ర ఉంది. హైదరాబాద్ కేంద్రంగా 1724లో నిజాం రాజ్యం ఏర్పడిన తర్వాత నిజాం ఆలీఖాన్.. ఆరు ఆంధ్ర జిల్లాలను బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించారు. అయితే... విజయవాడ సమీపంలోని పరిటాలతో పాటుగా గని ఆత్కూరు, మోగులూరు, బత్తినపాడు (కంచికచర్ల మండలం), ఉస్తేపల్లి, కొడవటికల్లు (చందర్లపాడు మండలం), మల్లవల్లి (నూజివీడు ప్రాంతం) గ్రామాలను మాత్రం తన అధీనంలోనే ఉంచుకున్నాడు. ఇక్కడ విలువైన వజ్రాలు దొరుకుతుండడమే కారణం. ఈ ఏడు గ్రామాలతో పరిటాలను ప్రత్యేకంగా ‘కానాత్’గా ప్రకటించి, పోలీసుస్టేషన్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశాడు. నిజాం పాలనలో దురాగతాలకు, దౌర్జన్యాలకు అడ్డే లేదు. రజాకార్ల ఆగడాలతో ధన, మాన, ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి జడలు విప్పింది. ఈ అరాచక పాలనతో జనం విసిగి వేసారిపోయారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొందరు పరిటాల యువకులు నిజాం దురాగతాలను ఎండగడుతూ.. ప్రజలకు మద్దతుగా నిలిచారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చినా... నిజాం పాలనకు మాత్రం తెరపడలేదు. అది ‘ప్రత్యేక సంస్థానం’గా కొనసాగింది. ఈ క్రమంలో పరిటాల ప్రజల్లోనూ స్వాతంత్య్రకాంక్ష రగిలింది. నిజాం సంకెళ్ల నుంచి విముక్తికి నడుం బిగించారు. ప్రభుత్వ ఉద్యోగులను నిర్బంధించారు. కొడవటికల్లులో ఎస్‌ఐపై దాడిచేశారు. అంతకు ముందు నరరూప రాక్షసుడుగా పేరొందిన ప్రభుత్వ ఉద్యోగి లంకా సుబ్బయ్య శాస్ర్తిని హత్య చేశారు. 1947 నవంబరు 12 అర్ధరాత్రి పోలీసు స్టేషన్‌పైనే దాడిచేసి తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూ కార్యాలయాన్ని, సబ్ ట్రెజరీని తమ అధీనంలోకి తీసుకున్నారు. భయపడిన పోలీసు, రెవెన్యూ అధికారులందరూ హైదరాబాద్‌కు పారిపోయారు.

పరిటాల రాజ్యాంగ రూపకర్త..
పరిటాల రిపబ్లిక్‌కు ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని రూపొందించిన అవ్వా సత్యనారాయణ పరిటాలవాసి. అక్కడే పుట్టారు. హైదరాబాద్‌లో చదువుకుని బారిస్టర్ పూర్తి చేశారు. 1946 నాటికి ప్రముఖ ప్లీడర్‌గా పేరొందారు. మాదిరాజు రామ్మోహనరావు, నరసింహారావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. వాక్‌చాతుర్యంతో పాటుగా న్యాయశాస్త్రంపై పట్టు కలిగిన ఆయన పరిటాల రిపబ్లిక్‌ను భారతదేశంలో విలీనం చేసేందుకు మద్రాస్, ఢిల్లీ ప్రభుత్వాల పెద్దలతో రాయబారాలు నడిపారు.
నిజాంపై తిరగబడిన తిరుపతయ్య
బత్తినపాడులో దళిత సామాజిక వర్గానికి చెందిన మాదాసు తిరుపతయ్య పరిటాల ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తిని ఆయుధంగా మలచుకుని నిజాంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. కేంద్ర కమిటీ సభ్యుడైన చిలంకూరి బ్రహ్మయ్య తొలుత బత్తినపాడుకు పటేల్‌గా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయనతో కలిసి తిరుపతయ్య నిజాం ఆగడాలను ప్రతిఘటించారు. చివరివరకు నిరాడంబర జీవితం గడిపారు.
జనరంజక పాలన..
పరిటాల రిపబ్లిక్ పాలన కోసం ప్రతి గ్రామం నుంచి ముగ్గురేసి సభ్యుల వంతున మొత్తం 21 మందితో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాదిరాజు దేవరాజు.. ఉపాధ్యక్షుడిగా మాగంటి కోటి రామయ్య ఉన్నారు. పలు ప్రభుత్వ శాఖలను ఏర్పాటు చేశారు. ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. మద్య నిషేధాన్ని పటిష్ఠంగా అమలు చేశారు. ఆదాయం, ఖర్చులకు సంబంధించి పారదర్శకంగా లెక్కలు చూపించారు. చెరువులకు మరమ్మతులు చేశారు.
ప్రమాణపత్రం
రిపబ్లిక్‌కు కంకణబద్ధుడిగా ఉంటానని ప్రతి సభ్యుడితో ఆరోజుల్లో ప్రమాణం చేయించారు. దీని కోసం ప్రత్యేకంగా గ్రామ క్షేమ ప్రమాణ పత్రాన్ని రూపొందించారు. ‘బయటి నుంచి వచ్చే ప్రమాదాలను, అవాంతరాలను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే భేదం లేకుండా కలిసికట్టుగా ధైర్యంగా ఎదుర్కొందాం, ఇతర మతాల వారికి నష్టాలను కలుగచేయం’ అని అందులో పొందుపరిచారు.
మాదిరాజు గుంటూరు వాసి..
పరిటాల రిపబ్లిక్ అధ్యక్షుడిగా పనిచేసిన మాదిరాజు దేవరాజు 1918లో గుంటూరులో జన్మించారు. తండ్రి ఉద్యోగరీత్యా ఆయన చదువంతా హైదరాబాద్‌లో సాగింది. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పార్శీ భాషలపై మంచి నైపుణ్యం కలిగిన ఆయనకు యోగాలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. స్వామి రామానంద తీర్ధ సలహా మేరకు పరిటాల ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారు. మంచి మాటకారి, సమయస్ఫూర్తి కలిగిన దేవరాజు ఎనలేని ప్రజాభిమానం పొందారు.

నిజాంకు ఎదురొడ్డి పోరాడిన షేక్ మౌలా
ఈ ఉద్యమంలో చెప్పుకోదగిన పోరాటయోధుడు షేక్ మౌలా. ముస్లిం అయిన మౌలా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం విశేషం. కొందరు మత పెద్దలు తలపై చెప్పులు పెట్టి అవమానించినప్పటికీ తన ప్రాణాలు ఫణంగా పెట్టి స్వేచ్ఛ కోసం పోరాడాడు. నిజాం మూకలు ఆయన్ను హత్య చేయబోతే హిందువులు రహస్యంగా ఓ ఇంట్లో దాచి కాపాడారు. మౌలా పోరాట స్ఫూర్తి అందరినీ కదిలించింది.
