Share News

ఆదర్శనేత దామోదరం సంజీవయ్య

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:31 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆదర్శ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్‌ రంజిత బాషా కొనియాడారు.

   ఆదర్శనేత దామోదరం సంజీవయ్య

నిజాయితీకి మార్గదర్శకుడు

కలెక్టర్‌ రంజిత బాషా

- ఘనంగా సంజీవయ్య 104వ జయంతి వేడుకలు

కర్నూలు ఎడ్యుకేషన, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఆదర్శ నాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారని కలెక్టర్‌ రంజిత బాషా కొనియాడారు. ఆయన ఒక వర్గం, మతానికే కాకుండా ప్రతి ఒక్కరికి మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు అని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 104వ జయంతి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. కర్నూలు కలెక్టరేట్‌ నుంచి విద్యార్థులు, అధికారులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ గాయత్రీ ఎస్టేట్‌, సీక్యాంప్‌ మీదుగా నంద్యాల చెక్‌పోస్ట్‌ వరకు సాగింది. అక్కడ దామోదరం సంజీవయ్య కూడలిలో సంజీవయ్య విగ్రహానికి కలెక్టర్‌ రంజిత భాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బొగ్గుల దస్తగిరి, ఆర్డీఓ కిడారి సందీప్‌ కుమార్‌, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ తులసిదేవి, దళిత, ప్రజా సంఘాల నాయకులు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ రంజిత బాషా మాట్లాడుతూ నీతికి, నిజాయితికి దామోదరం సంజీవయ్య ప్రతీకగా నిలిచారన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి, ఉన్నత విద్యను అభ్యసించి, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ఏఐసీసీలో ఉన్నత పదవులను ఆలంకరించారన్నారు. ఆయన నిరంతరం పేదల అభివృద్ధికే కృషిచేశారన్నారు. నిరుపేదలకు 6 లక్షల ఎకరాలను పంపిణీ చేశారన్నారు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయ్యంలో ఉద్యోగ,కార్మికులకు బోనస్‌ ఇచ్చి, బోనస్‌ మంత్రిగా పేరు తెచ్చుకున్నారని వివరించారు. కర్నూలు జిల్లాల్లో దామోదరం సంజీవయ్య పుట్టడం జిల్లాకే గర్వకారణం అన్నారు. కర్నూలుకు దామోదరం సంజీవయ్య పేరును ఏర్పాటు చేసేందుకుకు రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని కలెక్టర్‌ రంజిత భాషా వివరించారు. ఆయన జీవిత చరిత్రను పుస్తకాల రూపంలో ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ వృద్ధులకు ఫించన్లు పంపిణీ చేసిన మొట్టమొదటి సీఎం దామోదరం సంజీవయ్య అన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలో పుట్టి ఎన్నో ఉన్నత పదవులు చేపట్టారన్నారు. అవినీతి అధికారుల గుండెల్లో సింహ స్వప్నంగా వెలిగారన్నారు. అనంతరం జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందచేశారు. ఈ కార్యక్రమంలో దామోదరం సంజీవయ్య అన్న కుమారుడు దామోదరం రాధాకృష్ణ, సంజీవయ్య మేనల్లుడు ఎర్రమ పాండురంగయ్య, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స మానిటరింగ్‌ కమిటీ సభ్యులు ఎరుకల రాజు, కాసారపు వెంకటేష్‌, టీఎస్‌ఎఫ్‌ చంద్రప్ప, నాయకులు వీరభద్రుడు, అనంతరత్నం, త్యాగరాజు, కైలాస్‌ నాయక్‌, సోమసుందరం, సామేల్‌, సామన్న, షేక్‌ అర్షద్‌, దూరదర్శన డైరెక్టర్‌ రంగస్వామి, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2025 | 11:31 PM